రేపటి నుంచి క్యాబ్ డ్రైవర్ల సమ్మె

రేపటి నుంచి క్యాబ్ డ్రైవర్ల సమ్మె
x
Highlights

హైదరాబాద్‌నగర ప్రజలకు మరో షాక్‌ తగలనుంది. రేపటి నుండి ఓలా, ఉబెర్ క్యాబ్‌లు కూడా సమ్మె బాటపట్టనున్నాయి. రేపటి నుంచి క్యాబ్‌లు కూడా సమ్మె చేస్తుండటంతో నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఉంది నగర పౌరుడి ప్రస్తుత పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్‌నగర ప్రజలకు మరో షాక్‌ తగలనుంది. రేపటి నుండి ఓలా, ఉబెర్ క్యాబ్‌లు కూడా సమ్మె బాటపట్టనున్నాయి. ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా మెట్రోతో పాటు, క్యాబ్‌లను కూడా ఆశ్రయిస్తుంటారు నగరవాసులు. ఇక రేపటి నుండి క్యాబ్‌లు కూడా సమ్మె చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

బస్సుల బంద్‌తో అష్టకష్టాలు పడుతున్న హైదరాబాద్ వాసులకు క్యాబ్ డ్రైవర్లు కూడా షాక్ ఇవ్వబోతున్నారు. మెట్రో తర్వాత అత్యధికంగా ప్రయాణికులను తరలించేది క్యాబ్‌లనే చెప్పవచ్చు. ఇక రేపటి నుండి క్యాబ్ డ్రైవర్‌లు కూడా సమ్మెకు దిగుతుండటంతో నగర వ్యాప్తంగా సుమారు 50 వేలకు పైగా క్యాబ్‌లు ఆగిపోనున్నాయి. ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విదేశాలకు వెళ్ళడం కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్ళే ప్రయాణికులు క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. క్యాబ్ డ్రైవర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది ఆగస్ట్ 30న తెలంగాణ రవాణా శాఖకు లేఖను కూడా అందించింది.

ప్రస్తుతం క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు పెద్ద ఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. చాలామంది అప్పులపాలయ్యారు. ఫైనాన్షియర్ల వద్ద చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక రోడ్డున పడుతున్నారు. డ్రైవర్ల కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రతి డ్రైవర్‌కు కనీసం బిజినెస్‌ గ్యారెంటీ ఇవ్వాలని, ఇందుకనుగుణంగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాలని జేఏసీ చైర్మెన్‌ సలావుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్‌లకు సంబంధించిన జీవో 61, 66లకు అమలు చేయాలని కోరారు.

ఓలా క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వమే వాహనాలు అందించి ప్రైవేటు వారికి అప్పగించిందని.. ఇప్పుడు ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించడం లేదని తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మెను ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. ఆర్టీసీ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ.

ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలకు క్యాబ్‌లు కూడా సమ్మె చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories