బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… నిజమా? కాంగ్రెస్ వ్యూహమా? తెరవెనుక ఏం జరుగుతోంది?

Merger of BRS in BJP is it true Congress strategy What is going on behind the scenes
x

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… నిజమా? కాంగ్రెస్ వ్యూహమా? తెరవెనుక ఏం జరుగుతోంది?

Highlights

బీఆర్ఎస్ కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతారని.. ఆ తర్వాత మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రేవంత్ రెడ్డి ఆగస్టు 16న దిల్లీలో చెప్పారు.

బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ నాయకులు కొట్టిపారేస్తున్నారు. మరో వైపు బీజేపీ నాయకులు కూడా అలాంటి ప్రతిపాదన లేదని చెబుతున్నారు. కవిత బెయిల్ కోసమంటూ సాగుతున్న ప్రచారం మైండ్ గేమంటూ గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ప్రచారానికి కారణం ఏంటి? తెరవెనుక ఏం జరుగుతోంది?


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

బీఆర్ఎస్ కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతారని.. ఆ తర్వాత మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రేవంత్ రెడ్డి ఆగస్టు 16న దిల్లీలో చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని... కమలం పార్టీతో గులాబీ పార్టీ నాయకులు చర్చిస్తున్నారని ఆయన తెలిపారు.

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి, హరీష్ రావుకు అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవి దక్కుతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరికతో కవితకు బెయిల్ కూడా వస్తుందని ఆయన తెలిపారు.


పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా…

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంతర్గతంగా మంచి సంబంధాలున్నందునే కవితను దిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ప్రచారం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి రాజకీయంగా కలిసివచ్చింది. ఈ ప్రచారాన్ని బీజేపీ, బీఆర్ఎస్ లు తిప్పికొట్టలేకపోయాయి. ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 7 స్థానాల్లో మిగిలిన ఒక్క స్థానంలో ఎంఐఎం పోటీ చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందనే సంకేతాలను గులాబీ పార్టీ వర్గాలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చారనే ప్రచారం కూడా సాగింది. బీజేపీకి ప్రయోజనం కలిగించేలా బలహీనమైన అభ్యర్ధులను బీఆర్ఎస్ బరిలోకి దింపిందని కాంగ్రెస్ విమర్శలు చేసింది.


కవిత అరెస్టుకు ముందు, తరువాత…

దిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తమకు నష్టం చేసిందని బీజేపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో ఒప్పుకున్నారు.

దిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ తో అంతర్గతంగా ఒప్పందాలు లేవని కమలం పార్టీ ప్రజలకు సంకేతాలు ఇచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేశారని కూడా బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ అరెస్టుతో రాజకీయంగా బీఆర్ఎస్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోందని కూడా హస్తం పార్టీ ఆరోపించింది.


బీఆర్ఎస్ కు షాకిచ్చిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గులాబీ పార్టీకి షాకిచ్చారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ గెలవలేదు. 2019లో ఆ పార్టీ 9 స్థానాల్లో గెలిచింది. బీజేపీ, కాంగ్రెస్ లు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తమ సీట్లను పెంచుకున్నాయి.

గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో తమ బలాన్ని ఎనిమిది స్థానాలకు పెంచుకుంది. కాంగ్రెస్ పార్టీ బలం 3 స్థానాల నుంచి 8 స్థానాలకు పెరిగింది. ఎంఐఎం తన పట్టును నిలుపుకుంది. బీఆర్ఎస్ కు కంచుకోటలుగా పేరొందిన స్థానాల్లో కూడా ఆ పార్టీ ఓటమి పాలైంది.

మెదక్ పార్లమెంట్ స్థానంలోని సిద్దిపేట అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధికి సుమారుగా 2 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీకి మెజారిటీ రాలేదు.

తమను ఓడించేందుకు బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో బీజేపీకి ఎలా మెజారిటీ వచ్చిందని ఆయన ప్రశ్నించారు.


కవిత బెయిల్ కోసమేనా?

కల్వకుంట్ల కవిత అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సమయంలో ఆమె బెయిల్ కోసం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం కోసం తెరవెనుక మంత్రాంగం చేసిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇటీవల కాలంలో రెండుసార్లు హరీష్ రావు, కేటీఆర్ లు దిల్లీకి వెళ్లారు. బీజేపీ నాయకులతో చర్చల కోసం వీరిద్దరూ హస్తినబాట పట్టారని కాంగ్రెస్ ఆరోపించింది.

కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో పార్టీని విలీనానికి సిద్దమయ్యారని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ తోసిపుచ్చింది. బీజేపీ సపోర్ట్ ఉంటే 150 రోజులుగా కవిత జైల్లో ఎందుకుంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. బీఆర్ఎస్ ఉండొద్దని కోరుకొనే వాళ్లే ఈ ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.


బీఆర్ఎస్ విలీనంపై బీజేపీ నాయకులు ఏమన్నారంటే?

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొట్టి పారేశారు. కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. దీనికి మా పార్టీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు.

దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది.. ఆప్ ను బీజేపీలో విలీనం చేస్తేనే బెయిల్ వచ్చిందా అని అడిగారు. కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ ను విలీనం చేస్తారని ఆయన చెప్పారు. మరో వైపు ఈ విలీనంపై తమ పార్టీలో జరగలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. బీఆర్ఎస్ ను నడిపించే నాయకుడు లేడనే భావన గులాబీ పార్టీలో ఉంటే మేమేం ఏం చేస్తామన్నారు.


నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందా?

బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కమలం పార్టీతో పొత్తును తోసిపుచ్చలేమంటున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్టుగానే బీఆర్ఎస్ కు బీజేపీ స్నేహహస్తం అందించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేనందున పొత్తు అవసరం కూడా ఈ రెండు పార్టీలకు ఇప్పటికిప్పుడే లేదని రాజకీయ విశ్లేషకులు హరగోపాల్ చెప్పారు. విలీనం అనేది ఆ పార్టీకి ఆత్మహత్య వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.

రైతు రుణమాఫీ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు విలీనం అంశాన్ని రేవంత్ రెడ్డి తెరమీదికి తెచ్చారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నది రేవంత్ రెడ్డే అని ఆ పార్టీ విమర్శిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories