కేసీఆర్ మౌనం.. ఆ సీనియర్ నేత పొలిటికల్ కెరీర్ మళ్లీ డైలమాలో పడిపోయినట్టేనా ?
Motkupalli Narasimhulu: దళితబంధు ఛైర్మన్ అన్నారు... ఎమ్మెల్సీ అన్నారు... ఏదో ఒక నామినేటెడ్ పదవి అన్నారు... ఇవేమీ లేదు.
Motkupalli Narasimhulu: దళితబంధు ఛైర్మన్ అన్నారు... ఎమ్మెల్సీ అన్నారు... ఏదో ఒక నామినేటెడ్ పదవి అన్నారు... ఇవేమీ లేదు. ఇవ్వలేదు! మరి నెక్స్ట్ ఏంటి? రాజ్యసభ ఎంపీ.! అధినేత ఆఫర్ చేస్తారా? ఇదిగో తీసుకో అంటూ చేతిలో పెడతారా? దళిత నేతలకు పదవులు దక్కడం లేదు...దళిత జనోద్దరణ జరగడం లేదంటూ అవకాశం చిక్కినప్పుడల్లా... ఊదరగొట్టే గులాబీ బాస్... ఆ లీడర్ విషయంలో మెత్తబడుతారా? ఊరించి, ఊరించి ఇంకా ఊగీసలాటలోనే ఉంచుతారా? ఇంతకీ ఎవరా నాయకుడు... ఊరిస్తున్న ఆ పదవికి ఊ... అంటారా... ఊహూ.. అంటారా?
మోత్కుపల్లి నర్సింలు. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ పొలిటికల్ లీడర్. ఎవరిని విమర్శించినా బాక్స్‌బద్దలు అవ్వాల్సిందే. మాటలు తూటాలు పేలిస్తే అవతలి వాళ్ల గుండెకు తాకాల్సిందే. టీడీపీలో ఉన్నప్పుడు లక్ష్మీబాంబులా పేలిన ఈ లీడర్ గులాబీ గూటిలో తోక టపాకాయ్ అయ్యారట. తన సహజ సిద్ధమైన దూకుడు స్వభావానికి భిన్నంగా మారిపోయారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతను ఆకాశానికెత్తే ఆ నాయకుడు గులాబీ అధినేతపై పొగడ్తల స్వరాన్ని అందుకున్నా ఫలితం లేదట. ఎంత పొగడ్తలతో ముంచెత్తినా ప్రశంసలతో జేజేలు పలికినా ఆశించిన ప్రయోజనం ఉండటం కనిపించడం లేదట. తెలంగాణ భవన్ మెట్లు ఎక్కి ఇన్నాళ్లయింది ఇంకెన్నాళ్లు ఇలా ఖాళీగా ఉండాలంటూ ఎదురుచూస్తున్నారట.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యమ నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మోత్కుపల్లి ఆయన విషయంలో స్వరం మార్చారు. తిట్టిన నోరుతోనే అభినవ అంబేద్కర్ అంటూ కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇదంతా తెలిసిన విషయమే కాకపోతే, రాజకీయ చివరి అంకంలో ఉన్న మోత్కుపల్లి తన సహజ సిద్ధమైన మనస్తత్వానికి భిన్నంగా మారిపోయారు. తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చే వరకూ ఆ మాటకొస్తే కమలం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఫైర్‌బ్రాండ్ నేతగానే ఉన్న ఈయన కారెక్కిన తర్వాత సైలెంట్ అయిపోయారు. దళితబంధు విషయంలో కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఆయన దళితుల దృష్టిలో ఇప్పుడు అభినవ అంబేద్కర్ అంటూ జేజేలు పలికారు. దీని వెనుక ఓ కారణం లేకపోలేదు. అదేంటంటే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధుకు తనను ఛైర్మన్‌ను చేస్తారన్న ప్రచారంతో ఇన్నాళ్లు వేయి కళ్లతో ఎదురుచూశారు మోత్కుపల్లి.
అలా, చూసి చూసి, మోత్కుపల్లికి కళ్లు కాయలు కాస్తున్నాయే కానీ కారు పార్టీలో చేరి ఇన్నాళ్లయినా ఏ పదవీ లేకుండా దిక్కులు చూస్తున్నారట. తనకంటే వెనుకాల టీఆర్ఎస్ వైపు చూసిన మోత్కుపల్లి మాజీ సహచరుడు, ఎల్.రమణకు పిలిచి మరీ గులాబీ కండువా కప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఎమ్మెల్సీని కూడా చేశారు. తనకు కూడా అలాంటి పదవి ఏదో ఒకటి వస్తుందని అనుకున్నారట. కానీ తనను పెద్ద మనిషిగానే చూస్తున్న కేసీఆర్ పార్టీలో చేర్చుకోని ఇలా ఖాళీగా కూచోబెట్టడంపై ఆవేదనతో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. మొన్నీ మధ్య రిలీజ్ చేసిన నామినేటెడ్ పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వకుండా ఎందుకు వెనుకా ముందాడుతున్నారో తెలియడం లేదని తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. ఏనాటికైనా దళితబంధు ఛైర్మన్ చేస్తారన్న నమ్మకంతో ఉన్న మోత్కుపల్లి కేసీఆర్‌ను అభినవబుద్ధుడు అంటూ, దళిత జీవితాల్లో వెలుగుల నింపే నాయకుడంటూ డబ్బా కొడుతున్నారట.
అది కాకపోతే, ఇంకోటి. మోత్కుపల్లి విషయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. మొన్నీ మధ్య ఖాళీ అయిన బండా ప్రకాశ్ ప్లేస్‌లో తనను రాజ్యసభకు పంపిస్తారేమోనన్న ఆశతో ఉన్నారట. వచ్చే ఏడాది ఖాళీ కాబోతున్న నిజామాబాద్‌లో డి. శ్రీనివాస్, వరంగల్ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల్లో ఏదో ఒకటి తనకు రాకపోతుందా అని మోత్కుపల్లి ఆశలు పెట్టుకున్నారట. అయితే, ఇలాంటి పదవుల పంపకాల విషయంలో ఏదో ఒకమాట చెప్పి మోత్కుపల్లిని ఖుషీ చేస్తున్నారే కానీ పదవి కట్టబెట్టడం లేదని ఆయన అనుచరులు ఫీలవుతున్నారట. సరైన గౌరవం లేదని బీజేపీకి రాజీనామా చేసి, కారెక్కితే ఇక్కడా అదే పరిస్థితి ఎదురవుతుందని మోత్కుపల్లి మొత్తు కుంటున్నారట.
ఇక్కడ ఇంకో విషయం ఉంది. హుజూరాబాద్‌లో పట్టు కోసమని కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి వచ్చిన కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ముందు గవర్నర్ కోటాలో ఉన్న కౌశిక్ ఫైల్‌ను రాజ్‌భవన్ హోల్డ్‌పెట్టడంతో ఆ పదవిని మోత్కుపల్లి ఇవ్వొచ్చని చర్చ జరిగింది. కానీ అది కూడా సిరికొండ మధుసూదనచారి ఎగరేసుకుపోయారు. నామినేటెడ్ పదవులను కూడా ఎస్సీ, బీసీలకే కట్టబెడుతున్నారు. అయితే, ఎస్పీ సామాజికవర్గం నుంచి ఎదిగిన తనకు కూడా ఏదో ఒక మంచి పదవి ఇస్తే దళితుల్లో మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉందని మోత్కుపల్లి అనుచరులు అనుకుంటున్నారట. ఏమైనా ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన కేసీఆర్ మోత్కుపల్లిని చివరిదాక లాగి అలా వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది.
వాస్తవానికి, మోత్కుపల్లి కూడా తన రాజకీయ చివరి దశలో గౌరవప్రదమైన రిటైర్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో అలాంటి పదవి ఒకటి దక్కితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ మేరకు సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి తన అవసరం ఉందని తెలిసి కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్న మోత్కుపల్లికి గులాబీ అధిష్టానం ఆఫర్ ఇచ్చి వాడుకుంటుందా గాలికి వదిలేసి ఆడుకుంటుందో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire