ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి షురూ!

ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి షురూ!
x
Highlights

ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు... మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సమీప భవిష్యత్తులోనే ఈ రెండింటికి ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది.

ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు... మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సమీప భవిష్యత్తులోనే ఈ రెండింటికి ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై కసరత్తులు చేస్తుండగా... ప్రధాన పార్టీలు ఓటర్ల నమోదు కార్యకర్రమంలో నిమగ్నమయ్యాయి.

ప్రస్తుతం రాజకీయపార్టీలన్ని శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. గ్రాడ్యుయేట్ కోటా శాసన మండలి ఎన్నికలకు ఓటర్ల జాబితాను తయారు చేసే కసరత్తు చురుగ్గా కొనసాగుతోంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్​నగర్, నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీ కాలం.. మార్చి 29, 2021 నాటికి ముగియనుంది. అప్పటిలోగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితా తయారు ప్రక్రియను ప్రారంభించింది.

ఎమ్మెల్సీ ఎన్నిక కోసం డీనోవా విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో పాత జాబితాతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ మళ్లీ ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందే. ఈసీ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 6 వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 1న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించి 2021 జనవరి 18న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఆ జాబితా ఆధారంగానే ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహిస్తారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాజకీయ పార్టీలు, ఆశావహులు పోటాపోటీగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి మరీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసమితి.. ఇలా అన్ని పార్టీలు తమ శ్రేణుల ద్వారా ఓటర్ల నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈమారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అర్హత తేదీకి 3 సంవత్సరాల ముందు గ్రాడ్యుయేషన్ పూర్తైన వారు.. ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం 2020 నవంబర్ ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. అంటే 2017 నవంబర్​లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఇప్పుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories