AIMIM Party: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మార్చనున్న మజ్లిస్‌?

Majlis That Will Change The Political Equation In Telangana
x

AIMIM Party: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మార్చనున్న మజ్లిస్‌?

Highlights

AIMIM Party కంచుకోటను దాటి కయ్యానికి సిద్ధమవుతున్న మజ్లిస్‌

AIMIM Party: ఇన్నాళ్లూ హైదరాబాద్‌ ఆ పార్టీ బలం. పాతబస్తీలో పాతుకుపోయి. ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాలు దక్కించుకుంటూ వస్తున్న పార్టీ అది. కానీ ఇప్పుడు ఆ పార్టీ తన వ్యూహం మార్చేస్తోంది. తమకున్న అసెంబ్లీ స్థానాలను రెట్టింపు చేయాలనే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. 7 కాదు 15 స్థానాల్లో గెలిచి వస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా సవాల్ కూడా చేశారు ఆ పార్టీ కీలక నేత. పాతబస్తీ మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా పోటీకి దిగుతామని సంచలన ప్రకటన చేశారు.

ఇప్పుడు ఆ పార్టీ నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చనున్నాయా..? పాతబస్తీ గడ్డ దాటి పోటీ చేసే ఆ స్థానాలేంటి..? ఇప్పటివరకు రాష్ట్రంలో పాతబస్తీ తప్ప ఎక్కడా పోటీ చేయని ఆ పార్టీ ఇప్పుడు బరిలోకి దిగితే ఏ పార్టీకి లాభం..? కనీసం ఓసారి కూడా పోటీ చేయని స్థానాల్లో తమకు ఓట్లు పడటం అంత సులువని భావిస్తోందా..?

MIM ఇప్పటివరకు పాతబస్తీకి పరిమితమైన పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం వున్నప్పటికీ అక్కడ పోటీ చేయకుండా అధికార పార్టీతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికార బీఆర్ఎస్‌ పార్టీతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసింది. తాము గెలుపొందిన చాంద్రాయణగుట్ట,చార్మినార్, యాకుత్ పురా, బహదూర్ పురా,కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట అసెంబ్లీ స్థానాలతో పాటు రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసింది. రాజేంద్రనగర్‌లో రెండవ స్థానంలో నిలవగా మిగిలిన ఏడు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది.

2019 లోక్ సభ ఎన్నికల్లోను కేవలం హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి మాత్రమే పరిమితం అయింది. అయితే ఇప్పుడు మాత్రం ఎంఐఎం దూకుడు పెంచింది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో MIM పోటీ చేసి కొన్ని రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని సైతం చాటింది.

MIM శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ గత అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో MIM రాష్ట్ర వ్యాప్తంగా 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ మేరకు మా పార్టీ అధ్యక్షుడుతో మాట్లాడుతామన్నారు. 15 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని వచ్చే అసెంబ్లీలో అడుగుపెడతామన్నారు. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యల తర్వాత MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో సీఎం KCR ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో అన్నీ సవ్యంగా ఆ పార్టీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే నిజమైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు కూడా మారనున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటుగా ఆదిలాబాద్,నిజామాబాద్, కరీంనగర్,నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో ముస్లింల ఓట్లు కీలకంగా ఉంటాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో MIM పోటీ చేయడం. మిగిలిన అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతుంది. గత ఎన్నికల్లో పాతబస్తీ మినహా రాష్ట్రంలోని ఇతర స్థానాల్లో MIM బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఈ సారి 50 స్థానాల్లో సొంతంగా బరిలోకి దిగితే ఇన్నాళ్లూ బీఆర్ఎస్‌ అభ్యర్థులకు పడిన ఓట్లు MIM కొల్లగొట్టే అవకాశాలే ఎక్కువ.

దీంతో బీఆర్ఎస్‌కు ఆయా స్థానాల్లో గట్టి పోటీ తప్పదనే చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ ‌పరిస్థితి అలా ఉంటే. బీజేపీ మాత్రం MIM పోటీ చేసే స్థానాలు పెరగడం తమకు అనుకూలమని భావిస్తోంది. తమకు లబ్ధి చేకూరుస్తుందనే భావనతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే MIM 50 స్థానాల్లో కాదు 119 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

దీనికి తోడు రీసెంట్‌గా అసదుద్దీన్ ఒవైసీ ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించడం పొలిటికల్‌ హీట్ పుట్టిస్తున్నాయి. తన ప్రసంగాల్లో బీఆర్ఎస్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో MIM ఎత్తుగడలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఒవైసీ కాంగ్రెస్ దగ్గర కావడానికే ఈ స్టెప్ తీసుకున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో MIM పోటీ చేసి అక్కడి ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి లబ్ది చేకూరుస్తుందని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు MIM పై విమర్శలు చేస్తున్నాయి. అయితే తమ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్తూ వస్తున్నారు. అయితే తెలంగాణలో కూడా ఏ పార్టీకైనా లబ్ధి చేకూర్చే ప్రయత్నాల్లో భాగంగా MIM పోటీకి సిద్ధమైందా. లేక తమ ప్రాబల్యం పెంచుకుని రాష్ట్రంలో కీలక పార్టీగా ఎదగాలని భావిస్తోందా..? అనేది చర్చనీయంగా మారింది.

రెండు పర్యాయాలుగా అధికార బిఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న MIMకు పూర్తి సహాయ సహకారాలు కూడా అందుతున్నాయి. రెండు MLC స్థానాలను MIMకు కేటాయించింది. దీంతో సీఎం కేసీఆర్ తో ఒవైసీ బ్రదర్స్ కు వున్న సాన్నిహిత్యం నేపథ్యంలో MIM 50 స్థానాల్లో పోటీ చేస్తుందా లేక BRSను తన దారికి తెచ్చుకునేందుకు అక్బరుద్దీన్ ఒవైసీ 50 స్థానాల్లో పోటీ అంశాన్ని లేవనెత్తారా..? అనే చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories