జీహెచ్ఎంసీ ఎన్నికలకు రగులుకున్న రాజకీయవేడి !

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రగులుకున్న రాజకీయవేడి !
x
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రాజకీయ వేడి రగులుకోవడంతో వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. రెండోసారి జీహెచ్‌ఎంసీని కైవసం చేసుకోవాలని...

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రాజకీయ వేడి రగులుకోవడంతో వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. రెండోసారి జీహెచ్‌ఎంసీని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్‌ తహతహలాడుతుండగా కాంగ్రెస్, బీజేపీలు పూర్వవైభవానికి ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క పాతిబస్తీకే పరిమితం అన్న ముద్రను చెరిపేసుకొనేందుకు ఎంఐఎం దృష్టి సారించింది. ఇక టీడీపీ మాత్రం తమతో పొత్తులు పెట్టుకునే పార్టీల కోసం ఎదురు చూస్తోంది.

రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌ జీహెచ్ఎంసీని మరోసారి దక్కించుకొనేందుకు కసరత్తు చేస్తోంది. గత మార్కును దాటి సత్తా చాటాలనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనున్న అభ‌్యర్థుల ఎంపికతో సిట్టింగ్‌ కార్పొరేటర్లలో ఎంతమందికి మళ్లీ అవకాశం లభిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

నగరమే పునాదిగా ఎదిగిన బీజేపీ ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని రుజువు చేసే పనిలో పడింది. మరే పార్టీ చేయని విధంగా హైదరాబాద్‌కు ఏకంగా ఆరుగురు అ‌ధ‌్యక్షులను ప్రకటించింది. ఒక్కో అధ్యక్షుడికి నాలుగు నియోజకవర్గాల బాధ‌్యతలను అప్పగించింది. కేంద్రంలో బీజేపీ ఉండడంతో నగరాభివృద్ధి తమతోనే సాధ‌్యమనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.

అటు 2009లో మజ్లిస్‌ పొత్తుతో కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల నాటికి బలహీన పడింది. అయితే ఈసారి ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిచ్చి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. మరోవైపు అధికార ప్రభుత్వమైన టీఆర్ఎస్‌ లోపాలను నగర ప్రజలకు తెలియజేసేవిధంగా హస్తం పార్టీ నేతలు వడివడి అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న అవకతవకళను ఎత్తిచూపులనుకుంటుంది.

ఇటు పాతబస్తీనే కంచుకోటగా ఎదిగిన ఎంఐఎం నగరవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ఎన్నికలేవైనా పొత్తు రాజకీయాలతో డివజన్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. 2009లో 43 డివిజన్లు, 2016లో 44 డివిజన్లను కైవసం చేసుకుంది. అయితే టీఆర్‌ఎస్‌కు బలమున్న చోట వెన్నక్కి తగ్గడం.., అవకాశమున్న చోట ముందుకు వెళ్లడమే మజ్లిస్‌ ఎజెండాగా పెట్టుకుంది. ఇక ఓ అడుగు ముందుకు వేసి పార్టీలో హిందువులకూ సీట్లను కేటాయించి బరిలోకి దింపేందుకు కార్యచరణ రూపొందిస్తుంది. మొత్తానికి GHMC ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నా అధికార పార్టీ మాత్రం పైచెయ్యి కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని ముందుగానే సర్వేలతో అ‌భ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories