నీళ్ళు కాదు నిప్పులు... తెలంగాణ, ఏపీల మధ్య రగులుతున్న కృష్ణా జలాల వివాదం

Krishna Water Disputes Continue Between Telangana, AP
x

నీళ్ళు కాదు నిప్పులు... తెలంగాణ, ఏపీల మధ్య రగులుతున్న కృష్ణా జలాల వివాదం

Highlights

కృష్ణా జలాల పున:పంపిణీ... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదానికి కేంద్రబిందువుగా మారుతోంది.

కృష్ణా జలాల పున:పంపిణీ... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదానికి కేంద్రబిందువుగా మారుతోంది. రాష్ట్ర విభజన తరువాత కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కావాలని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు అంటే, కృష్ణా వివాదాల పరిష్కారాల ట్రైబ్యునల్ - 2కు కృష్ణా జలాల పున:పంపిణీ అధికారాలు కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 6న గెజిట్ నోటిపికేషన్ విడుదల చేసింది.

దీనిపై ఏపీలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కృష్ణా జలాల పున:పంపిణీ అధికారాలను సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేసింది.


కృష్ణా జలాల పునః పంపిణీపై దృష్టి పెట్టిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్

బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మాత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ కు అనుగుణంగా కృష్ణా జలాల పున:పంపిణీపై దృష్టి పెట్టింది. రెండు రాష్ట్రాల వాదనలను అఫిడవిట్ రూపంలో స్వీకరిస్తూ విచారణ మొదలు పెట్టింది. తెలంగాణ తన వాదననలతో అఫిడవిట్ దాఖలు చేసినా ఏపీ మాత్రం ఆ విషయంలో కాలయాపన చేస్తోంది.

ఈనెల 15న హైదరాబాద్ లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు హాజరయిన ఏపీ జలవనరుల శాఖ అధికారులు రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందున స్టేట్ మెంట్ ఆఫ్ కేస్ కు సమాధాంగా అఫిడవిట్ దాఖలుకు మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో విచారణను ఆగస్టు 28,29 తేదీలకు వాయిదా వేస్తూ అప్పటి లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందేనని ఏపీ అధికారులను ట్రైబ్యునల్ సున్నితంగా హెచ్చరించింది.

ట్రైబ్యునల్ విచారణను వీలైనంతవరకు పొడిగించేలా చేయటం, గెజిట్ నోటిఫికేషన్ అమలు కాకుండా అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ అంటోంది.

గెజిట్ ను అడ్డుకుని తీరాలని ఏపీ నుంచి డిమాండ్ ఊపందుకుంటోంది. దీనిపై రాయలసీమ సాగునీటి సాధన సమితి ఈనెల 17న ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసింది. కృష్ణా జలాల పున:పంపిణీ రాజ్యాంగ విరుద్ధం..బచావత్ ట్రైబ్యునల్ ఒకసారి రెండు రాష్ట్రాలు నీటిని పంపిణీ చేశాక దానిని తిరగదోడే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదని, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు ఆ అధికారాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిపికేషన్ చెల్లుబాటు కాదని ఆ లేఖలో తెలిపింది.

దీనిపై చంద్రబాబు కేంద్రంతో మాట్లాడాలనీ, రాయలసీమ జిల్లాలను ఎడారిగా మార్చే పున:పంపిణీనీ అడ్డుకోవాలని సమితి డిమాండ్ చేసింది. రాయలసీమలోనే కాకుండా ఏపీలో కృష్ణా బేసిన్ పరీవాహక జిల్లాలన్నిటిలోనూ దీనిపై నిరసన వ్యక్తమవుతోంది.

మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా జలాల పున:పంపిణీపై పట్టుదలగా ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా జలాల్లోల తాత్కాలికంగా ఒక సంవత్సరానికి మాత్రమే పరిమితమైన 66 శాతం వాటాను గడిచిన పదేళ్ళుగా దక్కించుకుంటోందనీ, దీని వల్ల తెలంగాణ సాగు, తాగునీటి హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడిందని తెలంగాణ వాదులు అంటున్నారు.


అసలు ఏమిటీ వివాదం..!

రాష్ట్ర పునర్విభజన అనంతరం బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా కేంద్ర జలశక్తి సమక్షంలో కృష్ణా జలాల్లో వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కృష్ణాలో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు పోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కు 811 టీఎంసీలు దక్కాయి. రాష్ట్ర విభజన అనంతరం వాటిలో ఏపీకి 511.04 టీఎంసీలు.. అంటే 66 శాతం, తెలంగాణకు 298.96 టీఎంసీలు..అంటే 34 శాతం వాటాలు దక్కాయి.

రెండు రాష్ట్రాల వాటాలపై 2015 జూన్ 18,19 తేదీల్లో కేంద్ర జలశక్తి సమక్షంలో రాతపూర్వక ఒప్పందాలు కూడా కుదిరాయి. అయితే, ఆ ఒప్పందాలు 2015-16 నీటి సంవత్సరానికి మాత్రమే పరిమితమనీ, కృష్ణా జలాల్లో 50 శాతం వాటా రావాల్సిందేనని తెలంగాణ పట్టుబడుతోంది.

ఈ విషయంపై తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా జలాల పున: పంపిణీ కోసం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆ తరువాత పున:పంపిణీపై కేంద్రం హామీ ఇవ్వటంతో పిటిషన్ ను ఉపసంహరించుకుంది.

ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయలేదు గానీ, ఇపుడు మనుగడలో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కే పున:పంపిణీ బాధ్యతలు అప్పగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.


రాజ్యాంగ విరుద్దమంటున్న ఆంధ్రప్రదేశ్

సాగుయోగ్యమైన భూమితో పాటు ప్రాజెక్టుల ఆధారంగా బచావత్ ట్రైబ్యునల్ చేసిన నీటి పంపకాలను తిరగదోడటం రాజ్యాంగ విరుద్ధమని ఏపీ వాదిస్తోంది. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం.. ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ-1956 లోని సెక్షన్‌6 (2) ప్రకారం కొత్త ట్రైబ్యునళ్ళు పాత ట్రైబ్యునల్ ఆదేశాలను పున: సమీక్షించటం చట్టరీత్యా సాధ్యం కాదని ఏపీలోని జలవనరుల నిపుణులు చెబుతున్నారు.

బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అదనంగా అందుబాటులోకి వచ్చే 163 టీఎంసీలు, వరదల సమయంలో అందుబాటులోకి వచ్చే 285 టీఎసీంసీల మిగులు జలాలు..మొత్తం 448 టీఎంసీలను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు పంచే విషయానికే పరిమితమని ఏపీ చెబుతోంది. వీటిలో 194 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది.

విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ లో ఏపీలో అదనంగా నాలుగు ప్రాజెక్టులకూ, తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు కృష్ణా జలాలను కేటాయించారు. ఏపీలో తెలుగుగంగ విస్తరణకు 29, గాలేరు-నగరి ప్రాజెక్టుకు 38, హంద్రీనీవాకు 40, వెలిగొండ కు 43.50 టీఎంసీలు..మొత్తం 150.50 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణలోని కల్వకుర్తికి 25, నెట్టెంపాడుకు 22 టీఎంసీలు..మొత్తం 47 టీఎంసీలు కేటాయించారు. ఈ పంపకాలపై కూడా రెండు రాష్ట్రాలకు అభ్యంతరాలున్నా అవన్నీ బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులు తరువాత అదనంగా కేటాయించిన జలాలపై తప్ప అంతకుముందు నిర్దారణ అయిన వాటాలపై కాదని ఏపీ చెబుతోంది.


తెలంగాణ ఏమంటోంది..!

రాష్ట్ర పునర్విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఒక ఏడాదికి మాత్రమే పరిమితమని తెలంగాణ వాదిస్తోంది. కృష్ణా జలాల్లో న్యాయబద్ధంగా తెలంగాణకు 50 శాతం వాటా రావాలని కోరుతోంది.

శ్రీశైలం నుంచి 34 టీఎంసీలకు మించి వినియోగించుకునేందుకు ఏపీకి హక్కులు లేవు. అయినా శ్రీశైలం జలాలను కృష్ణా బేసిన్ అవతలకు ఏపీ తరలిస్తోందని, ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో 20 శాతం తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని బచావత్ ట్రైబ్యునల్ చెప్పినా అమలు కావటం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది.

నిబంధనల ప్రకారం ఒక ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాల్సి ఉంటుంది. చెన్నై తాగునీటి సరఫరా కోసం 1976-77లో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి నియమ నిబంధనలను సవరణ చేయాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా జలాల పున:పంపిణీపై ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఒత్తిడితో గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో కేంద్రం మెతక వైఖరి అనుసరిస్తే... రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరి ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories