Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రైతుల ఆందోళన

protest of farmers in Nizamabad district Armoor
x

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రైతుల ఆందోళన 

Highlights

Nizamabad: మామిడిపల్లి రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా

Nizamabad: ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఇందూరు రైతులు పోరుబాట పట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మహాధర్నా చేపట్టారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ప్రతిపక్షాలు సహా వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో ఆర్మూర్ పట్టణంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ముందు ధర్నాకు అనుమతి లేదనడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం శాంతియుత ధర్నాకు అనుమతించడంతో మామిడిపల్లి రోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు.

షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఎకరానికి 7 వేల 500 రూపాయల చొప్పున ఇస్తామన్న రైతుభరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పెట్టుబడి డబ్బులు వస్తాయనే ఆశతో రైతులు వేరే దగ్గర అప్పులు కూడా తెచ్చుకోలేదని వాపోయారు.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారని రైతులు ఆరోపించారు. రైతులకు మంచిచేస్తే నాయకులను ఇంటికి ఎందుకు పంపిస్తామని ప్రశ్నించారు. రైతులకు ద్రోహం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

ఎన్నికలకు ముందు ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మాట మార్చిందని ఆరోపిస్తున్నారు రైతులు. ప్రతి కుటుంబానికి ఎలాంటి షరతుల్లేకుండా రైతు రుణమాఫీ, రైతుభరోసాను చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసే వరకూ పోరాటం ఆగదని ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 లోపు సంపూర్ణ రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి గడువు విధించింది. ఆలోపు చేయకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories