Aarogyasri Scheme: రాష్ట్రంలో భారీగా పెరిగిపోయిన ఆరోగ్య శ్రీ బాధితులు

Massively Increased Aarogya Sri victims in Telangana | TS News
x

Aarogyasri Scheme: రాష్ట్రంలో భారీగా పెరిగిపోయిన ఆరోగ్య శ్రీ బాధితులు

Highlights

Aarogyasri Scheme: ప్రభుత్వాసుపత్రులకు వచ్చేవారు రెఫరల్ లెటర్స్ కోసం తంటాలు

Aarogyasri Scheme: రోగులకు ఆరోగ్య శ్రీ తిప్పలు తప్పడం లేదు. కార్డు ఉంటేనే సర్కారు దవాఖానాల్లో చికిత్స చేస్తున్నారు. లేదంటే సీఎం క్యాంప్ ఆఫీస్ లెటర్ తెచ్చుకోవాలని చెబుతున్నారు. దీంతో క్యాంపు కార్యాలయంలో CMCO లెటర్స్ కోసం పేషంట్లు, వారి బంధువులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఫలితంగా బాధితులకు ప్రభుత్వ ఉచిత వైద్యం అనేది నరకయాతనగా మారింది.

జబ్బు చేసినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోలేనివారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ధర్మాసుపత్రులే దిక్కు. అయితే ప్రభుత్వం పెట్టే కొర్రీలతో పేదవాడికి అందాల్సిన ఉచిత వైద్యం కూడా అందకుండా పోతోంది. ప్రభుత్వాసుపత్రికి వచ్చి అడ్మిట్ అయ్యేవారిని ఆరోగ్య శ్రీ ఉందా అని అడుగుతున్నారు సిబ్బంది. ఒకవేళ ఆరోగ్య శ్రీ లేకపోతే సీఎం సీఓ రిఫరెన్స్ లెటర్ కావాలంటున్నారు. లెటర్ తెచుకోకపోతే సర్జరీలు వాయిదా వేస్తున్నారు. ఒక్క నిలోఫర్లోనే పదుల సంఖ్యలో సీఎం సీఓ లెటర్స్ కోసం రోగుల్ని వెనక్కి పంపించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వివిధ జిల్లాల నుండి వెళ్లిన పేషెంట్లు లెటర్స్ కోసం క్యూ కడుతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి తెచ్చిన రెఫరల్ లెటర్స్ తీసుకొని వెళ్ళి దవాఖానాల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో పేషెంట్ల బాధ వర్ణనాతీతంగా మారింది.

రాష్ట్రంలో సుమారు కోటీ 20 లక్షల కుటుంబాలు ఉంటే అందులో 79 లక్షల కుటుంబాల డేటా మాత్రమే ఆరోగ్య శ్రీ ట్రస్టు దగ్గర ఉంది. ఈ లిస్టులోని 40 శాతం కుటుంబాల్లో ఎవరికైనా రోగం వచ్చి ఆసుపత్రికి వెళితే వాళ్లు రెఫరల్ లెటర్స్ కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. దీనివల్ల జిల్లాల నుండి హైరాబాద్ కు వచ్చేవారికి మరింత సమస్యగా మారుతోంది. ఉదయం సీఎం కార్యాలయానికి వెళ్లాల్సినవాళ్ళు ముందురోజే రోగులను కూడా వెంట తీసుకొచ్చి పడిగాపులు కాయాల్సి వస్తోంది. రెఫరల్ లెటర్స్ కోసం రోగంతో ఉన్నవారిని కూడా తిప్పుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

సర్కారు దవాఖానాల్లో ఉచితంగా వైద్యం అందించాల్సిన దగ్గర లెటర్స్ కోసం తిప్పలు పెట్టడం సరైంది కాదన్న అభిప్రాయం బాధితుల నుంచి వ్యక్తమవుతోంది. 2009లో సీఎం రెఫరల్ లెటర్ పద్ధతి ఉమ్మడి రాష్ట్రంలో మొదలయ్యింది. 2007లో ఆరోగ్య శ్రీ మొదలైనప్పటి నుంచీ వైట్ రేషన్ కార్డుతో లింక్ పెట్టారు. ఈ కార్డ్ ఉన్నవారికి ప్రైవేట్ హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారు. అయితే పింక్ రేషన్ కార్డ్ ఉన్నవారికి సమస్యలు ఎదురయ్యాయి. తమకు ఉచిత వైద్యం కల్పించాలని సీఎం క్యాంపు కార్యాలయనికి క్యూ కట్టారు. అలాంటివారి కోసం రెఫరల్ లెటర్స్ అనే ఆప్షన్ ఇచ్చారు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి. ఇందుకోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రేషన్ కార్డ్ లేనివారు, పింక్ రేషన్ కార్డ్ ఉన్నవారికి రెఫరల్ లెటర్స్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించడానికి ఉపయోగపడేది. అయితే టెంపరరీగా మొదలుపెట్టిన సీఎం సీఓ లెటర్ కాస్తా ఇప్పుడు కూడా కొనసాగుతుండడం బాధాకరమంటున్నారు బాధితుల సంఘం అధ్యక్షుడు జగన్.

రాష్ట్రం ఏర్పడిన తరువాత పుట్టిన పిల్లల పేర్లను రేషన్ కార్డుల జాబితాలో చేర్చకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల నుండి సీఎం సీఓ లెటర్స్ కోసం వస్తున్నవారు ఎక్కువయ్యారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చేవారిని కూడా లెటర్స్ తెచ్చుకోవాలని మెలిక పెట్టడంతో బాధితుల సంఖ్య మరింతగా పెరిగింది. సీఎం క్యాంపు కార్యాలయానికి రోగులు, వారి బంధువులతో వస్తుండడంతో వారికి టోకెన్లు ఇస్తూ సిబ్బంది కూర్చోబెడుతున్నారు. ఎక్కువ మంది వస్తే టోకెన్లు లేవని మరుసటి రోజు రావాలని తిప్పి పంపిస్తున్నారు. మరి పేదోడికి అందాల్సిన ఎమెర్జెన్సీ వైద్యం కూడా ఇన్ని కొర్రీలతో ప్రజల్నిఇబ్బందులు పెడుతుంటే ఈ ప్రభుత్వం ఎవరికోసం పని చేస్తుందో ఆలోచించుకోవాలన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories