Rain Alert: తెలంగాణకు వర్ష సూచన..నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Rain Alert: తెలంగాణకు వర్ష సూచన..నేడు పలు జిల్లాల్లో వర్షాలు
x
Highlights

Rain Alert: తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Rain Alert: తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశలో గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఎలాంటి వర్షం హెచ్చరికలు లేవని తెలిపింది.

ఇక ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో మాత్రం కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. నేడు వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలో రేపు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మత్స్య కారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరోవైపు తెలంగాణల చలి తీవ్రత పెరుగుతోంది. చలి ప్రభావంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ, పొగమంచు కమ్ముతోంది. పొగ మంచు కారణంగా తెల్లవారుజామున రహదారులపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలపై చలి తీవ్ర ప్రభావం చూపుతుండగా..ప్రయాణికులు సైతం వణుకుపోతున్నారు. పొగమంచులో ప్రయాణం మంచిదికాదని..తగ్గించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ఉదయం వేళల్లో పొగ మంచు ఎక్కువగా కురుస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి.నగర శివారు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు దిగువన పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్య దిశలో ఉపరితల గాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కాగా చలి తీవ్రతను తట్టుకునే విధంగా ఉన్ని దుస్తులు ధరించాలని అవసరం అయితేనే బయటకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories