మరింత వేడెక్కనున్న మునుగోడు పాలిటిక్స్

MLA Rajgopal Reddy Will Submit his Resignation Letter to the Speaker
x

మరింత వేడెక్కనున్న మునుగోడు పాలిటిక్స్

Highlights

*కాసేపట్లో స్పీకర్‎ను కలవనున్నరాజగోపాల్‎రెడ్డి, రాజీనామా పత్రం సమర్పించనున్న రాజగోపాల్‎రెడ్డి

Komatireddy Rajgopal Reddy: మునుగోడు రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. కాసేపట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలువనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్‌ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో స్పీకర్‌కు రాజీనామా సమర్పించనున్నారు. కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా తర్వాత బీజేపీలో చేరనున్నారు. 21వ తేదీన రాజగోపాల్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాను స్పీకర్‌ ఆమోదిస్తే ఆరు నెలల్లోపు మునుగోడు ఉప ఎన్నిక రావడం ఖాయం. దీంతో రాజీనామాను స్పీకర్‌ తనకు అందిన వెంటనే ఆమోదిస్తారా..? లేక న్యాయ సలహా తీసుకుని ఆమోద ముద్ర వేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజల కోసమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపిన ఆయన.. అవమానాలు భరిస్తూ ఉండలేనన్నారు. రాజీనామా నిర్ణయం తన స్వార్థం కోసం కాదని మునుగోడు అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే మళ్లీ మునుగోడు నుంచి పోటీ చేస్తానన్నారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వాలన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ మాత్రమే అభివృద్ధి చెందాలా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అభివృద్ధి వద్దా? అని ప్రశ్నించారు. ప్రజలు ఇతర పార్టీలను గెలిపించడం తప్పా? అని అన్నారు. తన రాజీనామాతో మునుగోడుకు మేలు జరుగుతుందని భావిస్తున్నానని తెలిపారు.

రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తుండటంతో మునుగోడు బై పోలో ఖాయం కానుంది. మూడు పార్టీలకు మునుగోడులో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఉప ఎన్నికను మూడు పార్టీలు సవాల్ గా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కావడం వల్ల.. టీఆర్ఎస్ లైట్ తీసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయినా గెలిచి తీరాలని గట్టిగా భావిస్తోంది. కాంగ్రెస్ కు ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారనుంది. రేవంత్ నాయకత్వానికి సవాల్ విసరనుంది. అటు బీజేపీ మునుగోడులో గెలిచి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. రాజగోపాల్ రెడ్డి విజయం నల్లేరుపై నడకేనని భావిస్తోంది. ఉప ఎన్నికలతో తెలంగాణలో సత్తా చాటిన టీఆర్ఎస్ ను అదే ప్లాన్ తో దెబ్బకొట్టాలని కమలనాథులు కదనోత్సాహం ప్రదర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories