Telangana Lockdown: సా.5 గంటల వరకు వెసులుబాటు కల్పించే ఛాన్స్‌

Lockdown to be Extended in Telangana
x

కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Highlights

Telangana Lockdown: తెలంగాణలో అమలవుతున్న లాక్‌డౌన్‌ అనుకున్నదానికంటే మంచి ఫలితాలను ఇస్తోంది.

Telangana Lockdown: తెలంగాణలో అమలవుతున్న లాక్‌డౌన్‌ అనుకున్నదానికంటే మంచి ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత సడలించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ సడలింపు సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొడిగించిన సర్కార్‌ ఇప్పుడు మరోసారి ఆ సమయాన్ని మరింత పెంచాలని యోచిస్తోంది. ఈ అంశంపై రేపు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరగబోయే కేబినెట్‌ భేటీలో చర్చించనుంది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో లాక్‌డౌన్‌ను మరింత సడలించే అంశంపై చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ మూడో విడతపై గత నెల 30న భేటీ అయిన కేబినెట్‌ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంటసేపు అనుమతించింది. మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 9తో ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి మరోసారి సమావేశం కానుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఆంక్షలను మరింత సడలించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అనుమతి వేళలను సాయంత్రం 5 గంటల వరకు పెంచి, ఇళ్లకు తిరిగి వెళ్లడానికి మరో గంట అనుమతించాలనుకుంటోంది. రాత్రిపూట పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఇస్తే రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ తదితర శాఖల ద్వారా మరింత ఆదాయం సమకూరుతుంది. దీని ద్వారా వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతోంది. ప్రధానంగా టీకాలు, కేంద్ర విధానాలపై కేబినెట్‌లో చర్చించనుంది. గ్లోబల్‌ టెండర్లకు స్పందన లేకపోవడంతో నేరుగా సంస్థలతో చర్చించి, తక్కువ ధరలకే వ్యాక్సిన్లను కొనుగోళ్లు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత డయాగ్నొస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 9న 19 జిల్లాల్లోని 19 ప్రధాన ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. మొత్తం 19 కేంద్రాలను ఒకే రోజు ఒకే సమయంలో ప్రారంభించనుంది.

ఇక ఈ కేబినెట్‌ భేటీలో నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, మరమ్మతులు, నిర్వహణ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఈ నెల 15 నుంచి రైతుబంధు పంపిణీ, వానాకాలం సీజన్‌కు ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల సరఫరాపై సమీక్షించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories