రైల్వే పోలీసుల అదుపులో 46 మంది అభ్యర్థులు.. నేరం రుజువైతే రైల్వేచట్టాల ప్రకారం కఠినమైన శిక్షలు..

Police Registers Cases Under Various Sections Against Those Involved in Vandalism of Secunderabad Railway Station
x

రైల్వే పోలీసుల అదుపులో 46 మంది అభ్యర్థులు.. నేరం రుజువైతే రైల్వేచట్టాల ప్రకారం కఠినమైన శిక్షలు..

Highlights

Agnipath Scheme Protest: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసకాండపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

Agnipath Scheme Protest: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసకాండపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్నవారిపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ అల్లర్లలో దాదాపు 3 వేల మంది పాల్గొన్నారని పోలీసులు అంటున్నారు. వారిలో 46 మంది ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు రైల్వే కోర్టు ఎదుట హాజరు పరచారు. తదుపరి విచారణ కోసం కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు వారిని చంచల్‎గూడ జైలుకు తరలించారు.

దేశంలో రైల్వే శాఖ అతి పెద్దది. బ్రిటిష్ చట్టాలు మొదలైన కాలంలో రైల్వే చట్టాలు అమల్లోకి వచ్చాయి. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా ఆనాటి విప్లవకారులు ప్రభుత్వ ఆస్తుల్ని అంటే బ్రిటిష్ ఆస్తుల్ని ధ్వంసం చేయడం నిరసనగా చేపట్టారు. రైల్వే శాఖ ద్వారానే భారతీయ ఆస్తులు తరలిస్తున్నారని, ఈ డిపార్టుమెంట్ ద్వారానే దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని భావించేవారు. దీన్ని అడ్డుకునేందుకు బ్రిటిషర్స్ రైల్వే చట్టాలను కఠినంగా రూపొందించారు. ప్రస్తుతం కూడా ఆ చట్టాలే అమలులో ఉన్నాయి రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అగ్నిపథ్ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించగా రైల్వే పోలీసులు ఏఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్లు సూచిస్తున్న శిక్షలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది.

రైల్వే యాక్ట్‎లోని ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం -పీడీపీపీఏ కింద మొత్తం 15 సెక్షన్ల కింద అగ్నిపథ్ అభ్యర్థులపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 143 ప్రకారం చట్ట విరుద్ధంగా ఓ ప్రాంతంలో గుమిగూడటం నేరం. ఆ నేరానికి ఆరు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. సెక్షన్ 147 ప్రకారం అల్లర్లకు పాల్పడటం నేరం. ఈ నేరానికి రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ పడొచ్చు. సెక్షన్ 324 ప్రకారం మారణాయుధాలు క్యారీ చేయడం, ప్రజల్ని గాయపరచడం తీవ్రమైన నేరం. ఈ నేరానికి మూడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇక సెక్షన్ 307 హత్యాయత్నానికి పాల్పడటం నేరం ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే పదేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. సెక్షన్ 435 ప్రకారం అగ్ని లేదా పేలుడుపదార్థం వినియోగించి విధ్వంసం సృష్టించడం తీవ్రమైన నేరం. దీనికి ఏడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. సెక్షన్ 427 ప్రకారం 50 రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువైన రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం నేరం. దీనికింద రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. సెక్షన్ 448 ప్రకారం అనుమతి లేకుండా రైల్వే పరిసరాల్లోకి ప్రవేశించడంమే నేరం. ఈ నేరానికి ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా విధించే అవకాశం ఉంది.

సెక్షన్ 336 ప్రకారం ఎదుటివారికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న పని చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. సెక్షన్ 332 కింద విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని గాయపరచడం నేరం. దీనికింద మూడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా పడే అవకాశం ఉంది. సెక్షన్ 341 ప్రకారం రైల్వే అధికారులను, లేదా ఆస్తులను దిగ్భంచడం నేరం. ఈ సెక్షన్ కింద నెల రోజుల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడొచ్చు. ఇక సెక్షన్ 149 ప్రకారం గుంపుగా ఆందోళన చేసినప్పుడు ఆ గుంపులోని ప్రతి ఒక్కరూ నేరానికి బాధ్యులే. ఇండియన్‌ రైల్వే యాక్ట్‌ సెక్షన్‌ 150 ప్రకారం తాము చేస్తున్న పనివల్ల ఎదుటి వారి ప్రాణాలకు హాని ఉందని తెలిసీ చేయడం తీవ్రమైన నేరం. ఇందుకుగాను మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే ఆస్కారం ఉంది. సెక్షన్ 151 ప్రకారం రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం అనేది కూడా అతిపెద్ద నేరమే. దీని కింద ఐదేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే ఆస్కారం ఉంది. సెక్షన్ 152 ప్రకారం రైళ్లపై రాళ్లు విసరడం, కర్రలతో దాడి చేయడం అతిపెద్ద నేరాలు. ఈ నేరాలకు పదేళ్ల జైలుశిక్ష నుంచి జీవిత ఖైదు వరకు పడే ఆస్కారం ఉంది. ఇక సెక్షన్‌ 3 ప్రకారం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం నేరం. దీనికింద కనీసం 6 నెలల జైలుశిక్ష పడే ఆస్కారం ఉంది.

అగ్నిపథ్ ఆందోళనల కారణంగా ప్రభుత్వ ఆస్తులకు వందల కోట్ల ఆస్తినష్టం సంభవించిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ సామూహిక ఆందోళనల్లో పాల్గొన్న యువకులు నేరాల తీవ్రత తెలిసి చేసినా తెలియక చేసినా ప్రస్తుత కేసులో ఆ సెక్షన్లు అన్నీ వర్తిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. తెలంగాణ పోలీసుల అదుపులో ఇప్పటికైతే 46 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలీసులు ఎంటర్ కావడంతోనే చాలామంది తప్పించుకొని పారిపోయారు. అగ్నిపథ్ లాంటి సైనిక సేవల కోసం ఆరాటపడే అభ్యర్థులు ఏకంగా ప్రభుత్వ ఆస్తుల మీదనే విరుచుకుపడితే ఆ నేరాలు రుజువైతే వీరికి పడే శిక్షల కారణంగా బంగారు భవిష్యత్తు పాడైపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories