టీపీసీసీ రేసులో ఉన్నదెవరు.. సడెన్‌గా తెరపైకి వచ్చిన పేర్లేంటి?

టీపీసీసీ రేసులో ఉన్నదెవరు.. సడెన్‌గా తెరపైకి వచ్చిన పేర్లేంటి?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ రేసు హైఓల్టేజీ పెంచుతోంది. రోజుకొక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముందు నుంచీ వినపడుతున్న పేర్లు వెనక్కివెళుతున్నాయి....

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ రేసు హైఓల్టేజీ పెంచుతోంది. రోజుకొక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముందు నుంచీ వినపడుతున్న పేర్లు వెనక్కివెళుతున్నాయి. హస్తినలో కొందరు నేతలు తిష్టవేసి మరీ, పీసీసీ కుర్చీ కోస కుస్తీ పడుతున్నారు. అసలు టీపీసీసీ రేసులో ఉన్నదెవరు సడెన్‌గా తెరపైకి వస్తున్నదెవరు?

నిన్నమొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పీఠం కోసం మళ్ళీ సందడి ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తరువాత, పీసీసీ మార్పు కోసం అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. రిజల్ట్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఢిల్లీకే వెళ్లడంతో ఆ ప్రచారం మరింత ఉధృతమైంది.

ఇక ఉత్తమ్ సైతం రాజీనామాకు సిద్ధపడ్డారని, రాజీనామా లేఖను అధిష్టానానికి ఇచ్చారని, ప్రస్తుతం అది పెండింగులో ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఉత్తమ్ పదవీకాలం కూడా ముగియడం, ఆయన నేతృత్వంలో పార్టీ అపజయాలనే మూటగట్టుకోవడంతో, కొత్త సారథిని నియమించేందుకు హైకమాండ్ డిసైడ్ అయిందన్న లీకులు హస్తిన నుంచి మొదలయ్యాయి. అందుకోసం రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున ఊహాగానాలు ఊపందుకోవడంతో ఆశావహులు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించారు. అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. గ్రూపులు కట్టి రాజకీయం నడిపిస్తున్నారు. అధిష్టానానికి తమ ఆసక్తిని తెలిపేందుకు హస్తిన బాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

పీసీసీ మార్పుకు ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో కొత్త అధ్యక్షుడెవరన్న చర్చ హస్తం పార్టీలో మొదలైంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు, నిన్నా మొన్నటి వరకు ప్రముఖంగా వినిపించాయి. ఉత్తమ్ ను కాదంటే అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలని కొందరు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేక వర్గంలో రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందని, యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న రేవంత్‌కే ఇవ్వాలని మరొక వర్గం పట్టుబడుతోంది. ఒక దశలో ఉత్తమ్ ను తప్పించి రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రెడీ అయినట్లు కూడా కాంగ్రెస్ లో ప్రచారం జరిగింది. అయితే హుజూర్ ఉప ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో పెద్ద దుమారమే రేపాయి.

పార్టీలోని సీనియర్లంతా ఏకమై రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. వ్యతిరేక వర్గమంతా సంతకాలు సేకరించి హైకమాండ్ కు పంపించారట. దాంతో రేవంత్ విషయంలో ఢిల్లీ పెద్దలు పునరాలోచనలో పడ్డట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా కొంతమంది రేవంత్ శ్రేయోభిలాషులు ఢిల్లీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక మరో వర్గం మాత్రం మొదటి నుంచి పార్టీలో పని చేసిన వివాదరహితులకు ఇవ్వాలని అధిష్టానానికి సూచనలు చేస్తున్నారట. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం నేత పీసీసీ చీఫ్ గా ఉన్నందున, ఈ దఫా రెడ్డియేతర సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అందులో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పీసీసీ పీఠం కోసం ఆయనకు పెద్దగా ఆసక్తిగా లేకపోయినప్పటికీ, పార్టీలో కీలకంగా ఉన్న ఒక నేత శ్రీధర్ బాబుకు మద్దతు కూడగతున్నట్లు, ఆయన కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది.

ఇక జానారెడ్డి, జీవన్ రెడ్డిలో ఎవరికిచ్చినా పార్టీలో పెద్దగా వ్యతిరేకత ఉండదని మరికొందరు సూచిస్తున్నారట. అదలా ఉంచితే పార్టీ సీనియర్ నేత విహెచ్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. వయసును సాకుగా చెప్పి కొందరు తనపై తప్పుడు నివేదికలు ఢిల్లీకి పంపుతున్నారని, కానీ గతంలో షీలా దీక్షిత్ కు, మొన్నటి హర్యానా ఎన్నికల్లో హుడాకు అవకాశం ఇచ్చారని, వారు పార్టీకి మెరుగైన ఫలితాలు తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. హస్తినలో ఆయన కూడా తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఎవరికి వారు పార్టీ అధ్యక్ష పదవికోసం సైలెంట్ గా పనిచేసుకుంటుండగా, తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెరమీదకు దూసుకొచ్చారు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పే జగ్గారెడ్డి, తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని బహిరంగంగానే ప్రకటించారు. ఎప్పుడూ పెద్దగా రాష్ట్రం దాటని జగ్గారెడ్డి, ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సోనియా, రాహుల్ , అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, కుంతియాను కలిసి పీసీసీ చీఫ్ తనకివ్వాలని కోరాలని డిసైడ్ అయ్యారట. తనకు అవకాశం ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రమంతా తిరుగుతానని, సీఎం పదవి ఆశించకుండా అధ్యక్ష బాధ్యతలు నెరవేరుస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు. అంతేకాదు ఆ పదవిపై కన్నేసిన వారుకూడా సీఎం పదవిని ఆశించోద్దని కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు జగ్గారెడ్డి. అయితే పదవి ఆశిస్తున్న జగ్గారెడ్డి సహా మరికొందరు నేతలు మాత్రం మున్సిపల్ ఎన్నికల తర్వాతే అధ్యక్ష మార్పు చేయాలని హైకమాండ్ కు సూచిస్తున్నారు. మరి కాంగ్రెస్ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories