People Returning towards Native Place: పుట్టినూరు వైపు పరుగులు.. జీవనోపాధిని సైతం వదిలి
People Returning towards Native Place: కరోనా ఆగష్టులో తీవ్రరూపం దాల్చుతోంది. సెప్టెంబరులో మరింత పెరుగుతుందని అంచనా.
People Returning towards Native Place: కరోనా ఆగష్టులో తీవ్రరూపం దాల్చుతోంది. సెప్టెంబరులో మరింత పెరుగుతుందని అంచనా. అందుకే ఇప్పటివరకు పట్టెడన్నం పెట్టిన హైదరాబాద్ లో భవిషత్తులో మరింత ప్రమాదం ముంచుకొస్తుందనే ఆలోచనతో స్వగ్రామంవైపు పరుగులు పెడుతున్నారు. తట్టా, బుట్టా సర్ధుకుని బలుసాకు తినైనా బతుకుదామనే కోరికతో పరుగులు పెడుతున్నారు.
నగర శివారులోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే చిరంజీవి కుటుంబం కూకట్‌పల్లిలో ఉంటోంది. అడపాదడపా ఆన్‌లైన్ తరగతులు తప్ప పని లేదు. సామాజిక వ్యాప్తి దశ కొనసాగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలతో, ఆయన కుటుం బం ఇంటికి తాళం వేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని సొంతూరికి వెళ్లిపోయింది. అక్కడ పాతబడ్డ ఇంటికి మరమ్మతు చేయించుకుని మరీ ఉంటున్నారు.
నానక్‌రామ్‌గూడ సమీపంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే మహిపాల్‌రెడ్డి కుటుంబం బోరబండలో ఉంటోంది. గత నాలుగున్నర నెలలుగా వర్క్‌ఫ్రమ్ హోం పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నా.. పిల్లల ఆన్‌లైన్ తరగతుల రీత్యా ఇక్కడే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తండ్రి సూచన మేరకు సిద్దిపేట సమీపంలోని సొంత గ్రామానికి వెళ్లిపోయారు.
ఇప్పటి వరకు ఓ ఎత్తు.. రానున్న రోజులది మరో ఎత్తు. సామాజిక వ్యాప్తి, వచ్చే 2 నెలల్లో కరోనా కల్లోలం ఉండనుందన్న వార్తల నేపథ్యంలో నగరవాసిలో గుబులు తీవ్రమైంది. ఎటువైపు నుంచి వైరస్ విరుచుకుపడుతుందోనన్న భయం వణికిస్తోంది. అడుగు బయటపెట్టాలంటేనే హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సిటీలో ఉండటం కంటే సొంతూళ్లకు వెళ్లిపోవటమే సురక్షితమన్న భావన వ్యక్తమవుతోంది. వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉన్న వారిలో చాలా మంది ఇప్పటికే బిచాణా సర్దేయగా, ఇప్పుడు ఇతర ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునేవారు ఊరిబాట పడుతున్నారు.
వాలంటరీ రిటైర్మెంట్‌తో..
సంగారెడ్డిలో బహుళ జాతీయ కంపెనీలో పనిచేసే వ్యక్తి సెలవు పెట్టే అవకాశం లేక, వర్క్ ఫ్రం హోం విధానం కుదరక ఏకంగా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని సొంత ప్రాంతానికి వెళ్లిపోయారు. కరోనా సోకినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలామంది కోలుకుంటున్నా, కొందరిలో మాత్రం భయం నెలకొంది. వైరస్ సోకిన కొందరు నాలుగైదు రోజుల్లోనే చనిపోతున్న ఉదంతాలు అతి తక్కువగానే ఉన్నా, వాటిని చూసి భయాందోళనల్లో మునిగిపోతున్నారు. ఎక్కువ మంది పనిచేసే చోట వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో అలాంటి చోట పనిచేసే వారు ఎక్కువగా భయపడుతున్నారు. వర్క్ ఫ్రం హోం అవకాశం లేనిచోట, సెలవుల్లేక విధిగా పనికి వెళ్లాల్సినవారు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పదవీ విరమణ వయసుకు కాస్త చేరువగా ఉన్నవారు వాలంటరీ రిటైర్మెంట్ వైపు మొగ్గుతున్నారు.
మూతపడుతున్న దుకాణాలు
ఇటీవలి వరకు కాస్త ధైర్యంగానే దుకాణాలను నిర్వహించిన వారు ఇప్పుడు క్రమంగా తీరు మార్చుకుం టున్నారు. వీరిది ఉద్యోగం లాంటి ప్రతిబంధకం లేకపోవటంతో దుకాణాలు మూసేసి కొంతకాలం సొంతూళ్లలో ఉండి వద్దామని వెళ్తున్నారు. విజయనగర్ కాలనీలో మందుల దుకాణం నిర్వహించే ఓ కుటుంబం ఆందోళనకు గురై వరంగల్ రూరల్ జిల్లాలోని సొంతూరుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం కోవిడ్ వైద్యంలో వాడే మందుల కోసం వచ్చే వారి సంఖ్య పెరగటమే వారి భయానికి కారణం. అలా వచ్చే వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులు కూడా ఉం డే ప్రమాదం ఉండటంతో వారం క్రితం మందుల దుకాణం మూసేసి సొంతూరుకు వెళ్లిపోయారు. ఇలా పలువురు తమ దుకాణాలను మూసేస్తున్నారు. ఫలితంగా నగరంలోని చాలా కాలనీలు, బస్తీల్లో మూతపడుతున్న దుకాణాల సంఖ్య పెరుగుతోంది.
పాలు, కూరలకూ ఇబ్బందే..
నగరం చుట్టూ ఉన్న గ్రామాల నుంచి నిత్యం వేల లీట్లర్ల పాలు, టన్నుల కొద్దీ కూరగాయలు సిటీకి వస్తుంటాయి. డెయిరీ కంపెనీలు సరఫరా చేసే పాలు కాకుండా క్యాన్‌లలో పాలు తెచ్చి ఇళ్లకు సరఫరా చేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇప్పుడు వీరు సిటీకి రావాలంటే భయపడుతున్నారు. ఎవరింట కరోనా సోకిన వారున్నారో, ఏ రోడ్డులో వారు తారసపడతారో తెలియక భయపడుతున్నారు. దీంతో కొద్ది రోజులు పాలు సరఫరా చేయలేమని చెప్పి ఆపేస్తున్నారు. నగరంలోని మార్కెట్లు, రైతు బజార్లకు కూరలు తెచ్చే వారు కూడా అదే పనిచేస్తుండటంతో కొద్ది రోజులుగా సిటీకి కూరగాయల కొరత ఏర్పడుతూ వస్తోంది.
'నేను గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి నిత్యం రూ.వేయి కూరలు కొని కాలనీల్లో అమ్ముతాను. కానీ ఇప్పుడు మార్కెట్ బాగా పలచగా కనిపిస్తోంది. చాలా మంది రైతులు కూరలు తేవటం లేదు. దీంతో మాకు కొన్ని రకాల కూరలు దొరకటం లేదు.'అని గోల్కొండకు చెందిన దిలావర్ వాపోయాడు. లాక్‌డౌన్ మొదలైన కొత్తలో ఆటోవాలాలు, టాక్సీ డ్రైవర్లు కూడా కూరలు అమ్మేందుకు ఎగబడటంతో ఎక్కడపడితే అక్కడ కూరలు కుప్పలుగా కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా మారిపోయింది. రెగ్యులర్‌గా అమ్మేవారు కూడా రావటం మానేస్తున్నారు. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడి ధరలు కూడా ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి.
రోడ్లపై పెరిగిన రద్దీ..
నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య పెరగటంతో గత కొద్ది రోజులుగా వివిధ రోడ్లపై రద్దీ పెరిగింది. 'లాక్‌డౌన్ మొదలైన తర్వాత రోడ్లపై వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాల సరి హద్దులు మూసేయటం, వాహనాలకు అనుమతి లేకపోవటంతో అప్పట్లో కర్ఫ్యూ వాతావరణమే ఉండేది. అన్‌లాక్ తర్వాత పరిస్థితి మెరుగుపడ్డా మునపటి రద్దీ లేదు. కానీ గత పది రోజుల నుంచి వాహనాల సంఖ్య బాగా పెరిగింది. అది రోజురోజుకు ఎక్కువవుతోంది'అని జాతీయ రహదారుల విభాగం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire