Warangal: వరంగల్‌ ఎంజీఎంలో మందుల కొరత

Medicine Shortage in Warangal MGM Hospital
x

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మందుల కొరత

Highlights

Warangal: ప్రైవేట్‌ మెడికల్‌ ఏజెన్సీలతో చేతులు కలిపిన మాఫియా

Warangal: లెటర్‌ ప్యాడ్‌పై దుకాణం పేరు కాగితాలపై లక్షల రూపాయల్లో మందుల సరఫరా పనిచేసే వారే సూత్రధారులు.. బినామీలు పాత్రధారులు.. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి కేంద్రంగా ఏళ్ల తరబడి సాగుతున్న ఏజెన్సీల బాగోతమిది. మాయరోగాలు ప్రజలను పీడిస్తుంటే మందుల కంపెనీలతో ఉద్యోగులు, బినామీలు కుమ్మక్కై ఖజానాను కొల్లగొడుతున్నారు.

వరంగల్‌ MGM ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పేషంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీడీఎస్‌ నుంచి ప్రభుత్వం సరఫరా చేయని అత్యవసర మందులను ఆయా ఆసుపత్రులు తమ అవసరాన్ని బట్టి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇక్కడే అసలు దందాకు తెరతీశారు కొందరు ఉద్యోగులు. ప్రత్యామ్నాయ ఔషధాలు అందించకుండా ఏవీ లేవని కొరత సృష్టించి బయట తెచ్చుకోమని సూచిస్తున్నారు. దీంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్‌ మెడికల్‌ ఏజెన్సీలతో మాఫియా చేతులు కలిపింది. ఎంజీఎం, సెంట్రల్‌ మెడికల్‌ స్టోర్‌లోని కొంతమంది ఆఫీసర్లు, స్టాప్‌ సాయంతో MGM ఆస్పత్రికి అవసరమున్నా, లేకున్నా మందులను అంటగడుతున్నారు. అంతేకాదు తామనుకున్న కంపెనీల మందులే ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్కువ స్టాక్‌ తేవడంతో 2016-19 ఏడాదిలో 4.5కోట్ల రూపాయల మందులు ఎక్స్‌పైరీ అయ్యాయి. 6.22కోట్ల విలువైన మందులు అట్టపెట్టల్లోనే మగ్గిపోయాయి. ఇందుకుగాను నలుగురిపై తాత్కాలిక చర్యలు తీసుకుని సరిపెట్టారు.

స్టోర్స్‌లో పనిచేసే వారికి బదిలీలు లేక ఇక్కడే పాతుకుపోవడం వల్ల వారు లెటర్‌ ప్యాడ్‌పై బినామీ ఎజెన్సీలు తెరిచారు. వారికితోడు రిటైరయిన ఉద్యోగులు ఔషధాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లుగా మారారు. పది రూపాయలకు వచ్చే మందును వంద రూపాయలకు సరఫరా చేస్తూ అందరూ కమీషన్లు పంచుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల 20లక్షల రూపాయల మందుల కొనుగోలు చేయకుండానే బిల్లులు డ్రా చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.

ఏదేమైనా MGMకు సరాఫరా అవుతున్న ఔషధాలపై నిఘా లేకపోవడం, వచ్చిన మందులు రోగులకు చేరేవరకు నిరంతర తనిఖీలు కొరవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరి ఈ దందాకు తెరదించే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories