TRS: పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నేతలకు మొండి చేయి చూపారా...?

Legislators, MPs get Posts of TRS District Presidents
x

TRS: పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నేతలకు మొండి చేయి చూపారా...?

Highlights

TRS District Presidents: టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకంలో ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారా..?

TRS District Presidents: టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకంలో ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారా..? పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నేతలకు మొండి చేయి చూపారా...? పదవులు రాని నేతల్లో జరుగుతున్న అంతర్మధనం ఏంటి..? ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండగా...మళ్ళీ పార్టీ పదవులు ఇవ్వడంపై టీఆర్ఎస్‌లో జరుగుతున్న చర్చేంటి..?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. 33 జిల్లాలకు అధ్యక్షులు నియమించి.. పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు గులాబీ బాస్. జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకంలో 19 మంది ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమిచ్చారు. ఇక ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మన్‌లతో పాటు డీసీఎంఎస్ ఛైర్మన్లు ఇతర నేతలకు అవకాశం ఇచ్చారు. అయితే పదవులు ఉన్న నేతలకే మళ్ళీ పదవులు కట్టబెట్టడం గులాబీ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టారు. ఇక రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక.. గతంలో ఇచ్చిన వారికి మళ్లీ రెన్యువల్ చేసిన గులాబీ బాస్.. కొద్దిమంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. దీంతో ఎప్పటి నుంచో తమకు పదవులు దక్కుతాయని భావిస్తున్న నేతలకు నిరాశే మిగిలింది. ఇక నామినేటెడ్ పదవులు దక్కకున్నా పార్టీ పదవులు వస్తాయని ఎదురుచూసిన నేతలకు జిల్లా అధ్యక్ష పదవుల్లోనూ హ్యాండ్ ఇచ్చింది గులాబీ హైకమాండ్.

జిల్లా అధ్యక్ష పదవిలో చాలామందికి జోడు పదవులు ఉన్నాయి. ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్‌గా కూడా ఉన్నారు. ఇక ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావులకు కూడా జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు జగిత్యాల జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ గా పని చేస్తున్నారు. ఇక ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, లింగయ్య యాదవ్, మాలోతు కవిత జిల్లాలకు పార్టీ అధ్యక్షులు అయ్యారు. ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధుతో పాటు ముగ్గురు జిల్లా పరిషత్ చైర్మన్ లకు అధ్యక్ష పదవులు దక్కాయి.

టీఆర్ఎస్ లో గత ఏడేళ్లుగా ఎలాంటి పదవులు దక్కక నిరుత్సాహంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు.. జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక మింగుడుపడడం లేదు. ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు పదవులు ఇవ్వడం పట్ల మెజార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇచ్చిన వారికే పదేపదే పదవులు ఇస్తున్నారని ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్న తమను పక్కన పెట్టడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు సరైన అవకాశం రాకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందంటున్నారు.

మొత్తానికి తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్‌కు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకునే బాధ్యతను మళ్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్సీల చేతిలో పెట్టింది. దీంతో పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొని ముందుకెళ్లే బాధ్యత ఇక వారి మీద ఉండనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories