Pulses Prices: ఊహించని విధంగా పెరిగిన పలు రకాల పప్పుల ధరలు..!

Pulses Price Increases Predominantly Across the Country
x

Pulses Prices: ఊహించని విధంగా పెరిగిన పలు రకాల పప్పుల ధరలు..!

Highlights

Pulses Prices: నిన్న మొన్నటి వరకు ఉల్లి గడ్డ, టమాటా, తదితర కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటడంతో సతమతమైన ప్రజలను... ఇప్పుడు పప్పుల ధరలు పరేషాన్‌ చేస్తున్నాయి.

Pulses Prices: నిన్న మొన్నటి వరకు ఉల్లి గడ్డ, టమాటా, తదితర కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటడంతో సతమతమైన ప్రజలను... ఇప్పుడు పప్పుల ధరలు పరేషాన్‌ చేస్తున్నాయి. కూరగాయల ధరలు కొంత మేరకు అందుబాటులోకి వచ్చాయని ఊపిరి పీల్చుకుంటుండగానే పప్పుల ధరలు అమాంతం పెరగడం వారి ఆందోళనకు కారణమవుతోంది.

ప్రతీ ఇల్లు, హోటళ్లలో ప్రధానంగా వినియోగించే కంది పప్పు ధర దాదాపు రెట్టింపయింది. ఇతర పప్పుల ధరలు కూడా కిలోకు 30 నుంచి 40 రూపాయలకు పైగా పెరిగాయి. రాష్ట్రంలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు సాగు చేసినా... వాతావరణం అనుకూలించక దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవడంతోనే పప్పుల ధరలు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అపరాల పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గడమే పప్పుల ధరలు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు వ్యాపారులు... పూర్వం అపరాల పంటలకు ప్రాధాన్యత ఉండేది. కానీ నీటి వనరులు పెరగడం, వాణిజ్య పంటలతో అధిక ఆదాయం ఉండటంతో రైతులు అటే మొగ్గు చూపుతున్నారు.

కందిపప్పు ధర ఊహించని విధంగా పెరిగింది. పంట సీజన్‌ ఫిబ్రవరిలో రకం ఆధారంగా కిలోకు 95 నుంచి 105 రూపాయల వరకు ధర పలికింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో గరిష్టంగా 110 రూపాయలు, జూన్‌లో 135 రూపాయలకు కిలో లభించిన కంది పప్పు ధర ఇప్పుడు ఏకంగా 175 నుంచి 185 రూపాయలు పలుకుతోంది. మారుమూల ప్రాంతాల్లోనయితే ఏకంగా 200 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కంది పంట సాగు చేస్తారు. కంది పప్పులో అకోల, నాగపూర్‌ రకాలకు డిమాండ్‌ ఎక్కువ.. దీంతో ఈ రకాల ధర ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగింది. తాండూరు, దేశీయ రకం కంది పప్పుకు డిమాండ్‌ ఉండడంతో ధర నానాటికీ పెరుగుతోంది.

కంది పప్పుతోపాటు పెసర, మినప వంటి పప్పుల ధరలు కూడా పెరిగాయి. కిలోకు రకం ఆధారంగా 30 నుంచి 40 రూపాయల వరకు పెరిగాయి. పెసర పప్పు ధర సీజన్‌లో గరిష్టంగా 100 రూపాయలు పలకగా, ఇప్పుడు 120 రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారు. 80 నుంచి 90 రూపాయలు పలికిన మినప పప్పు ధర 120 రూపాయలకు పైగానే పలుకుతోంది. శనగ పప్పు ధర సీజన్‌లో 65 నుంచి 70 రూపాయలు ఉండగా.. ఇప్పుడు వందకు చేరువైంది.

రాష్ట్రంలో వినియోగానికి తగిన విధంగా పంట సాగు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి పప్పులను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లోనే సాగు విస్తీర్ణం తగ్గగా... పప్పుల ధరలు బాగా పెరుగుతున్నాయి. 2015 సంవత్సరంలో అనుకూలించని వాతావరణంతో పప్పుల ధరలు భారీగా పెరగ్గా... ప్రభుత్వం రైతుబజార్లు, రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేసింది. మళ్లీ ఇప్పుడు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుటుందనేది వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories