ఫార్మాసిటీ కోసం భూసేకరణ మరింత ముమ్మరం

ఫార్మాసిటీ కోసం భూసేకరణ మరింత ముమ్మరం
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ ఏర్పాటు ఊపందుకుంది. ఫార్మాసిటీలో భూములు తీసుకునేందుకు రైతులకు అవార్డు పాస్ చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ...

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ ఏర్పాటు ఊపందుకుంది. ఫార్మాసిటీలో భూములు తీసుకునేందుకు రైతులకు అవార్డు పాస్ చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఒక వైపు భూసేకరణ పనులు జోరుగా జరుగుతుంటే, మరోవైపు రైతులు భూమి ఇచ్చేది లేదంటూ ముక్తకంఠంతో ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీలు ఇస్తున్నా రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు మండలాల మధ్య ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను మరింత ముమ్మరం చేసింది. దాదాపు 19,333 ఎకరాలు సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 10,490 ఎకరాలు సేకరించింది. మరో 8,843 ఎకరాలు సేకరించాల్సి వుంది. ఎకరం భూమికి రూ.16లక్షలకు తోడు 120 గజాల హెచ్‌ఎండీఏ లే అవుట్‌ ప్లాటు, భూసేకరణలో భూములిచ్చిన రైతు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా ఫార్మాసిటీ ఏర్పాటవుతున్న గ్రామాల్లో యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే తాతలు సంపాదించిన భూముల్ని ఫర్మాసిటీ కోసం ఇచ్చేందుకు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.

ప్రభుత్వం చెప్పినట్టు కొందరు రైతులు తమ భూములు ఇస్తామని రెవెన్యూ అధికారులకు కాన్సెంట్‌ ఇచ్చారు. కాగా, పట్టాభూములు ఇవ్వని రైతుల పంటపొలం వివరాలు ఆరా తీసి కోర్టులో డబ్బు డిపాజిట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అసెన్డ్‌ భూములకు 8 లక్షలు, పట్టా భూములకు 2.50లక్షలు పరిహారం ఇచ్చారు. ఇందులో అసైన్డ్‌ భూములిచ్చిన రైతులకు ఎకరానికి 120 గజాల ప్లాటు మాత్రమే ఇస్తామని మంత్రులు ప్రకటించారు. ఈ రెండు మండలాల పరిధిలో అసైన్డ్‌ భూముల సేకరణ పూర్తవడంతో, ప్రస్తుతం పట్టా భూముల సేకరణ జరుగుతోంది.

ఫార్మాసిటీతో పాటు యాచారం మండలంలోని తాడిపర్తిలో 400 మంది రైతుల నుంచి 1500 ఎకరాలు, కుర్మిద్దలో 400 మంది రైతుల నుంచి 1500, నానక్‌నగర్‌లో 200 మంది రైతుల నుంచి 690, మేడిపల్లిలో 450 మంది రైతుల నుంచి 1100 ఎకరాల పట్టా భూముల సేకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాడిపర్తిలో 1500 ఎకరాల భూములను 400మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈమేరకు రెవెన్యూఅధికారులు రైతులకు భూసేకరణ విషయమై నోటీసులు జారీచేస్తున్నారు. మరోవైపు రైతులు తమ భూములు ఇవ్వమంటూ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదంటూ నోటీసులకు నిప్పంటింస్తున్నారు.

మొత్తం మీద మాత్రం ఫార్మాసిటీ పనులు కొనసాగుతున్నాయి. ఓ వైపు భూములు ఇవ్వమని రైతులు ముక్తకంఠంతో నినాదిస్తున్నారు. రైతుల దగ్గర భూములు బలవంతగా లాక్కుంటున్నారని లబోదిబోమంటున్నారు. అలాగే ఫార్మాసిటీ కాలుష్యం కారణంగా రాబోయే కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఫార్మాసిటీకి మాత్రం భూములు ఇచ్చేది లేదని, 2013 చట్టం ప్రకారం పోరాటం చేస్తామని చెబుతున్నారు రైతులు.

ఫార్మాసిటీ పనులు ఇప్పుడే ఇప్పుడే మొదలు అయ్యాయి. రైతులు పట్టా భూములు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేరు. ఇటు ప్రభుత్వం రైతులకు తగిన న్యాయం చేస్తాం అంటున్నా రైతులు మాత్రం ఇచ్చేది లేదు అంటున్నారు. ఇంకోవైపు ప్రతిపక్ష నేతలు ఫార్మాసిటీలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఫార్మా సిటి ఎలా ముందుకు వెళుతుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories