KRMB: ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం

Krishna River Management Board Meeting Today
x

నేడు జల సౌధలో కృష్ణ రివర్ బోర్డు మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

KRMB: పాల్గొననున్న ఇరురాష్ట్రాల నీటిపారుదలశాఖ స్పెషల్‌ సీఎస్‌లు

KRMB: ఇవాళ కేఆర్‌ఎంబీ కీలక సమావేశం జరగనుంది. నీటి వాటాలు, పంపకాలు, ఇప్పటివరకు చేసిన నీటి వినియోగం, అనుమతుల్లేని ప్రాజెక్టుల నిలుపుదల అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలు వినిపించనున్నాయి. దీంతో పాటు కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ అంశాల అమలుపై జరిగే కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త భేటీలోనూ తమ అభిప్రాయాలు వెల్లడించనున్నాయి. కేఆర్ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో ఉదయం జరగనున్న భేటీకి బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే సమావేశంలో చర్చించేందుకు 14 అంశాలతో కేఆర్‌ఎంబీ ఎజెండా తయారు చేసింది.

ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో వాటా పెరగాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోరుతుండడం, పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో బోర్డు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన జరిగినప్పటి నుంచి తాత్కాలిక అవగాహన మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 34, 66 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం జరుగుతోంది. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో కృష్ణా జలాల్లో దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం జరుగుతోందని, న్యాయపరమైన నీటి కేటాయింపులు జరిగే వరకు నీటిని చెరిసగం వినియోగించుకోవాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు కూడా తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్ తమ వాటా పెంచాలని కోరుతోంది. 70, 30 నిష్పత్తిలో నీటిని వినియోగించుకోవాలని అంటోంది.

ఒక సంవత్సరం కేటాయించిన వాటాలో మిగిలిన జలాలను మరుసటి ఏడాదికి లెక్కించాలన్న తెలంగాణ ప్రతిపాదన, వరద వచ్చినపుడు నీటి వినియోగం, తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, వాటి డీపీఆర్లు ఇవ్వడం, చిన్ననీటివనరులకు నీటి వినియోగం, ఏపీ గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున 45 టీఎంసీలు అధికంగా ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తి, బోర్డు నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. విశాఖపట్నంలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఏపీ విజ్ఞప్తి మేరకు అక్కడ కొన్ని భవనాలను పరిశీలించారు. ఈ అంశంపై కూడా భేటీలో చర్చ జరగనుంది.

అటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై సాయంత్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశం జరగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో రెండు బోర్డుల సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొంటారు. ఇదే అంశంపై గతంలో రెండు బోర్డులు ఉమ్మడిగా నిర్వహించిన సమన్వయ కమిటీ, బోర్డు సమావేశాలకు తెలంగాణ హాజరు కాలేదు. ఏపీ ప్రతినిధులు మాత్రమే హాజరై తమ అభిప్రాయాన్ని తెలిపారు. రెండో షెడ్యూల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణ విభాగం, అధికారులు, సిబ్బంది వివరాలను ఏపీ ఇప్పటికే బోర్డులకు అందించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories