Krishna River Water to Telugu States: నేటి నుంచి కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల్లోకి.. మొదటిగా తెలంగాణాలోని జూరాలకు

Krishna River Water to Telugu States: నేటి నుంచి కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల్లోకి.. మొదటిగా తెలంగాణాలోని జూరాలకు
x
Krishna River water
Highlights

Krishna River Water to Telugu States: పశ్చిమ కనుమల్లో వర్షం ప్రభావం వల్ల కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.

Krishna River Water to Telugu States: పశ్చిమ కనుమల్లో వర్షం ప్రభావం వల్ల కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీనివల్ల ఆల్మట్టి నుంచి నారాయణపూర్, అక్కడ విడుదలైన నీరు నేటి నుంచి తెలుగు రాష్ర్టాల్లోకి చేరనుంది. తొలుతగా తెలంగాణలోని జూరాలకు చేరి, అక్కణ్ణుంచి దిగువ ప్రాజెక్టులకు వెళ్ల నుంది.

ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ కదలి వస్తోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 56,905 క్యూసెక్కులు చేరుతుండటంతో.. విద్యుత్‌ కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను సోమవారం దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 43,616 క్యూసెక్కులు చేరుతుండటం.. నీటి నిల్వ 34.87 టీఎంసీలకు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి 27,574 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల నుంచి విడుదల చేసిన జలాలు మంగళవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరనున్నాయి.

15 రోజుల ముందే శ్రీశైలానికి..

► వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టులోకి 6,032 క్యూసెక్కులు చేరుతుండగా.. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750, భీమా ఎత్తిపోతల ద్వారా 650, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వారా 151 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్‌ తరలిస్తోంది.

► ప్రస్తుతం జూరాలలో 8.38 క్యూసెక్కులు నిల్వ ఉన్నాయి. జూరాల నిండాలంటే మరో 1.27 టీఎంసీలు అవసరం.

► జూరాల నుంచి జలాలను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ జలాలు బుధవారం శ్రీశైలం జలాశయానికి చేరనున్నాయి.

► గతేడాది జూలై 30న శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం రాగా.. ఈ ఏడాది పక్షం రోజుల ముందే ఎగువ నుంచి వరద నీరు చేరనుండటం గమనార్హం.

తుంగభద్ర, గోదావరిలో తగ్గిన ప్రవాహం

► తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది. టీబీ డ్యామ్‌లోకి 17,550 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.8 టీఎంసీలకు చేరింది. టీబీ డ్యామ్‌ నిండాలంటే 79 టీఎంసీలు అవసరం.

► పులిచింతలకు దిగువన కృష్ణా బేసిన్‌లో కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీలోకి 13,485 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 6,416 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 7,069 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు.

► గోదావరిలో వరద ప్రవాహం కూడా క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 96,842 క్యూసెక్కులు వస్తుండగా.. 2,100 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేసి.. మిగిలిన 94,762 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 71.601 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి.

► గొట్టా బ్యారేజీలోకి వంశధార నది నుంచి 3,499 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 3,205 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ 8.073 టీఎంసీల వంశధార జలాలు కడలి పాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories