గ్రేటర్‌‌ పీఠంపై మాజీ మంత్రి కుటుంబం కన్నేసిందా?

గ్రేటర్‌‌ పీఠంపై మాజీ మంత్రి కుటుంబం కన్నేసిందా?
x
Highlights

గతంలో గ్రేటర్‌లో చక్రం తిప్పిన మాజీ మంత్రి కుటుంబం, గ్రేటర్ పీఠంపై కన్నేసిందా తమకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ, గ్రేటర్ పీఠానికి...

గతంలో గ్రేటర్‌లో చక్రం తిప్పిన మాజీ మంత్రి కుటుంబం, గ్రేటర్ పీఠంపై కన్నేసిందా తమకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ, గ్రేటర్ పీఠానికి డిమాండ్ చేస్తోందా గతంలో మేయర్ పదవి కోసం పోటిపడి విఫలమైన ఆ ఫ్యామిలీ, మళ్లీ అదే పీఠంపై ఎందుకు కన్నేసింది ఇదంతా కాంగ్రెస్‌లో వర్కౌట్‌ కాకపోతే, ప్లాన్‌ బీ కూడా సిద్దం చేసుకుంటోందా అంతగా ప్రయత్నం చేస్తున్న ఆ మాజీ మంత్రి కుటుంబం ఏది?

గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలిటిక్స్‌లో తిరుగులేని నేతగా పేరొందిన నాయకుడు మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో గ్రేటర్‌లో అత్యంత కీకలంగా వ్యవహరించిన ముఖేష్ కుటుంబం, మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడానికి పావులు కదుపుతోంది. గ్రేటర్‌లో ఆయన కుటుంబానికి పట్టు ఉండటంతో మళ్లీ ఆ పట్టు తిరిగి సాధించడానికి అదే పీఠంపై కన్నేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యేగా పోటిచేసి ఓడిపోయిన తరువాత ఆనారోగ్యంతో యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దాదాపు దూరమయ్యారు ముఖేష్ గౌడ్. ప్రస్తుతం కోలుకుంటున్న ఆ‍యన, తన వారసులకు రాజకీయ పునాది పటిష్టం చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీలో మళ్లీ పట్టు సాధించడానికి ఆయన కుమారుడు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి విక్రంగౌడ్ పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవిని తమకు కేటాయించాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

గ్రేటర్‌లో ముఖేష్ గౌడ్ సామాజిక వర్గానికి మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీలో తమ కుటుంబానికి గ్రేటర్ అధ్యక్ష పదవికి కేటాయిస్తే, పార్టీకి న్యాయం చేస్తామని విక్రం గౌడ్, పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏఐసిసి నుంచి పిసిసి వరకు ప్రక్షళాన జరిగే అవకాశమున్నందున, యువతకు ప్రాధాన్యత కల్పిస్తే, పార్టీకి నగరంలో భవిష్యత్తు ఉంటుందని ముఖేష్ కుటుంబం చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు త్వరలో గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతో సానుభూతితో మేయర్ పీఠం దక్కించుకోవచ్చనేది ముఖేష్ కుటుంబ వ్యూహంగా అదే పార్టీకి చెందిన నేతలు భావిస్తున్నారు.

గతంలో మేయర్ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి చెందిన విక్రంగౌడ్, ఈసారి మళ్లీ అదే మేయర్ అభ్యర్థిగా రంగంలో దిగి, సానుభూతితో పాగా వెయ్యాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకంటున్నాయి. కానీ గతంలోనే పార్టీ మేయర్ అభ్యర్థిగా రంగంలో దించినా, నిరూపించుకోని విక్రంగౌడ్‌కి మరోసారి పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా లేదా అనే చర్చ కూడా పార్టీలో జోరుగా జరుగుతోంది.

కాంగ్రెస్‌లో చివరి వరకు అవకాశం కోసం ప్రయత్నాలు చేసి, పార్టీ పట్టించుకోకపోతే బిజేపిలో చేరే అవకాశాలను కూడా ముఖేష్‌ గౌడ్ ఫ్యామిలీ పరిశీలిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బిజేపి ముఖ్యనేతలు ముఖేష్ కుటుంబంతో టచ్‌లోకి వెళ్లారని ప్రచారం జరుగుతుండటంతో, కాంగ్రెస్ ఏం చేస్తుందన్న ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories