ఆయన బ్రహ్మానందం కాదు కానీ కడుపుబ్బా నవ్వించేస్తున్నాడట. ఆయన మిస్టర్ బీన్ అంతకన్నా కాదు, టీఆర్‌ఎస్ మంత్రులను, నాయకులను చెక్కిలిగింతలు...
ఆయన బ్రహ్మానందం కాదు కానీ కడుపుబ్బా నవ్వించేస్తున్నాడట. ఆయన మిస్టర్ బీన్ అంతకన్నా కాదు, టీఆర్‌ఎస్ మంత్రులను, నాయకులను చెక్కిలిగింతలు పెట్టేస్తున్నాడట. జబర్దస్త్ కామెడీని మించిపోతున్నాయట ఆయన చేష్టలు. అలాగని ఆయనను జోకర్‌గా భావించి నవ్వుకోకండి. హీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఐపీఎస్. యస్. ఐపీఎస్. అందులోనూ కేరళ పోలీసు శాఖలో, కీలక పోస్టులో వున్న ఆఫీసర్. కేరళ ఐపీఎస్ అధికారి ఏంటి గులాబీ పార్టీ నేతలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించడమేంటని అవాక్కవుతున్నారా? ఇంతకీ టీఆర్ఎస్ నేతలను అంతగా నవ్విస్తున్న ఆయన వ్యవహారమేంటి? ఎందుకంత హాస్యంగా ఆయన చేష్టలను చూస్తున్నారట? లెట్స్ బిగిన్ ద ఖతర్నాక్ కామెడీ స్టోరి.
ఈయన గురించే, తెలంగాణ భవన్, ప్రగతి భవన్‌లో కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారట. ఐపీఎస్ అధికారి, అందులోనూ ఖమ్మం జిల్లాకు చెందిన ఆఫీసర్ గురించి ఇలా నవ్వుకోవడం సరైందికాదని చాలామంది అంటున్నా సదరు అధికారి చేస్తున్న చేష్టలు, చెప్పుకుంటున్న మాటలను చూస్తుంటే, నిజంగా నవ్వు ఆగడంలేదని టీఆర్ఎస్ నేతలంటున్నారట.
ఈయన పేరు జి. లక్ష్మణ్. ముందే చెప్పుకున్నట్టు కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి. కేరళలో ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, లక్ష్మణ్ గురించి, ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ది వీక్‌తో పాటు, కొన్ని మలయాళ వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయట. ఆ కథనాల ప్రకారం, త్వరలో లక్ష్మణ్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారట. ఇందులో విశేషం ఏముందిలే, వీఆర్ఎస్సో, లేదంటే పదవీకాలం అయిపోతుందేమో, అందుకే రిజైన్ చేస్తున్నారేమోని అనుకోవచ్చు. కానీ అసలు ట్విస్టు ఆయన రాజీనామా కాదు. ఆయన, రాజీనామా చేసి, ఏకంగా తెలంగాణ మంత్రివర్గంలోకి వస్తారట. అంటే తెలంగాణ మంత్రి అవుతారట. అదీ ట్విస్టు.
ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్ గతంలోనే రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ టకెట్ సైతం ఆశించారట. అయితే తాజాగా ఆయన తెలంగాణ కేబినెట్‌లోకి రాబోతున్నారన్న ఆన్‌మనోరమ మీడియా కథనం, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కేటీఆర్ నిర్వహిస్తున్న ఐటీ మంత్రి అవుతారట. మంత్రివర్గంలోకి చేరడానికి ముందే లక్ష్మణ్ టీఆర్ఎస్‌లో చేరతారని ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు తెలియజేశారని ఈ కథనం సారాంశమట.
లక్ష్మణ్ సమీప బంధువులు ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో సీఎం కేసీఆర్ కేరళలో పర్యటించినప్పుడు, దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. కేరళలో ఏఎస్పీగా తన కెరీర్ మొదలుపెట్టిన లక్ష్మణ్ కేరళ ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లోనూ వర్క్ చేశారు. బీఎస్ఈ ,ఎస్‌ఎమ్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గానూ చేశారు. ఇలా రకరకాల పాత్రలు చేస్తున్న లక్ష్మణ్, ఇప్పుడు తెలంగాణ ఐటీ మంత్రి అవుతారంటూ, వారపత్రికలు, వెబ్‌సైట్లలో పుంఖానుపుంఖాలుగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఎవరీ లక్ష్మణ్, కేసీఆర్ ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకుంటారు ఆయన అవసరం కేసీఆర్‌కు ఏమొచ్చిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఖండఖండాలుగా ఖండించాయి. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, పుకార్లేనని చెప్పాయి.
లక్ష్మణ్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలపై, మీడియా ప్రతినిధులు టీఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలను సంప్రదిస్తే, వాళ్లు ఫక్కున నవ్వేశారట. ఇతనేంటి, మంత్రి కావడమేంటని అన్నారట. ఇఫ్పటికే మంత్రివర్గం ఫుల్లుగా వుందని, చాలామంది సీనియర్లు, ఏళ్లతరబడి క్యూలో వున్నారని, వీరందర్నీ కాదని, ఇతనికి ఎందుకిస్తారని టీఆరఎస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఇఫ్పటికిప్పుడు కేటీఆర్ దగ్గరున్న ఐటీ శాఖను తీసి, ఈయనెందుకిస్తారని అంటున్నారట. అంతేకాదు, ఎమ్మెల్యే స్థానం ఏది ఖాళీ అవుతుందని, ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నారట. లక్ష్మణ్ గనుక మంత్రి అయితే, ఇక దారినపోయే దానయ్య కూడా మంత్రి కావచ్చని, ఇదొక పెద్ద జోక్‌లా వుందని కొట్టిపారేస్తున్నారట గులాబీ నేతలు.
లక్ష్మణ్‌కు పబ్లిసిటీ పిచ్చి అని, ఇతను కొన్ని వెబ‌్ సైట్లు, మ్యాగజైన్లతో కావాలనే రాయించుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇలా పబ్లిసిటీ చేయించుకుని, పార్టీలోకి వచ్చేవారంటే, కేసీఆర్‌కు అస్సలు నచ్చదని, వారిని కిలోమీటర్ దూరం పెడతారని అంటున్నారట గులాబీ నేతలు. కేబినెట్‌లోకి తీసుకోవడం పక్కనపెడితే, అస్సలు ఆయనను పార్టీలోకి తీసుకుంటారా లేదా అన్నది, ముందుగా లక్ష్మణ్ ఆలోచించాలని అంటున్నారట టీఆర్ఎస్ నేతలు. గొంతెమ్మ కోరికలతో, ఎవరికివారు కావాలనే పబ్లిసిటీ చేయించుకుని, కేసీఆర్ దృష్టిలో పడాలనుకుంటున్నారని, లక్ష్మణ్ కూడా అలాంటివారేనని కొట్టిపారేస్తున్నారు నేతలు.
మొత్తానికి కేరళ ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నిజంగా తెలంగాణ కేబినెట్‌లోకి రావాలనుకుంటున్నారో అందుకే ఇలాంటి లీకులిచ్చి, అందరి దృష్టిలో పడాలనుకుంటున్నారో ఇదీ లేదంటే కొన్ని వెబ్‌సైట్లు, మ్యాగజైన్లు కావాలనే ఆయనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయో కానీ, మొత్తానికి సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. ఏది నిజమో లక్ష్మణ్‌కే తెలియాలంటున్నారు టీఆర్‌ఎస్ నేతలు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire