కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాదయాత్ర వెనక అసలు కథేంటి?

కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాదయాత్ర వెనక అసలు కథేంటి?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనొక సంచలనం. నిత్యం వివాదాలతోనే సావాసం. ఎమ్మెల్యేగా ఓడినా, ఎంపీగా గెలిచి, సత్తా చాటారు. అయితే కొన్నాళ్లుగా ఆ‍యనపై జరుగుతున్న...

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనొక సంచలనం. నిత్యం వివాదాలతోనే సావాసం. ఎమ్మెల్యేగా ఓడినా, ఎంపీగా గెలిచి, సత్తా చాటారు. అయితే కొన్నాళ్లుగా ఆ‍యనపై జరుగుతున్న ప్రచారం, కార్యకర్తలను సైతం కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది. అయితే, ఇప్పుడాయన పాదయాత్ర చేయడానికి సిద్దమవడంతో, మరోసారి పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనూ దీక్షలు చేసి, సంచలనం సృష్టించిన ఆ నాయకుడు, సడన్‌గా ఇప్పుడెందుకు పాదయాత్రకు రెడీ అవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ లీడర్ ఎవరు పాదయాత్ర వెనక అసలు కథేంటి?

నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈనెల‌ 26 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అసలు పాదయాత్ర వెనుక ఆంతర్యం ఏంటి అసలు పాదయాత్ర, ప్రాజెక్టులు పూర్తవ్వడం కోసమేనా లేక జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ చేజారకుండా ఉండేందుకా లేదా తెలుగు రాష్ట్రాల్లో నేతలకు ఉన్నత పదవులు కట్టబెడుతున్న, పాదయాత్ర సెంటిమెంట్‌ రాజకీయం కోసమా అసలు కోమటిరెడ్డి పాదయాత్ర లక్ష్యమేంటన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

గతంలో తెలంగాణ కోసమంటూ మంత్రి పదవికి రాజీనామా చేసి, నిరాహార దీక్ష చేశారు కోమటిరెడ్డి. దానికి ముందు టిడిపి హయాంలో నల్గొండ ఎమ్మెల్యేగా ఫ్లోరైడ్ సమస్యపై నిరాహార దీక్ష చేశారు. దీక్షలలో నల్గొండలో కోమటిరెడ్డినే టాప్. దీక్షలు పక్కనపెట్టి, ఇపుడు పాదయాత్రను ఎంచుకున్నారు కోమటిరెడ్డి.

నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం, శ్రీశైలం సొరంగ మార్గం, పిల్లాయిపల్లి, బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలన్నది కోమటిరెడ్డి డిమాండ్. అందుకే ఈనెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్‌లోని జల సౌధ వరకు, వంద కిలో మీటర్లు పాదయాత్ర చేస్తానని అన్నారు. ఎప్పటినుంచో పాదయాత్ర చేస్తానని చెబుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఇప్పటికి ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

నిజానికి వెంకటరెడ్డి, 2018 ఎన్నికలకు ముందే జిల్లాతోపాటు, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి పాదయాత్ర చేస్తానన్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వలేదని స్వయంగా ఆయనే వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డితో పాటు, కాంగ్రెస్ ఓటమిపాలయ్యింది. తిరిగి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. జిల్లాలో నత్తనడక సాగుతున్న ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలంటూ, ఇప్పుడు పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. 5000 మంది రైతులతో హైదరాబాద్ జల సౌధ వరకు పాదయాత్రకు సిద్దమవుతున్నారు.

పాదయాత్ర కోసం ఇప్పటికే అనుమతి కోసం డిజిపికి దరఖాస్తు కూడా చేసుకున్నారు కోమటిరెడ్డి. కానీ పాదయాత్ర చేస్తానని ప్రకటించడం వెనక చాలా కారణాలున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తమ్ముడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి, కమలంతో దోస్తీకి సై అన్నప్పటి నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను వీడేది లేదని ప్రకటిస్తున్నారు. అంతే‌కాదు బహిరంగంగా ఖండించారు కూడా. అయినా కోమటిరెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలు మాత్రం, పూర్తిగా చల్లారడం లేదు.

బీజేపీ ఆకర్ష్ మంత్రానికి జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా వలసలు పెరగడం, టీఆర్‌ఎస్‌‌లోనూ కాంగ్రెస్‌ నుంచి జంపింగ్‌లతో, క్యాడర‌లో నిస్తేజం నెలకొంది. అయితే తాను బీజేపీలోకి వెళ్తున్నాను అన్న పుకార్లను పటాపంచలు చేయాలన్నది కోమటిరెడ్డి వ్యూహంగా తెలుస్తోంది. అందుకు పాదయాత్రే సరైన వేదిక అన్నది ఆయన ఆలోచన. దీనిద్వారా కార్యకర్తలకు, అటు పార్టీ అధిష్టానానికి నమ్మకం కలిగించాలన్నది స్ట్రాటజీ. త్వరలోనే పీసీసీ మార్పు ఉంటుందని గట్టిగా నమ్ముతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే, కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకొనైనా పాదయాత్ర చేసి తీరాలని సంకల్పించారు. పాదయాత్ర ద్వారా అధిష్టానం దృష్టిలోనూ మార్కులు కొట్టేసి, పీసీసీ చీఫ్ పీఠంపై కూర్చోవాలన్నది కోమటిరెడ్డి స్ట్రాటజీ. తాను రాజకీయ గురువుగా భావించే, వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని, టార్గెట్‌ డిసైడ్‌ చేసుకున్నారు కోమటిరెడ్డి. మొత్తానికి పాదయాత్రతో తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నారు కోమటిరెడ్డి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories