Corona Tension: కరోనాకు హాట్‌స్పాట్‌లుగా పెళ్లి వేడుకలు

Most of Corona Cases Founded in Marriages and Shopping malls
x

కరోనా (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona Tension: దుకాణాలు, షాపింగ్ మాల్స్‌, రద్దీ ప్రాంతాలు కరోనా విజృంభణకు వేదికలు

Corona Tension: నిన్న, మొన్నటి వరకు జిల్లాల్లో పదుల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు వందల్లోకి వెళ్తున్నాయి. పెళ్లి వేడుకలు కరోనాకు హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. దుకాణాలు, షాపింగ్ మాల్స్‌, రద్దీ ప్రాంతాలు కరోనా విజృంభణకు వేదికలుగా మారుతున్నాయి. తెలంగాణలో వైరస్ రెండో దశ తీవ్రత పెరుగుతోంది. 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీటిలో నిర్మల్‌ జిల్లాలో కేవలం వారం వ్యవధిలోనే కేసులు 12 రెట్లు, నిజామాబాద్‌ జిల్లాలో పదిరెట్లు పెరిగాయి.

కరోనా విజృంభిస్తున్న మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలే కావడం గమనార్హం. జగిత్యాల జిల్లాలో వారంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు రెట్లు, రంగారెడ్డి, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో నాలుగు రెట్లు అధికంగా నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు పెరిగాయి. కాగా, రాష్ట్రంలోని 25 జిల్లాల్లో వారం క్రితం వరకు పాజిటివ్‌లు పదిలోపే ఉన్నాయి. ప్రస్తుతం 40-50 కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, జోగుళాంబ గద్వాల, ములుగు, వరంగల్‌ రూరల్‌లోనే పరిస్థితి అదుపులో ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా వైరస్‌ విజృంభిస్తుండటంతో అన్ని జిల్లాల్లో కలిపి 88 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్య శాఖ వెల్లడించింది. వీటిలో మొత్తం 8వేల 114 పడకలను సిద్ధం చేశారు. ఈ కేంద్రాల్లో అత్యధికం ప్రభుత్వ విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలు, గురుకుల పాఠశాలల్లో నెలకొల్పారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ కేంద్రాలతో పాటు హోటళ్లలోనూ సొంత ఖర్చుతో ఉండేలా కేంద్రాలను అందుబాటులో ఉంచారు.

రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను ఇవ్వడంపై ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల్లో కేసుల పెరుగుదలను అరికట్టేందుకు ఆశా కార్యకర్తలను వినియోగించుకోనుంది. రాష్ట్రంలో 25 వేల మంది ఆశా వర్కర్‌లు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు రోజుకు 25 మంది చొప్పున గ్రామీణంలో 45 ఏళ్లు పైబడిన వారిని టీకాల కోసం తీసుకొని వచ్చేలా కృషి చేయనున్నారు.

రాష్ట్రంలో శనివారం మరో 45వేల 532 మంది తొలిడోసు టీకాలను పొందగా, 10వేల 872 మంది రెండోడోసు టీకాలను పొందారు. గవర్నర్‌ తమిళిసై మంత్రి ఈటల రాజేందర్‌కు ఫోన్‌ చేసి కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధరణ పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్స వివరాలపై ఆరా తీశారు. కేసుల పెరుగుదలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరూ తప్పకుండా టీకా తీసుకోవాలని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories