సమీపిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ టూర్

Rahul Gandhis Telangana Tour is Approaching
x

సమీపిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ టూర్

Highlights

Telangana: వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్

Telangana: రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ దగ్గర పడుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. అన్ని రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ పర్యటన పైనే చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఉపయోగించిన పాలిటిక్స్ వేరు ఇప్పుడు ఉపయోగిస్తున్న పాలిటిక్స్ వేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా దూకుడుగా వెళ్తుంది. సెంటిమెంట్ రాజకీయాలు చేసే టీఆర్‌ఎస్‌ను అదే సెంటిమెంట్ తో దెబ్బకొట్టాలని చూస్తోంది. ఓయూ విద్యార్థులు ఉద్యమానికి ఊపిరి పోశారు. ఇప్పుడు అదే ఓయూ కేంద్రంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ.. రాష్ట్ర ఆకాంక్షలు ఎంత వరకు నెరవేరాయని ముచ్చటించడానికి సిద్ధమైంది. అనుమతి ఇవ్వకున్న రాహుల్ గాంధీని ఓయూకు తీసుకెళ్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెగేసి చెబుతున్నారు. దీంతో రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గాంధీ కుటుంబవారసుడు రాహుల్ గాంధీ ఓయూకి వెళ్తే తప్పేంటనే భావనను జనాల్లోకి బలంగా తీసుకెళ్తుంది.

మరోవైపు రాహుల్ గాంధీ ఓయూ పర్యటన అనుమతి కోరుతూ నిరసన చేపట్టిన NSUI విద్యార్థులను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టారని PCC చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు జగ్గారెడ్డి, గీతారెడ్డి లాంటి నేతలు చంచల్ గూడ జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. అక్కడితో ఆగకుండా జైలు సూపరింటెండెంట్ ని కలిసి మే7న రాహుల్ గాంధీ ములాఖత్ కావడానికి అనుమతి కోరారు. ములాఖత్ హక్కు కాబట్టి కచ్చితంగా ఇవ్వాల్సిందే.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో 7న గాంధీ భవన్ లో రాహుల్ గాంధీతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని ఈ కార్యక్రమంతో బయటపెట్టనుంది. మరోవైపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 8,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని ప్రభుత్వం విస్మరించడంతో రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు కుటుంబాలతో ముచ్చటించనున్నారు. రైతు డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. దీంతో రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెబుతూ రైతులను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం రాహుల్ ద్వారా జరుగుతుంది.

మొత్తం మీద గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ సెంటిమెంట్ రాజకీయాలు పండించేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా వస్తున్న మైలేజ్ బాగానే ఉన్నా భవిష్యత్ లో ఈ సెంటిమెంట్ అధికారపార్టీని ఏమేరకు దెబ్బకొడుతుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories