Rewind 2024 Telangana: కవిత అరెస్ట్, కాళేశ్వరం వివాదం, మూసీ రగడ, పుష్ప 2 ఫైర్... ఎక్కడా తగ్గని 2024
Rewind 2024 Telangana: కవిత అరెస్ట్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు, ఫార్మూలా -ఈ కారు రేసులో కేటీఆర్ పై కేసు నమోదు వంటి ఘటనలు ఈ ఏడాది బీఆర్ఎస్ ను అతలాకుతలం చేశాయి.
Rewind 2024 Telangana: కవిత అరెస్ట్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు, ఫార్మూలా -ఈ కారు రేసులో కేటీఆర్ పై కేసు నమోదు వంటి ఘటనలు ఈ ఏడాది బీఆర్ఎస్ ను అతలాకుతలం చేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ తన హవాను కొనసాగించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగింది. హైడ్రా, మూసీ పునరుజ్జీవంలో వెనకడుగువేసే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై వేర్వేరుగా జ్యుడిషీయల్ కమిషన్లు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటులు అల్లు అర్జున్ అరెస్టై మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు.
మలుపులు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అప్పట్లో పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినవారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ సర్కార్ విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న అరెస్టయ్యారు. రాధాకిషన్ రావు రిటైర్డ్ అధికారి. మిగిలిన వారంతా సర్వీసులో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎస్ఐబీ ఓఎస్‌డీగా ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసులో ఏ1 గా ఉన్నారు. ఈ కేసు నమోదయ్యే సమయానికి ఆయన అమెరికాకు వెళ్లారు. అక్కడి నుంచి ఆయనను తీసుకు వచ్చేందుకు పోలీసులు ఇంటర్ పోల్‌ను ఆశ్రయించారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం పంపారు.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు కూడా అమెరికాలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. 2023 డిసెంబర్ 4న ఇంటలిజెన్స్ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ యంత్రాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని.. ఫోన్ ట్యాపింగ్ కు ఉపయోగించిన కంప్యూటర్ల హార్డ్ డిస్కులను తీసుకెళ్లారనే ఆరోపణలతో ఆయనపై 2024 మార్చి 10న కేసు నమోదైంది. మార్చి 12న ఆయనను అరెస్ట్ చేశారు ఇంటలిజెన్స్ కార్యాలయం నుంచి తీసుకెళ్లిన హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు మూసీలో డిసెంబర్ 4న పారేశారు. విచారణలో ఈ విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. 2024 మార్చి 22న మూసీ నుంచి కంప్యూటర్లు, సామాగ్రి సాక్ష్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారని తెలుస్తోంది.
ఐదున్నర నెలలు జైల్లోనే కవిత
దిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను 2024 మార్చి 15న సాయంత్రం ఐదున్నర గంటలకు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెను అరెస్ట్ చేసినట్టు ఈడీ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. అరెస్టుకు ముందు కవిత ఇంట్లో నాలుగు గంటలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కవితను అరెస్ట్ చేసిన విషయాన్ని అదే రోజు సాయంత్రం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. లిక్కర్ స్కాంపై 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది.
అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం మేరకు కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 మార్చి 15న సుప్రీంకోర్టులో ఆమెకు ఊరట లభించింది. ఏడాది తర్వాత అదే రోజున ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఆమె గడిపారు. 2024 ఆగస్టు 27న ఆమెకు బెయిల్ లభించింది. అదే రోజు రాత్రి ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె ఉద్వేగానికి గురయ్యారు. తనను జైలుకు పంపి జగమొండిని చేశారని చెప్పారు. తనను తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
హైడ్రాతో దూకుడుతో రేవంత్ కు ఇబ్బందులు
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నివారణకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ . దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 జులై 19న 99 జీవోను విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధితోపాటు శివారు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, గ్రామ పంచాయితీల పరిధిలోని 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పనిచేస్తోంది.
హైదరాబాద్ మాదాపూర్ లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని అందిన ఫిర్యాదులతో ఈ ఏడాది ఆగస్టు 24న హైడ్రా కూల్చివేసింది.3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసింది. అయితే చెరువును ఆక్రమించి తాను నిర్మాణాలు చేయలేదని అప్పట్లో సోషల్ మీడియాలో సినీ నటులు నాగార్జున ప్రకటించారు. కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయించారు నాగార్జున. కోర్టులో ఆయనకు ఊరట లభించింది. అయితే అప్పటికే కూల్చివేతలు పూర్తయ్యాయి.
ప్రభుత్వ భూమిని, చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని ఈ ఘటనతో ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఆ తర్వాత పేద, మధ్యతరగతికి చెందిన ఇళ్ల కూల్చివేతలపై విపక్షాలు ప్రభుత్వం తీరును తప్పుబట్టాయి. హైడ్రా కూల్చివేతలపై కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేసిన సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లు గుర్తించకుండా అక్రమ నిర్మాణాలు అని ఎలా చెబుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ల నిర్మాణాల గుర్తింపు పని చేపట్టారు. మరో వైపు అక్రమ నిర్మాణాలైనా అందులో నివాసం ఉంటే వాటిని కూల్చమని హైడ్రా ప్రకటించింది. తాజాగా హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లబోమని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చెప్పారు. ఈ ఐదు నెలల్లో హైడ్రా 120 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. 314 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది.
మూసీ పునరుజ్జీవనంపై తగ్గేదేలే
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముూసీ పునరుజ్జీవం కోసం ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 55 కి.మీ పాటు మూసీ నదిని పునరుజ్జీవం కోసం ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేసింది. దీనిపై రెండు సంస్థలకు డీపీఆర్ లు ఇచ్చింది. మూసీ వెంట నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూసీ వెంట ఉన్న 12 వేల మందికి పునరావాసం కల్పించనుంది.
అయితే బాధితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ పరిధిలో మూడు నాలుగు చోట్ల స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. మరికొందరు బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించారు. రివర్ బెడ్‌లో 2,166, బఫర్ జోన్‌లో 7851 ఇళ్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీరికి 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారు. బాధితులు మాత్రం మూసీ పునరుజ్జీవం పేరుతో తమను ఇళ్లను ఖాళీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. అప్పులు తెచ్చి కట్టుకున్న ఇళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని కన్నీరు పెట్టుకుంటున్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని విపక్షాలు హామీ ఇస్తున్నాయి. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను బీజేపీ సర్కార్ చేయలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బాపుఘాట్ నుంచి వెనక్కి 21 కిలోమీటర్లు తొలివిడతలో మూసీ పునరుజ్జీవ పనులు చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి డీపీఆర్ తయారీ కోసం మెయిన్ హార్ట్ అనే సంస్థకు టెండర్ ఇచ్చింది. దీని కోసం 150 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ డీపీఆర్ ఆధారంగా మూసీ పనులను ప్రారంభించనున్నారు. మూసీలోకి గోదావరి నీటిని పంపింగ్ చేయాలని కూడా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితిని సీఎం నవంబర్ 8న స్వయంగా పరిశీలించారు. ఈ ఏడాది ఆరంభంలో లండన్‌లో థేమ్స్ నదిని రేవంత్ రెడ్డి పరిశీలించారు. థేమ్స్ తరహలో మూసీ ప్రక్షాళన కోసం ఈ ఏడాది ఆరంభంలో లండన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ మేయర్ దక్షిణ కొరియా సియోల్‌లో పర్యటించారు. సియోల్‌లోని నది తరహాలో మూసీని పునరుజ్జీవం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
బీఆర్ఎస్ కు వరుస దెబ్బలు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఏడాది మేలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రిగా తొలిసారిగా ఆయన పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఈ వలసలు కొనసాగాయి.
10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి , అరికెపూడి గాంధీ హస్తం నీడకు చేరారు. దండె విఠల్, ఎం.ఎస్ ప్రభాకర్, భాను ప్రసాద్, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారానికి దూరమైంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా ఆ పార్టీ గెలవలేదు. 2019 లో 9 సీట్లలో ఆ పార్టీ గెలిచింది. ఐదేళ్ల తర్వాత ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ బలం పెంచుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 8 ఎంపీ సీట్లు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లలో గెలిచింది. 2019లో ఆ పార్టీకి మూడు సీట్లే ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఎక్కువగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా హరీష్ రావు, కేటీఆర్ పాల్గొంటున్నారు. కవిత కూడా ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో తిరిగి పాల్గొంటున్నారు.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు బిగుస్తున్న ఉచ్చు
ఫార్మూలా-ఈ కారు రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్దంగా నిధుల బదలాయింపు, అగ్రిమెంట్ కు ముందే నిధులు ఎఫ్ఈఓకు చెల్లించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేటీఆర్ ను ఏ 1 గా చేర్చారు. అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను A2 గా, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏ3 గా చేర్చారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ డిసెంబర్ 20న హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, ఏసీబీ విచారించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫార్మూలా-ఈ కారు రేసుపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన దాన కిశోర్ నుంచి ఏసీబీ అధికారులు స్టేట్ మెంట్ తీసుకున్నారు.
ఛత్తీస్ గడ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను నామినేషన్ పై బీహెచ్ఈఎల్ కు ఇవ్వడంపై అవకతవకలున్నాయనే ఆరోపణలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఈ ఏడాది నవంబర్ 29న ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికపై ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం చర్చిస్తోంది. కేబినెట్ లో చర్చించి ప్రాసిక్యూషన్ కు అనుమతివ్వాలా.. లేదా కమిషన్ నివేదిక ఆధారంగా కేసు పెట్టాలా.. అనే దానిపై ప్రభుత్వం అధ్యయనం చేయనుంది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై 2024 మార్చి 14న పినాకిని చంద్ర ఘోష్ నేతృత్వంలో జ్యుడిషీయల్ కమిటీ ఏర్పాటైంది. 100 రోజుల్లో కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. విచారణకు సమయం సరిపోని కారణంగా మూడుసార్లు పొడిగించింది. డిసెంబర్ చివరివరకు గడువును పొడిగించింది ప్రభుత్వం. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్ మేరకు జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పుష్ప 2 హీరో అల్లు అర్జున్ వివాదం
రాజకీయ వేడికి ఈ ఏడాది చివరలో పుష్ప ఫైర్ కూడా తోడైంది. డిసెంబర్ 4 రాత్రి బెనిఫిట్ షో థియేటర్లో చూడడానికి పుష్ప-2 హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్సులోని సంధ్య థియేటర్‌కు వెళ్లినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య అల్లాడడం పెను వివాదంగా మారింది. ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ -11గా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంటరిమ్ బెయిల్ ఆలస్యం కావడంతో ఒక రాత్రి అల్లు అర్జున్ జైల్లో గడపాల్సి వచ్చింది.
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన ప్రసంగం సినిమా రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దానికి స్పందనగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ప్రెస్ మీట్ వల్ల అల్లు అర్జున్‌కు మేలు కన్నా కీడే ఎక్కువ జరిగిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఆ తరువాత చిక్కడపల్లి పోలీసులు హీరోను స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించారు. ఈ వివాదంలో కోర్టు నిర్ణయం తేలాల్సి ఉంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి చివరకు ఏదో ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire