హరీష్‌ రావు మనసును లాగేస్తున్న సెగ్మెంట్ ఏది?

హరీష్‌ రావు మనసును లాగేస్తున్న సెగ్మెంట్ ఏది?
x
Highlights

హరీష్‌ రావు అంటే సిద్దిపేట. సిద్దిపేట అంటే హరీష్‌ రావు అన్నది అందరూ అనేమాట. కానీ హరీష్‌ రావు మనసు ఇప్పుడు మరో సెగ్మెంట్‌పై మళ్లుతోందా అన్న అనుమానాలు...

హరీష్‌ రావు అంటే సిద్దిపేట. సిద్దిపేట అంటే హరీష్‌ రావు అన్నది అందరూ అనేమాట. కానీ హరీష్‌ రావు మనసు ఇప్పుడు మరో సెగ్మెంట్‌పై మళ్లుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట కొందరికి. ఎందుకంటే, ఆయన ఫోకస్ ఈమధ్య ఆ నియోజకవర్గంపై పెరిగిందట. ఇంతకీ హరీష్‌ రావు మనసును లాగేస్తున్న ఆ నియోజకవర్గం ఏంటి? మరి అక్కడున్న ఎమ్మెల్యే వ్యూహమేంటి?

మున్సిపల్ ఎన్నికల నుంచి సంగారెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారట మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు హరీష్ రావు. నియోజకవర్గానికి గుండె కాయ వంటి రెండు మున్సిపాలిటీలను దగ్గరుండి గెలిపించారు. దీంతో ఇక నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించాలనే పట్టుదలతో ఉన్నారట హరీష్. అందులో భాగంగానే తన నియోజకవర్గం సిద్దిపేట తర్వాత, సంగారెడ్డి నియోజకవర్గానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమమైనా, హరీష్ రావు సంగారెడ్డిలో వాలిపోతున్నారట.

మొన్నటి వరకు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు హరీష్. తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా, సంగారెడ్డి, సదాశివ పేట మున్సిపాలిటీల్లో కలియ తిరిగారు. పలు వార్డుల్లో పర్యటించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు. ఇదే కాకుండా సంగారెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారట. వారి ఫోన్ కాల్స్‌కు రెస్పాండ్ కావడంతో పాటు, వారికి కావాల్సిన పనులు చేసి పెడుతూ పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారట. సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్య కార్యకర్తల ఇంటికి సైతం వెళ్లి, వారికి భరోసా ఇస్తున్నారట హరీష్ రావు.

సంగారెడ్డిపై హరీష్ రావు ప్రత్యేక దృష్టికి కారణం స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఖరే కారణమని టీఆర్ఎస్‌ నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. మున్సిపల్ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి, హరీష్ రావును బహిరంగంగా దూషించడం, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, కసి పెంచుకున్నారట మంత్రి. ఎలాగైనా జగ్గారెడ్డికి చెక్‌పెట్టాలని నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపై నియోజకవర్గంపైనా పూర్తిస్థాయి పట్టు సాధించి స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఊపిరాడకుండా చేయాలనేది హరీష్ రావు వ్యూహంగా టీఆర్ఎస్‌ నాయకులు మాట్లాడుకుంటున్నారట.

కానీ జగ్గారెడ్డి మాత్రం ప్రభుత్వ కార్యకమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇదే అనువుగా హరీష్ రావు దూసుకుపోతున్నారు. ఈ పరిణామాలన్నీ సైలెంట్ గా గమనిస్తున్న జగ్గారెడ్డి, ఏ మాత్రం స్పందించడం లేదు. మంత్రి హరీష్ రావుకు ఒక వ్యూహం ఉంటే, దానికి ప్రతివ్యూహం తన దగ్గర ఉందని, తన క్యాడర్‌తో అంటున్నారట జగ్గారెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాలు ముగిసిన తర్వాత సంగారెడ్డిలో తనదైన కార్యక్రమాలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు, వార్డులకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారట జగ్గారెడ్డి. ఏది ఏమైనా అధికార పార్టీ మంత్రి, ప్రతిపక్ష ఎమ్మెల్యే వ్యూహ, ప్రతి వ్యూహాల మధ్య సంగారెడ్డి రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories