Raj Pakala Farm House: జన్వాడ పార్టీలో అసలేం జరిగింది?
What happened at Raj Pakala's Farm House Party: జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీ రాజకీయ రంగు పులుముకుంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్...
What happened at Raj Pakala's Farm House Party: జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీ రాజకీయ రంగు పులుముకుంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో నిర్వహించిన పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ పార్టీకి హాజరైన వారిలో విజయ్ మద్దూరికి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది.
ఈ పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన పోలీసుల విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరుకావడానికి రెండు రోజుల సమయం ఇవ్వాలని లెటర్ రాశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అక్టోబర్ 28న ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరయ్యేందుకు ఆయనకు కోర్టు రెండు రోజుల గడువిచ్చింది.
అసలేం జరిగింది?
రాజ్ పాకాలకు శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామపరిధిలోని శ్రీమాత్రే ప్రాపర్టీస్‌లో ఫాంహౌస్ ఉంది. ఇటీవలనే ఆయన జన్వాడలోని రిజర్వ్ కాలనీలో కొత్తగా గృహ ప్రవేశం చేశారు. అక్టోబర్ 26న కుటుంబ సభ్యులు, సన్నిహితులు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీని పురస్కరించుకొని భారీగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేయడంతో స్థానికుల నుంచి పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శనివారం రాత్రి 11:30 గంటలకు మాదాపూర్ ఎస్ఓటీ, మోకిల పోలీసులు, ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ పార్టీ జరిగిన ప్రాంతంలో సోదాలు నిర్వహించారు.
ఎక్సైజ్ అధికారులు ఏం చెప్పారు?
సైబరాబాద్ పోలీసులతో కలిసి ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున రాజ్ పాకాల ఫాంహౌస్ పై రెైడ్ చేశామని ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. ఈ పార్టీలో 40 మంది పాల్గొన్నారు. ఈ పార్టీలో 12 విదేశీ మద్యం బాటిల్స్‌తో పాటు న్యూదిల్లీ, మహారాష్ట్ర నుంచి NDPL మద్యం బాటిల్స్, 11 బీర్ బాటిల్స్ సీజ్ చేశారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీ నిర్వహించినందున చేవేళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఎక్సైజ్ చట్టం 34 (ఎ), 34 (1), 9(1) కింద కేసులను నమోదు చేసినట్టు చెప్పారు. మరో వైపు ఈ పార్టీలో గేమింగ్ సంబంధించిన అంశాలపై విచారణ నిర్వహించారు.
విజయ్ మద్దూరికి పాజిటివ్
విజయ్ మద్దూరి.. రాజ్ పాకాలకు అత్యంత సన్నిహితుడు. ఫ్యూజన్ ఏఐఎక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చైర్మన్‌గా ఉన్నారు. రాజ్ పాకాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఈటీజీ గ్లోబల్ సర్వీసుకి సీఈవోగా ఉన్నారు. కంపెనీల నిర్వహణ, వ్యాపార కార్యకలాపాల్లో విజయ్ కీలకంగా ఉన్నారని సమాచారం. రాజ్ పాకాల నిర్వహించిన పార్టీకి హాజరైన వారిలో విజయ్‌కి మాత్రమే డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. మిగిలిన వారందరికీ ఈ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు.
రాజ్ డ్రగ్స్ ఇవ్వడంతోనే తాను తీసుకున్నానని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకు ఈ వాంగ్మూలంలో ఉన్న అంశాలపై విజయ్ మద్దూరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చెప్పని అంశాలను తన స్టేట్‌మెంట్ అంటూ రాశారని ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఎఫ్ఐఆర్‌లోని అంశాలన్నీ అవాస్తవమని చెప్పారు. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు. పోలీసులు తనపై చేస్తున్న ఆరోపణలు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయన్నారు.
బీఆర్ఎస్ ఆందోళన
రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల ఇండ్ల వద్ద ఎక్సైజ్ అధికారులు అక్టోబర్ 27న సోదాలు నిర్వహించడానికి వచ్చిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, బాల్క సుమన్, సంజయ్, తదితరులు ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. సెర్చ్ వారంట్ చూపాలని కోరారు. తమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు వాదనలు వినిపించారు. ఎక్సైజ్ పోలీసులే ఏమైనా తెచ్చి రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లలో నిషేధిత పదార్ధాలు దొరికాయని చెప్పే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు ఆందోళనచేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎక్సైజ్ అధికారులు సోదాలు చేశారు.
కేటీఆర్ ఏమన్నారంటే?
రాజ్ పాకాల తన ఇంట్లో బంధువులు, స్నేహితులకు పార్టీ ఇవ్వడంలో తప్పేం ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు.
తెలంగాణ హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్
ఈ పార్టీపై కేసు నమోదైన తర్వాత రాజ్ పాకాల పోలీసులకు అందుబాటులో లేరు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని పోలీసులు చెబుతున్నారు. అక్టోబర్ 28న ఉదయం విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులు పంపారు. ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించి వెళ్లారు. అయితే రాజ్ పాకాల తరపు న్యాయవాదులు మోకిల పోలీసులకు రాజ్ పాకాల పంపిన లేఖను అందించారు. విచారణకు హాజరుకావడానికి 2 రోజుల సమయం ఇవ్వాలని ఆ లెటర్‌లో ఆయన కోరారు. మరోవైపు తనను అన్యాయంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు ఆయనకు రెండు రోజుల గడువిచ్చింది.
హైద్రాబాద్ బ్రాండ్‌ను దెబ్బతీస్తే ఊరుకోం
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ అంశంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాజకీయంగా ఎవరి మీదా కేసు పెట్టలేదని ఆయన చెప్పారు. డీజే సౌండ్ పెట్టి చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలిగించారని ఆయన చెప్పారు. రాజకీయలబ్ది కోసం కక్షసాధింపు చర్యలు లేవని ఆయన చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైద్రాబాద్ ఉండాలనేది సీఎం అభిమతమన్నారు. ఈ దిశగా అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలి
జన్వాడ ఫాంహౌస్ పార్టీపై పూర్తి దర్యాప్తు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఈ పార్టీ జరిగిన ఫాం హౌస్ సీసీటీవీ పుటేజీని విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మిస్ కాకుండా, సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని ఆయన పోలీసులను కోరారు.
కుటుంబసభ్యుల మధ్య జరిగిన పార్టీపై కూడా కేసులు బనాయించడమేంటని బీఆర్ఎస్ మండిపడుతుంటే, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందునే కేసులు పెట్టామని అధికార కాంగ్రెస్ చెబుతోంది. ఈ పార్టీ జరిగింది కేటీఆర్ బావమరిది ఇంట్లో కావడంతో ఇది హైప్రొఫైల్ వివాదంగా మారింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire