TS Polling Close: ముగిసిన పోలింగ్.. హైదరాబాద్‌లో అత్యల్పంగా నమోదయిన పోలింగ్

Polling Season Has Ended In Telangana
x

TS Polling Close: ముగిసిన పోలింగ్.. హైదరాబాద్‌లో అత్యల్పంగా నమోదయిన పోలింగ్

Highlights

TS Polling Close: రూరల్‌తో పోల్చితే అర్బన్‌లో తగ్గిన పోలింగ్ శాతం

TS Polling Close: తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లలో నిలబడ్డవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని స్పష్టం చేశారు.

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.

గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తక్కువగా నమోదయింది. 2018 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదైంది. రూరల్‌లో పోల్చితే అర్బన్‌లో తక్కువ పోలింగ్ నమోదు అయింది. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 80.28శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది.

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబరు 3న ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories