కొల్లాపూర్ రణక్షేత్రానికి ఆ ఇద్దరి కోల్డ్ వారే కారణమా?
మొన్నటి వరకు వారిద్దరూ శత్రువులు. పచ్చగడ్డి వేసినా, వేయకున్నా భగ్గుమనేంత వైరం. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉంటూ కత్తులు దూశారు. మొన్నటి ఎన్నికల వరకు...
మొన్నటి వరకు వారిద్దరూ శత్రువులు. పచ్చగడ్డి వేసినా, వేయకున్నా భగ్గుమనేంత వైరం. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉంటూ కత్తులు దూశారు. మొన్నటి ఎన్నికల వరకు కూడా వాళ్లిద్దరూ ప్రత్యర్థులే. ఒక నేతపై మరొకరు గెలిచారు. దీంతో ఒక మంత్రి మాజీ అయ్యారు. మరో నేత తాజా అయ్యారు. సీన్ కట్ చేస్తే, ఆ ఇద్దరు బద్దశత్రువులు ఇప్పుడు ఒకే పార్టీ. అందులోనూ అధికార పార్టీ. ఇంకేముంది నాడు పరోక్షంగా యుద్ధం చేస్తే, ఇఫ్పుడు ఒకే పార్టీలో ఉండి కత్తులు దూస్తున్నారు. ఇద్దరూ ఒకే కార్యక్రమానికి వస్తే, నియోజకవర్గంలో యుద్దమే. అధికారులు, పోలీసులు వారి మధ్య కోల్డ్‌వార్‌లో నలిగిపోతున్నారు. బలవంతంగా బదిలీ చేయించుకుని, మూటముల్లె సర్దుకుని వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఎక్కడ ఆ యుద్దక్షేత్రం పగలు సెగలతో రగిలిపోతున్న ఆ ఇద్దరు నేతలెవరు?
జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన మాజీ మంత్రి. భీం హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లిపై గెలిచిన నాయకుడు. ఎన్నికల ప్రచారంలో తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టుకున్నారు. మసాలా దట్టించి మరీ విమర్శలు చేసుకున్నారు. ఒక రేంజ్‌లో ఫైట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రత్యర్థులు ఒకే పార్టీ. కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్, టీఆర్ఎస్ గూటికి చేరడంతో, ఇప్పుడు ఈ అరవీరభయంకర శత్రువులు ఒకే గొడుగు కిందకు వచ్చారు ఇప్పుడు కూడా ఆధిపత్యం కోసం ఆరాటపడుతుండటం, కొల్లాపూర్ నియోజకవర్గంలో సెగలు రేపుతోంది.
వేర్వేరు పార్టీల్లో ఉండి కత్తులు దూసుకున్న నేతలిప్పడు, ఒకే పార్టీలో ఉండటంతో, ఇద్దరు కలిసిన చోట యుద్ద వాతావరణం నెలకొంది. ప్రభుత్వ కార్యక్రమాలే వేదికగా కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవన్న సామెతకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మారారు ఎమ్మెల్యే హర్షవర్ధన్, మాజీ ఎమ్మెల్యే జూపల్లి మొన్నటి వరకు తిట్టుకుని, ఇప్పుడు ఒకే పార్టీలో కలవలేక, మెలగలేక, మధ్యలో అధికారులకు కూడా చుక్కలు చూపిస్తున్నారు.
జూపల్లిపై గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ది కోసమంటూ, గెలిచిన నెలలోపే అధికార పార్టీలో చేరిపోయారు. ఆయన చేరిక నియోజకవర్గానికి ఏం మేలుచేసిందో కానీ, అధికార పార్టీ టీఆర్ఎస్‌లో మాత్రం కార్చిచ్చును రగిల్చింది. హర్షవర్దన్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే, నియోజకవర్గంలో జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్ రెడ్డి అన్నట్టుగా చీలిపోయింది. దీంతో ప్రతీ మీటింగ్‌లోనూ రెండు వర్గాల అనుచరులు కొట్టుకుంటుండటంతో, సమావేశాలు రణక్షేత్రాన్ని తలపిస్తున్నాయి.
పార్టీలో సీనియర్ నాయకుడైన జూపల్లి, నియోజకవర్గంలో తన హవానే నడవాలని తపించడం, అందుకు దీటుగా ప్రస్తుతం ఎమ్మేల్యేగా గెలిచిన తన మాటే చెల్లుబాటు కావాలని బీరం హర్షవర్దన్ రెడ్డి ప్రయత్నిస్తుండటం అటు కార్యకర్తలకు, ఇటు అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ ఇద్దరి నేతల్లో ఎవరి మాట వినాలో తెలియక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకరు మాజీ మంత్రి కావడం, మరొకరు ఎమ్మెల్యే కావడంతో వీరి గ్రూపు రాజకీయాలకు ప్రభుత్వాధికారులు బలౌతున్నారన్న చర్చ జరుగుతోంది.
కొల్లాపూర్‌లో పోలీసులకూ దిమ్మతిరిగేలా చేస్తున్నారు ఈ ఇద్దరు నాయకులు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు మారింది పోలీసుల పరిస్థితి. వీరి పోరు పడలేకే ఒక సి.ఐ, నగర పంచాయతి కమిషనర్‌లు బదిలీ చేయించుకుని మరీ వెళ్ళిపోయారు. ఇక కొత్తగా నియోజకవర్గంలో పనిచేసేందుకు వచ్చే అధికారులు, పోలీసులను కూడా తమకు అనుకూలమైన వారే కావాలని అటు ఎమ్మేల్యే హర్షవర్థన్ రెడ్డి, ఇటు మాజీ మంత్రి జూపల్లిలు పోటీ పడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులెవరు కూడా సుముఖత చూపడం లేదు.
మొన్నటి వరకు మంత్రిగా చక్రంతిప్పిన జూపల్లి, కొల్లాపూర్‌లో అనూహ్యంగా ఓడిపోవడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అంతేకాదు, ప్రత్యర్థి కూడా తన పార్టీలోనే చేరిపోవడంతో, ఆయనకు కొత్త దిగులు పట్టుకుందట. తలపడిన ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారని కలత చెందుతున్నారట జూపల్లి. సిట్టింగ్‌లకే మళ్లీ ఛాన్స్ ఇస్తే, తన గతేం కావాలని రగిలిపోతున్నారట. ఆయన అనుచరవర్గం కూడా అదే ఆలోచనతో ఉడికిపోతున్నారట. అందుకే ఇద్దరు నేతలు ఎక్కడ తారసపడినా, అక్కడ యుద్దవాతావరణం కనిపిస్తోంది.
ఈ ఇద్దరి ఆధిపత్య పోరు కారణంగా కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ది పూర్తిగా అటకెక్కిపోయింది. ఐతే కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి, ఊహించని విధంగా టీఆర్‍ఎస్‌లో కలవడంతో, అక్కడ కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీలు కాని టీఆర్ఎస్‌కు బలమైన నేతలెవ్వరూ లేకుండా పోయింది. ఈ సమయంలో ఈ ఇద్దరు నేతలు సమిష్టి కృషితో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు నల్లమల ఆటవీ ప్రాంతం సమీపంలో ఉన్న కొల్లాపూర్ నియోజవర్గం, మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతం కావడంతో, అభివృద్దికి ఆమడ దూరాన నిలిచింది. ఇన్నాళ్ళకు దాదాపుగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయి, కొల్లాపూర్ నియోజకవర్గం కూడా అన్ని నియోజకవర్గాల మాదిరిగానే మారింది. ఇలాంటి సమయంలో ఒకే పార్టీ, అందులోను అధికార పార్టీ నేతలు కయ్యానికి కాలు దువ్వకుండా అభివృద్ది కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు కోరుకుంటున్నారు. మరి జూపల్లి, హర్షవర్ధన్‌ల రాజకీయ వైరం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, లేదంటే ఒకే మాట ఒకే బాటగా నడుస్తారో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire