ఇందూరులో పాపం జడ్పీ చైర్మన్‌ అని ఎందుకు అంటున్నారు?

ఇందూరులో పాపం జడ్పీ చైర్మన్‌ అని ఎందుకు అంటున్నారు?
x
Highlights

ఆయన పార్టీలో సీనియర్ పదవుల్లో జూనియర్. క్యాబినెట్ హోదా పదవిలో ఉన్నా సాదాసీదాగా ఉంటారు. దాదన్న అని పిలిస్తే పలుకుతాడు. కానీ ఆయన ఇప్పుడు సొంత పార్టీ...

ఆయన పార్టీలో సీనియర్ పదవుల్లో జూనియర్. క్యాబినెట్ హోదా పదవిలో ఉన్నా సాదాసీదాగా ఉంటారు. దాదన్న అని పిలిస్తే పలుకుతాడు. కానీ ఆయన ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్య నలిగిపోతున్నారు. అభివృద్ది నిధుల విషయంలో ఎమ్మెల్యేలను ఒప్పించలేక జడ్పీటీసీలకు నిధులు ఇప్పించలేక సతమతమైపోతున్నారట. కరోనా నుంచైనా బయటపడొచ్చేమో కానీ, ఈ కాసుల లొల్లి నుంచి ఎగ్జిట్‌ అవడం కష‌్టమని చేతులెత్తేస్తున్నారట. ఇంతకీ ఇంతగా ఇబ్బంది పడుతున్న ఆ బాధిత నాయకుడు ఎవరు?

నిజామాబాద్ జిల్లా పరిషత్‌లో ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత పోరు మామూలుగా లేదు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఆ అంతర్గత పోరు కాస్తా, జిల్లా పరిషత్ ఛైర్మన్ విఠల్ రావు పదవికి ఎసరు పెట్టేలా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లాకు 32 కోట్ల ఉపాధి హామి నిధులు మంజూరయ్యాయంట. ఆ నిధుల్లోంచి చిన్న మండలానికి 25లక్షలు, పెద్ద మండలానికి 50లక్షలు ఇచ్చేలా జడ్పీటీసీలను ప్రతిపాదనలు కోరారట. ఆగమేఘాల మీద జడ్పీటీసీలు ఏడు కోట్ల ప్రతిపాదనలు సిద్దం చేసేశారట. ఇంతవరకు బాగానే ఉన్నా, అసలు ట్విస్ట్ ఇక్కడి నుంచే మొదలయ్యిందట.

జడ్పీటీసీల ప్రతిపాదనలపై, ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారట. అంతంత నిధులు ఇవ్వడం కుదరదంటూ కత్తెర పెట్టి, ఒక్కో జడ్పీటీసీకి ఐదు లక్షల పనులు ఇచ్చేలా నిర్ణయించారట. ఈ విషయం తెలిసిన జడ్పీటీసీలు అంతర్గతంగా రగిలిపోతున్నారట. తమ ప్రతిపాదనలు బుట్టదాఖలు చేయడంపై ఛైర్మన్ మీద అలిగారట.

జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న విఠల్ రావు, జడ్పీటీసీలకు నిధులు ఇప్పించే విషయంలో ఎమ్మెల్యేలతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారని, చైర్మన్ తీరుపై జడ్పీటీసీలు రగిలిపోతున్నారట. గెలిచి ఎనిమిది నెలలు గడుస్తున్నా, పైసా నిధుల్లేక నైరాశ్యంలో ఉన్న జడ్పీటీసీలకు ఎమ్మెల్యేల నిర్ణయం మింగుడు పడటం లేదట. ఐతే ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పలేక లోలోపల కుమిలిపోతున్నారట. ఛైర్మన్ ద్వారా చెప్పించాలంటే ఆయన కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారని గులాబీ జడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇటు ఛైర్మన్ తీరుపై ఇప్పటికే ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు అంటీ ముట్టనట్టుగా ఉన్నారట. ఆయన్ను తమ నియోజకవర్గంలో తిరగొద్దని బాహాటంగా చెప్పేశారట. ఉపాధి హామి నిధులతో చేపట్టే పనులకు జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయవద్దని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఎమ్మెల్యేలు జడ్పీటీసీల మధ్య నెలకొన్న కాసుల లొల్లి జడ్పీ ఛైర్మన్‌కు, కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందట. ఆయన బయటకు చెప్పులేక లోలోపలే కుమిలిపోతున్నారనే టాక్ నడుస్తోంది.

ఎమ్మెల్యేలను ఒప్పించలేక, జడ్పీటీసీలకు నిధులు ఇప్పించలేక సతమతమవుతున్న జడ్పీచైర్మన్‌ మధ్యే మార్గంగా త్వరలో పంచాయతీరాజ్ శాఖా మంత్రిని కలవాలనుకుంటున్నారట. జడ్పీటీసీలు కోరినన్ని నిధులు ఇప్పించేలా మంత్రిని ఒప్పించాలని నిర్ణయించారట. ఐతే ఎమ్మెల్యేల ప్రతిపాదన కాదని, జడ్పీ ఛైర్మన్ వినతిని ఏ మేరకు ఆమోదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పాపం ఛైర్మన్ ఈ గండం నుంచి ఎలా గట్టెకుతారో వేచిచూడాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories