దేశ రాజకీయాల్లో అరంగేట్రానికి రంగం సిద్ధం..!

KCR to Enter National Politics
x

దేశ రాజకీయాల్లో అరంగేట్రానికి రంగం సిద్ధం..!

Highlights

*పార్టీ జిల్లా అధ్యక్షులతో చెప్పించిన గులాబీ బాస్

KCR: జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నా. నిజామాబాద్‌ సభా వేదికగా నిర్ణయం తీసుకుంటున్నా. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఆ దిశగా కసరత్తును వేగవంతం చేశారు. కొత్త జాతీయ పార్టీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలో జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన గులాబీ బాస్... పార్టీ జిల్లా అధ్యక్షులందరితో చెప్పించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతోపాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమ్మేళనంగా కేసీఆర్‌ జాతీయ పార్టీ ఎజెండా ఉంటుందని అంచనా. రైతులు, దళితులు, సైనికులు, యువత తదితర వర్గాలకు పార్టీ ఎజెండాలో పెద్దపీట వేయనున్నారని సమాచారం.

దేశంలో మోడీ ఆధ్వర్యంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని.. అన్ని వర్గాల ప్రజలూ మార్పు కోరుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఈ తరుణంలో తెలంగాణ కోసం ఉద్యమించినట్టుగానే దేశంలో మార్పు కోసం.. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఉద్యమించాలని, జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు బాల్కసుమన్.

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలనేది చారిత్రక అవసరంతో పాటు.. దేశ ప్రజల కోరిక అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశం వెనక్కి పోకుండా ఉండాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్టాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి.

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలువురు బీజేపీయేతర, కాంగ్రెసేతర సీఎంలు, ముఖ్య నేతలతో కేసీఆర్‌ వరుసగా భేటీలు జరిపారు. తాజాగా కేసీఆర్‌ ఆహ్వానం మేరకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి హైదరాబాద్‌కు వస్తున్నారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసే జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీలు, దేశవ్యాప్తంగా పేరొందిన కొందరు ప్రముఖ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఆయా పార్టీల విలీనం, చేరికలకు సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయినట్టు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత.. కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దేశవ్యాప్త పర్యటనల ద్వారా కొత్త పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా కృషి చేయనున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories