BRS: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం.. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు

Reviews of BRS Assembly Constituencies
x

BRS: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం.. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు

Highlights

BRS: ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పూర్తి

BRS: గులాబీ పార్టీలో పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు ముగిశాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇవాళ్టి నుంచి క్షేత్రస్థాయి రివ్యూ చేయనున్నారు. రోజుకు దాదాపు పది నియోజకవర్గాల చొప్పున సమీక్షించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడమే లక్ష్యంగా సమీక్షలు చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలో గత ఎన్నికలకు సంబంధించిన పూర్తిస్థాయి రివ్యూ చేసుకోవడంతో పాటు.. ఆ ఎన్నికల పోలింగ్ సరళి, స్థానికంగా గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న అంశాలపై విస్తృతంగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. దీంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశాల నిర్వహణ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు తీసుకోనున్నారు.

ఇక మొదటి రోజు అసెంబ్లీ సమీక్షలో భాగంగా ఇవాళ సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ సమీక్షకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతుండగా.. బోథ్ నియోజకవర్గం సమీక్షకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసులు హాజరుకానున్నారు. ఇక రెండో రోజయిన ఆదివారం వర్ధన్నపేట, మెదక్, సిరిసిల్ల, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించనున్నారు. 29వ తేదీన ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల్ నియోజకవర్గల సమావేశాలు నిర్వహిస్తారు.

మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత గుణపాఠాలు నేర్చుకుని.. రానున్న రోజుల్లో పార్టీ ఎమ్మెల్యే సెంట్రింగ్‌గా కాకుండా.. పార్టీ కార్యకర్తల కేంద్రంగా పనిచేయాలని భారత రాష్ట్ర సమితి సమాయత్తమవుతుంది. పార్లమెంటు సమీక్ష సమావేశాల్లో కార్యకర్తల నుంచి కీలక సమాచారం తీసుకున్న పార్టీ అధినేత కేసీఆర్... కొందరితో ఫోన్లో మాట్లాడారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. దీంతో అసెంబ్లీ నియోజకవర్గం రివ్యూ సమావేశాలు పార్టీకి ఎంతో ఇంపార్టెంట్‌గా మారనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories