Hyderabad As Indore: హైదరాబాద్‌ను ఇండోర్ తరహాలో క్లీన్ సిటీగా మార్చాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... ఇంతకీ ఇండోర్ స్పెషాలిటీ ఏంటి?
Revanth Reddy on Indore: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని ఒకరు, లేదు లేదు అమెరికాలోని డాలస్‌లా మార్చేస్తామని మరొకరు చెప్పడం మనం విన్నాం. కానీ,...
Revanth Reddy on Indore: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని ఒకరు, లేదు లేదు అమెరికాలోని డాలస్‌లా మార్చేస్తామని మరొకరు చెప్పడం మనం విన్నాం. కానీ, తొలిసారిగా హైదరాబాద్‌ను భారతదేశంలోని మరో నగరంతో పోల్చి చెబుతూ, ఆ సిటీలా హైదరాబాద్‌ని కూడా క్లీన్‌గా చూడాలన్నదే తన ఆశయం అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
ఆయన ప్రస్తావించిన నగరం ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలా హైదరాబాద్‌ను కూడా క్లీన్ సిటీగా మార్చాలని అధికారులను ఆయన ఆదేశించారు. దాంతో, ఇప్పుడు ఇండోర్ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఏంటి, ఇండోర్ నగరం గొప్ప? అది మరీ అంత శుభ్రంగా ఉంటుందా? నిజంగానే, ఆ నగరం అంత పరిశుభ్రంగా ఉంటే, దేశంలోని మిగతా నగరాలు అలా ఎందుకు మారడం లేదు? ఇండోర్ బాట పడితే హైదరాబాద్ కూడా క్లీన్ సిటీగా మారిపోతుందా?
ఏంటి ఇండోర్ సిటీ స్పెషాలిటీ?
ఇండోర్... దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం. ఇందులో సందేహం లేదు. భారతదేశంలోని క్లీన్ సిటీగా ఇండోర్ వరసగా ఏడు సార్లు అవార్డ్ దక్కించుకుంది. స్వచ్ఛభారత్ సాధనే లక్ష్యంగా కేంద్రం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్‌లో ఇండోర్ వరుసగా ఏడుసార్లు క్లీనెస్ట్ సిటీగా అవార్డులతో ''క్లీన్ స్వీప్" చేసింది. దీనినిబట్టే తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న అక్కడి అధికారులు, పౌరుల చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారు?
మన దేశంలో నగరాలు, పల్లెల పరిశుభ్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలే తమ నగరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఆ వివరాలను ఎప్పటికప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ మేనేజ్మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టంలో పొందుపరుస్తారు. ఆ తరువాత కేంద్రం ఆయా నగరాల పౌరుల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. అంతిమంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ నగరం అత్యంత పరిశుభ్రంగా ఉందనే విషయాన్ని పరిశీలించిన తరువాత తుది జాబితాను విడుదల చేస్తుంది. అందులో ర్యాంక్ కొట్టిన నగరమే “ది క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా” అని అనిపించుకుంటుంది. 2016 లో స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్ ప్రకటించడం మొదలైన రోజుల్లో 25వ స్థానంలో ఉన్న ఇండోర్ నగరం ఆ తరువాత ఏడాది కాలంలోనే ఏకంగా నెంబర్ 1 స్థానానికి దూసుకురావడమే కాదు.. ఆ స్థానాన్ని గత ఏడేళ్లుగా అంతే పదిలంగా కాపాడుకుంటోంది.
ఈ అద్భుతం ఎలా మొదలైంది?
ప్రధానమంత్రి మోదీ 2015లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించినప్పుడు ఇండోర్‌లోని ఒక ప్రభుత్వ అధికారి తన ఇండోర్ నగరాన్ని స్వచ్ఛంగా మార్చడాన్ని ఒక సవాలుగా తీసుకున్నారు. ఆయనే మనీష్ సింగ్. అప్పట్లో ఆయన ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నారు.
2016లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ఆ సర్వేలో నగరాన్ని మెరుగైన స్థానంలో నిలపాలని మనీష్ సింగ్ నిశ్చయించుకున్నారు. అందుకోసం, ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా… పౌరుల నివాసాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగు పరిచే కార్యక్రమాన్ని అమలు చేయడం. అదీ తొలి అడుగు. ఒక ఊరు, పట్టణం, నగరం లేదా దేశం శుభ్రత ఇంటి నుంచే మొదలు కావాలన్నది అక్కడ ఆయన నిరూపించారు.
ఆ తరువాత ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే వ్యవస్థను పటిష్టం చేశారు. మున్సిపల్ వాహనాలు పాడైపోయి మూలన పడిపోకుండా మున్సిపల్ వర్క్‌షాప్ ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకు జట్లు జట్లుగా శిక్షణ ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 8,000 మంది పారిశుధ్య కార్మికులను ఆన్-సైట్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ద్వారా బాధ్యతగా పని చేసేలా చేశారు.
డోర్ టూ డోర్ గార్బేజ్ కలెక్షన్ వ్యవస్థను మొదట రెండు వార్డులతో ప్రారంభించారు. తరువాత 10 వార్డులకు, ఆ తరువాత మొత్తంగా 525 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 85 వార్డులకు విస్తరించారు. దీంతో, కమ్యూనిటీ డస్ట్ బిన్స్ చెత్తతో నిండిపోయి, బయటకు పొంగిపోయి పశువుల అడ్డాగా మారిపోయే పరిస్థితి లేకుండా పోయింది. 2015కు ముందు ఈ నగరంలోని 1,300 చెత్త కుండీలు దుర్గంధాన్ని చిమ్ముతూ ఉండేవి. ఇప్పుడు ఎక్కడా కమ్యూనిటీ డస్ట్ బిన్స్ లేవు. 2016 నాటికి అంటే ఒక్క ఏడాది కాలంలో నగరమంతా డోర్-టు-డోర్ గార్బేజ్ కలెక్షన్ వ్యవస్థలోకి మారిపోయింది.
ఈరోజున నగరంలో 11,000 మంది సఫాయి కార్మికులు పని చేస్తున్నారు. దాదాపు 2,000 గార్బేజ్ కలెక్షన్ వాహనాలు పని చేస్తున్నాయి. 2018లో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ “రెడ్యూస్.. రీయూజ్, రీసైకిల్” కార్యక్రమంపై దృష్టి సారించింది. ఆ మరుసటి ఏడాది హోమ్ కంపోస్టింగ్ పద్ధతులను ప్రోత్సహించే ప్రణాళికలు అమలు చేసింది. హోమ్ కంపోస్టింగ్ అంటే ఇంట్లోని ఆర్గానిక్ వ్యర్థాలను తోటల పెంపకానికి ఎరువులుగా మార్చుకోవడం. ఆ తరువాత ప్రజలెవరూ నీటి కాల్వల్లోకి, నదుల్లోకి మురుగు నీరు వదలకూడదని కోరుతూ తగిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఒక వైపు నదులు, కాల్వల్లోని చెత్తను తొలగించే పనులు చేస్తుంటే, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది.
ప్రజల ప్రవర్తనలోనూ మార్పు...
ఇండోర్‌లోని ఓ స్టార్ బక్స్‌లో కాఫీ తాగిన ఓ మహిళ ఆ పేపర్ కప్పును రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఆ కప్పును ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోను వేలాది మంది కీప్ ఇండోర్ క్లీన్ అనే యాష్ ట్యాగ్‌తో షేర్ చేశారు. చివరకు, ఆ మహిళ తాను కాఫీ తాగిన స్టార్ బక్స్ షాప్ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు. దీనికి కారణం, అక్కడి స్టార్ బక్స్ సంస్థ కాఫీ కప్పు మీద దాన్ని కొనుక్కున్న వారి పేరు ప్రింట్ చేసి ఇస్తుండడమే.
ఒక ఆటోలోంచి లేదా టాక్సీలోంచి ఎవరైనా ఖాలీ వాటర్ బాటిల్ పడేసినా, టెట్రా ప్యాక్ పడేసినా కర్మచారీ సఫాయీలు ఆ బండిని ఆపి, అందులోని వ్యక్తితో తాను పడేసిన చెత్తను తీయించేస్తారు. ఇలాంటి వార్తలు అక్కడి పత్రికల్లో చాలా కనిపిస్తాయి. ఇప్పుడు ఆ నగరంలో రోడ్డు మీద ఉమ్మి వేయడాన్ని చాలా పాపంగా చూస్తారు. ఇలాంటివన్నీ నగరంలో బలమైన సామాజిక మార్పును ప్రేరేపించాయి.
ప్రతీ రోజూ 1900 టన్నుల చెత్త అంతా ఏమైపోతుంది?
ఇండోర్ మరీ అంత చిన్న నగరమేమీ కాదు. అక్కడ 35 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇక్కడ ప్రతీరోజూ సేకరించే చెత్త 1900 టన్నుల వరకు ఉంటుంది. అందులో 1200 టన్నుల వరకు పొడి చెత్త ఉంటే.. మరో 700 టన్నులు తడి చెత్త ఉంటుంది. ఇళ్లు, దుకాణ సముదాయాల నుండి మొత్తం 850 వాహనాల్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తామని ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తెలిపారు.
వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఆ చెత్తను వారు ఇంధనం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఎక్కడైనా మునిసిపాలిటీ వాళ్లు చెత్తను తడిచెత్త, పొడిచెత్త అని కేవలం రెండురకాలుగానే వేరు చేస్తారు. కానీ, ఇండోర్ మునిసిపాలిటీ మరో అడుగు ముందుకేసి డంపింగ్ యార్డులోని చెత్తను ఆరు రకాలుగా ఫిల్టర్ చేసిన తరువాత ఇంధనం తయారయ్యే ప్లాంట్‌కి చేరవేస్తుంది. అలా చెత్త నుంచి తయారయ్యే ఇంధనంతోనే అక్కడి రోడ్ల మీది బస్సులు పరుగులు తీస్తుంటాయి.
హైదరాబాద్‌లో ఈ మాడల్ పని చేస్తుందా?
భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్ తరహాలో హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం అక్షరాలా హర్షణీయమైన నిర్ణయం. అక్కడి ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థల పనితీరును అధ్యయనం చేసి హైదరాబాద్ కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన కోరారు. ఇండోర్ ఏమీ మరో ఖండంలోని నగరం కాదు. మన దేశంలోని నగరమే. అక్కడ అమలు చేస్తున్న ప్రణాళికలు అంత కష్టమైనవి కూడా ఏమీ కాదు. కాకపోతే, అంతకు మించిన మంచిని సాధించాలన్న సంకల్పం మన అధికారుల్లో ఉంటే అది సాధ్యమవుతుంది.
ఈ దిశగా కేసీఆర్ సర్కార్ కూడా చాలా ముందుకు వెళ్ళింది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ హయాంలో డోర్-టు-డోర్ గార్బేజ్ కలెక్షన్ వ్యవస్థను విస్తరించారు. 5,250 స్వచ్ఛ ఆటో టిప్పర్స్‌ను కూడా గత ప్రభుత్వం రంగంలోకి దింపింది. తడి-పొడి చెత్త విషయంలో ప్రజల్లో అవగాహన పెంచడంలోనూ గత ప్రభుత్వం కృషి చేసింది. ఈ కృషిని ఇప్పుడు మరింత నిష్టగా ముందుకు తీసుకువెళ్ళాల్సి ఉంది. ఈ విషయంలో అధికారులు, కార్మికుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం ప్రస్తుత ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన సవాలు. దీనికితోడు ఇందులో స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాల్సి ఉంది. పెరుగుతున్న నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని గార్బేజ్ కలెక్షన్స్ వెహికిల్స్ సంఖ్యను పెంచాలి. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచాలి. వీటికితోడు, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ జర్దా కిళ్లీలు నమిలి ఉమ్మేయం, ఇంట్లోని మురుగు నీటిని వీధుల్లోకి వదిలేసే కల్చర్ నుంచి నగరాన్ని విముక్తం చేసేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించే పనిని ఒక ఉద్యమంలా చేపట్టాలి.
ఇక, గత ఏడాది నవంబర్ నెలలో 500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్న, మాంట్ ఫోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ సభలో చేసిన తీర్మానాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ కార్మికులు తమకు గుర్తింపు కార్డు కావాలని, చెత్తతో పని చేస్తున్న తమకు ఆరోగ్య బీమా ఇవ్వాలని, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని... చిన్న చిన్న కోర్కెలను ప్రభుత్వం ముందుంచారు. వాటిని పరిష్కరించి, వారిని పటిష్టం చేసి... ప్రభుత్వం నగరాన్ని పరిశుభ్రంగా కాపాడే సైన్యం లాంటి వ్యవస్థను నిర్మించాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire