Musi River Beautification: మూసీ సుందరీకరణ... రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు
Musi River Beautification: మూసీ నది కళకళలాడుతూ ప్రవహిస్తుంటే, ఆ ప్రవాహం పొడవునా అటూ ఇటూ చక్కని రోడ్లు, వాటి వెంబడి అందమైన పార్కులు, రెస్టారెంట్లు ఉంటే ఎలా ఉంటుంది? ఈ అందమైన కల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చూపించింది.
మూసీ నది కళకళలాడుతూ ప్రవహిస్తుంటే, ఆ ప్రవాహం పొడవునా అటూ ఇటూ చక్కని రోడ్లు, వాటి వెంబడి అందమైన పార్కులు, రెస్టారెంట్లు ఉంటే ఎలా ఉంటుంది? ఈ అందమైన కల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చూపించింది. కానీ, పదేళ్ళలో ఆ దిశగా పెద్దగా పనులేమీ జరగలేదు.
కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కలను మరోసారి ప్రజలకు మరింత అందంగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఈ కలను తమ ప్రభుత్వం నిజం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, ఆ కల ఇప్పుడు పేదల జీవితాలను చెదరగొడుతోందనే ఆరోపణలు మార్మోగుతున్నాయి. ఆ అందమైన కల సంగతి సరే.. అక్కడున్న పేద ప్రజలకు ఏది దిక్కు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. రేవంత్ సర్కార్ చిక్కుల్లో పడింది.
నిర్వాసితులకు అండగా మేమున్నాం అని బీఆర్ఎస్, బీజేపీలు నడుం బిగించాయి. ప్రభుత్వం కూడా బాధితులకు తామే అండంగా ఉంటామని, మెరుగైన పునరావాసం కల్పిస్తామని హామీ ఇస్తోంది.
లండన్‌లోని థేమ్స్ నదిలా... మూసీ!
లండన్‌లోని థేమ్స్ నది తరహాలో మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి తాను అధికారం చేపట్టినప్పటి నుంచి చెబుతూ వచ్చారు. సీఎం పదవి చేపట్టిన తరువాత ఆయన నగర మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి లండన్‌లో పర్యటించారు. థేమ్స్ నది ప్రక్షాళన కోసం అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలపై ఈ అధికారిక బృందం చర్చించింది.
హైద్రాబాద్ నగర ప్రజా ప్రతినిధులతో పాటు ఎంఐఎం శాసనసభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఆ బృందంలో ఉన్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ విషయమై చర్చించారు.
ఈ ఏడాది అక్టోబర్ నెలలో హైద్రాబాద్ నగర ప్రజా ప్రతినిధులను సీఎం మరోసారి లండన్ కు తీసుకెళ్లనున్నారు. ఈ పర్యటనలో మూసీ ప్రణాళిక గురించి అక్కడి నిపుణులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
థేమ్స్ నది తరహాలో మూసీని అభివృద్ధి చేయడం అంటే, ముందు నది నీటిని ప్రక్షాళన చేయాలి. అది ప్రవహించే ప్రాంతంలో రెండు వైపులా వాణిజ్య, వినోద కారిడార్లు ఏర్పాటు చేయాలి. సైకిల్ ట్రాక్ లు, గ్రీన్ వేలు, హాకర్ జోన్లు, వంతెనలు, రెస్టారెంట్లు, అమ్యూజ్ మెంట్ పార్కులు కట్టాలి.
మూసీలోకి గోదావరి నది నీటిని పంప్ చేయాలని, అలా నది నీటిని శుభ్రంగా మార్చి ఈ నిర్మాణాలన్నింటికీ ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణను కూడా ప్రారంభించింది. గౌరెల్లి వరకు మూసీలో కలుస్తున్న ప్రవాహాలపై అధ్యయనానికి ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీని ఎంపిక చేసింది. నది వెడల్పు ఎక్కడెక్కడ ఎంత ఉండాలని విలేజ్ రెవిన్యూ మ్యాప్ ఆధారంగా నిర్ధారించే ప్రక్రియ మొదలైంది. ఆ తరువాత నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణాలు, నిర్మాణాలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కానీ, ఇక్కడే ప్రభుత్వానికి చుక్కెదురైంది. అక్రమ నిర్మాణాల మార్కింగ్‌తోనే రేవంత్ సర్కార్ మీద నిరసన సెగలు రాజుకున్నాయి. ఊహించని స్థాయిలో వెల్లువెత్తిన నిరసనలతో ప్రభుత్వం ఒక అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరాశ్రయులైన వారికి మెరుగైన పునరావాసం కల్పించడం ఎలా అన్నది తేలనిదే పని ముందుకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది.
అయితే, హైదరాబాద్ నగరంలోని మూసీ నది ప్రవహించే ప్రాంతం అందంగా మారాలంటే ప్రవాహం వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడం అనివార్యమని ఫోరమ్ ఫర్ బెటర్ హైద్రాబాద్ సంస్థ అధ్యక్షులు మణికొండ వేదకుమార్ అన్నారు. నదిలో మంచినీరు లభించినప్పుడే ఇది సాధ్యమని ఆయన వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా మూసీ నది సుందర పరీవాహక ప్రాంతాన్ని కలగన్నారు. ఆయన ప్రభుత్వం ఈ దిశగా అడుగులు కూడా వేసింది. 2017 మార్చి 25న మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ది సంస్థను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి 2017-18 ఆర్థిక సంవత్సరంలో 377 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ, విడుదల చేసింది మాత్రం 32 లక్షలే.
2018-19లో కూడా 377 కోట్ల రూపాయల కేటాయించింది. కానీ, విడుదల చేసింది 2 కోట్ల 80 లక్షల రూపాయలు.
2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో కూడా 200 కోట్ల రూపాయల చొప్పున కేటాయింపులు జరిగాయి. కానీ, ఈ మూడేళ్ళలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అప్పట్లోనే ప్రతిపక్షాలు విమర్శించాయి.
మూసీ అభివృద్దికి 1354.70 కోట్లు కేటాయించిన కేసీఆర్ సర్కార్... అందుకోసం నిజంగా విడుదల చేసిన సొమ్ము కేవలం 9 కోట్ల 12 లక్షలు మాత్రమేనని అప్పటి విపక్షం, ఇప్పటి అధికారపక్షమైన కాంగ్రెస్ విమర్శించింది.
మూసీ.. కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్
హైదరాబాద్ మురికి కాల్వల్లో 94 శాతం మూసీలోకే కలుస్తుంటాయి. 1980ల నుంచి పారిశ్రామిక వ్యర్థాలు కూడా మూసీలోకే కొట్టుకొస్తున్నాయి.
కృష్ణానదికి ఉప నదిగా వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీనది ఒకప్పుడు నగర ప్రజలకు మంచినీటిని అందించింది. హైదరాబాద్ పాత, కొత్త నగరాల మధ్యరేఖలా ప్రవహించే ఈ ముచుకుందా నది ఇప్పుడు వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసే సమయానికి అదొక మురికికూపంగా మారుతోంది.
కాలుష్యంలో ఈ నది ప్రపంచంలో 22వ స్థానంలో ఉంది. 104 దేశాల్లోని 258 నదులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ నది నీటిలో 48 రకాల ప్రమాదకర రసాయనాల ఆనవాళ్లను గుర్తించారు.
స్విట్జర్లాండ్ కు చెందిన సంస్థ ‘ఫార్మాసూటికల్ పొల్యూషన్ ఇన్ ది వరల్డ్స్ రివర్స్’ పేరుతో చేసిన ఈ అధ్యయనాన్ని “ది ప్రొసిడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్” అనే జర్నల్ లో 2022లో ప్రచురించింది. నదిలోనే కాదు, ఈ నది ప్రవహించే ప్రాంతంలోని గ్రామాల్లో భూగర్భజలాలు కూడా కలుషితమయ్యాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
ఈ నీటితో పండిన పంటలు తింటే ఆరోగ్యానికి ప్రమాదమని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.
మూసీ నీటిలో తీవ్ర స్థాయిలో ఉన్న క్షారాల మూలంగా బ్లూబేబీస్ అనే వ్యాధి వస్తోందని, ఈ నీటిని తాగిన పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గిపోతోందని, రకరకాల చర్మవ్యాధులు, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ఈ నీరు కారణమవుతోందని వైద్య అధ్యయానాలు సూచిస్తున్నాయి.
మూసీ ప్రక్షాళన ప్రణాళికలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మూసీ శుద్దికి ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. మూసీ నదిని పరిరక్షించాలని సేవ్ మూసీ పేరుతో కొన్ని స్వచ్ఛంధ సంస్థలు ఆందోళనలు చేశాయి. దీంతో 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. మూసీ వెంట ఉన్న కొన్ని కుటుంబాలను గౌస్ నగర్ ప్రాంతంలో పునరావాసం కల్పించారు.
ఆ తర్వాత 2005లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సేవ్ మూసీ ప్రాజెక్టుకు 906 కోట్లను కేటాయించింది. అయితే, ప్రభుత్వాలు మూసీ నదిని శుద్ది చేయడంలో భాగంగా ప్రభుత్వానికి చిక్కులు తెచ్చే కార్యక్రమాలను పక్కన పెట్టాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నగరంలో మురుగు నీటిని శుద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టింది. STP అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది.
ప్రతి రోజూ మూసీలో కలుస్తున్న 1,800 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3,866 కోట్లతో ఎస్టీపీలు నిర్మించిందని, 100 పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ సాధ్యం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో చెప్పారు.
మూసీని ముంచిన అక్రమ నిర్మాణాలు
నగరంలో దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళనలో మురుగునీటిని శుద్ధి చేయడం ఒక సవాలు. అయితే, ఇంతకన్నా పెద్ద సవాలు నదికి అటూ ఇటూ విస్తరించిన అక్రమ నిర్మాణాలు.
ఈ నది వెంబడి సుమారు 12 వేల అక్రమ నిర్మాణాలున్నాయని అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, హైద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఈ నిర్మాణాలున్నాయి. వీరందరిని అక్కడి నుంచి ఖాళీ చేయించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ మేరకు అధికారులు ఆయా ఇళ్లకు RBX అంటూ మార్కింగ్ చేశారు. ఇక్కడే రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. మార్కింగ్ పడిన ఇళ్ళవారు, ఇన్నేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం, బ్యాంకు లోన్లతో ఇళ్ళు కట్టుకున్నాం, ఇప్పుడు అభివృద్ధి పేరుతో ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలంటూ ఆందోళనలకు దిగారు.
మూసీ బాధితులకు అండగా ప్రతిపక్షాలు
మూసీ సుందరీకరణ అధికారుల బృందం సర్వే ప్రారంభించింది. దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, న్యూ మారుతినగర్ తదితర ప్రాంతాల్లో సర్వే బృందంపై స్థానికులు నిరసనకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులను తిప్పి పంపారు. ఈ సమయంలో విపక్షాలు బాధితులకు అండగా నిలిచాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అయితే, బీఆర్ఎస్ ఆరోపణలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిప్పికొడుతోంది. మూసీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసలేమీ చేయలేదని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ప్రక్షాళన కార్యక్రమంలో బాధితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇస్తోంది.
తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మూసీ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మూసీపై లింక్ రోడ్లు నిర్మిస్తామని ఆయన చెప్పారు.
ఇప్పటికే హైడ్రా చేపట్టిన కూల్చివేతల అంశం రేవంత్ రెడ్డి సర్కార్ కు ఇబ్బందిగా మారింది. హైడ్రాతో రేవంత్ రెడ్డి చేస్తున్నది పులి మీద సవారీ అని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. దీనికి తోడు ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రయత్నాలు కాంగ్రెస్‌ను పేద ప్రజల ఆగ్రహానికి టార్గెట్‌గా మార్చేస్తున్నాయి. ఆగ్రహిస్తున్న ప్రజల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని ప్రతిపక్షాలు కాలు దువ్వుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఒప్పించి మెప్పించి... కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. సామాజిక భావోద్వేగాలను సక్రమంగా హ్యాండిల్ చేయకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. అభివృద్ధి లేకపోతే అది ప్రభుత్వం ఫెయిల్యూర్ కిందకు వస్తుంది. ఈ పజిల్‌ను రేవంత్ సర్కార్ ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire