షర్మిల కొత్త పార్టీ నిర్ణయంపై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు

Gangula Kamalakar Makes Controversial Comments On YS Sharmila
x

వైఎస్ షర్మిల అండ్ గంగుల కమలాకర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

తెలంగాణలో కొత్త పార్టీతో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు తెలంగాణలో షర్మిల ఎంట్రీపై విమర్శలు...

తెలంగాణలో కొత్త పార్టీతో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు తెలంగాణలో షర్మిల ఎంట్రీపై విమర్శలు గుప్పిస్తుండగా టీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చింది. షర్మిలపై కామెంట్లు చేయకూడదంటూ ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. అయినా సరే, కొందరు మంత్రులు షర్మిలపై మాటల బాణాలు వదులుతూనే ఉన్నారు.

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడు పెంచిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చే లక్ష్యంతోనే అడుగులేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయంగా వడివడిగా అడుగులేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల.. లేటెస్ట్‌గా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులు, సానుభూతిపరులతో సమావేశం నిర్వహించారు.

షర్మిల కొత్త పార్టీ నిర్ణయంపై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణాన్ని అంటూ షర్మిల ఎంట్రీ ఇస్తున్నది ఎందు కోసం? తెలంగాణ నీళ్లు, కరెంటును దోచుకుపోవడానికేనని ఆరోపించారు. ఇవాళ జగనన్న బాణం షర్మిల వచ్చింది. రేపు జగనన్నే దిగుతాడు... ఆ వెంటనే చంద్రబాబు కూడా వచ్చేస్తాడు... ఇంకేముంది. తెలంగాణలో మళ్లీ కొట్టాటలు మొదలవుతాయని వ్యాఖ్యానించారు.

అయితే షర్మిల పార్టీ ప్రకటన రాకుండానే ఆమె మీద ఇతర పార్టీ నేతల విమర్శల దాడి తీవ్రంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నేతలు ఆమెను టార్గెట్ చేస్తున్న అంశం రాష్ట్రానికి సంబంధించినది. తెలంగాణలో పార్టీ పెట్టాలంటే ఇక్కడి వాళ్ళు పెట్టాలి కానీ ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం ఏమిటి అంటూ వస్తున్న విమర్శల కోసం షర్మిల కొత్త నినాదం ఎత్తుకోనున్నట్లు చెబుతున్నారు. తాను తెలంగాణ కోడలిని అని తనకు కూడా ఇక్కడ రాజకీయం చేసే హక్కు ఉంటుందని షర్మిల తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించారు అని చెబుతున్నారు. తన పుట్టినిల్లు ఆంధ్ర అని అత్తారిల్లు తెలంగాణ అనే విధంగా ప్రచారం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇక షర్మిల భర్త అనిల్ కుమార్ ది తెలంగాణ. తెలంగాణలో జన్మించిన ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు. దీంతో తాను తెలంగాణ కోడలిగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్నా అనే సంకేతాలు షర్మిల ప్రజల్లోకి పంపేందుకు ఈ కొత్త నినాదాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories