కరీంనగర్‌ కాంగ్రెస్‌లో పొన్నం శపథమేంటి?

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో పొన్నం శపథమేంటి?
x
Highlights

ఆ జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాలు ఒకప్పుడు కళకళలాడేవి. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కొందరు గోడ దూకుతుంటే, మరికొందరు దర్జాగా మరో పార్టీ తీర్థం...

ఆ జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాలు ఒకప్పుడు కళకళలాడేవి. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కొందరు గోడ దూకుతుంటే, మరికొందరు దర్జాగా మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనంటూ, ఇఫ్పుడూ ఆ పార్టీ గట్టిగా అరుస్తున్నా, వెనకాల కోరస్‌ ఇచ్చే కార్యకర్తలే కరువయ్యారు. అయితే, ఒక నాయకుడు మాత్రం, తమ పార్టీ ఫీనిక్స్‌ పక్షిలా ఎగసిపడుతుందని శపథం చేస్తున్నారు.

ఒకప్పుడు కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ, ఓ వెలుగు వెలిగింది. నిన్నమొన్నటి వరకు కూడా బలమైన క్యాడర్‌తో, లీడర్లతో కళకళలాడింది. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకులు-కార్యకర్తల మధ్య గ్యాప్ పెరుగుతూ పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, బిజీబిజీగా ఉండటంతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా ఇతర లీడర్లపై దృష్టి పెట్టకపోవడం, నగరంలో ఇటు బిజెపి అటు టిఆర్ఎస్ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో, ఇటు బిజెపి, అటు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులకు గాలం వేసే ప్రయత్నం చేశారన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కరీంనగర్ నగరానికి చెందిన, పలువురు కాంగ్రెస్ కీలక నాయకులు కొందరు బీజేపీలోకి వెళితే, మరికొందరు టిఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. దీంతో ఇప్పుడు కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలం బాగా తగ్గిపోయిందన్న చర్చ సాగుతోంది.

ముఖ్యంగా కరీంనగర్ పట్టణం కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న కర్ర రాజశేఖర్, కరీంనగర్ మాజీ మేయర్ శంకర్, ఒకరు బిజెపిలో చేరితే మరొకరు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరు పొన్నం ప్రభాకర్‌కు అత్యంత సన్నిహిత నాయకులు. ఒక్కమాటలో చెప్పాలంటే వీరిద్దరూ కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ లో చాలా రోజుల నుంచి కీలకంగా వ్యవహరించిన వారు. అయితే వారితో పాటు కొంతమంది కార్యకర్తలను కూడా తీసుకొని వెళ్లడంతో, పొన్నం ప్రభాకర్‌పై, అదే పార్టీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పొన్నం కరీంనగర్‌పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లే ఇబ్బంది వచ్చిందని, సొంత పార్టీలోనే చర్చ జరిగింది. అయితే దీన్ని పొన్నం ప్రభాకర్ మాత్రం బహిరంగాగనే కొట్టిపారేస్తున్నారు.

పాత నాయకులు పోతే పోనివ్వండి, వచ్చే ఎన్నికల్లో యువకులను, కొత్త నాయకులుగా తయారు చేసి చూపిస్తా అంటూ పొన్నం ప్రభాకర్ దీటుగా స్పందించారు. కాంగ్రెస్‌కి కష్ట సమయంలో అండగా ఉండాల్సిన నాయకులు, తమ స్వార్థం కోసం పార్టీ మారినంత మాత్రాన పార్టీ బలహీనపడే అవకాశం లేదంటూ ఇటీవల ఆయన మాట్లాడారు. అయితే తాను కూడా ఎన్‌ఎస్‌యుఐ నాయకుడిగా ఈ స్థాయికి వచ్చానని, పాతతరం నాయకులు పోతే కొత్తతరాన్ని ప్రోత్సహించి వారిని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్‌ అంటున్నారాయన.

సో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పట్టణంలో, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే కొత్త నాయకులను తయారు చేసే పనిలో పడ్డారట. ముఖ్యంగా మేధావులు, యువకులు కాంగ్రెస్ పార్టీతో నడవాలి అంటూ పిలుపు కూడా ఇచ్చారట పొన్నం. పార్లమెంటు ఎన్నికల తర్వాత కరీంనగర్లో మళ్ళీ వాయిస్ వినిపించిన పొన్నం ప్రభాకర్, ఇకపై పార్టీని బలంగా మార్చే పనిలో ఉంటారు అంటూ ఆయన అనుచరులు చెబుతున్నారు.

మరోవైపు తమ బలాన్ని పెంచుకునేందుకు ఇటు బిజెపి, అటు టిఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా వ్యూహప్రతివ్యూహాలు వేస్తున్నాయి. ఇన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటంతో, కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురైందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్‌తో పాటు జిల్లాకు సంబంధించిన కీలకమైన నేతలు కొంత దృష్టి పెడితే పార్టీ పునరుత్తేజమవుతుందని సొంత పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories