ఫాంహౌస్ నుంచి ప్రజల్లోకి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కార్యక్రమానికి ప్లాన్ చేసిన కేసీఆర్..

ఫాంహౌస్ నుంచి ప్రజల్లోకి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కార్యక్రమానికి ప్లాన్ చేసిన కేసీఆర్..
x
Highlights

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడొస్తున్నారు..? ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో ప్రజా సమస్యలపై కేసీఅర్ గళం విప్పుతారా..?

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడొస్తున్నారు..? ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో ప్రజా సమస్యలపై కేసీఅర్ గళం విప్పుతారా..? ప్రభుత్వ వైఫల్యాలపై ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారా..? త్వరలో ఫాంహౌస్ నుంచి బయటకు రాబోతున్నారా..? తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నారా...? కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావటం లేదంటోన్న రాజకీయ ప్రత్యర్థులకు కేసీఆర్ తన మార్క్ రాజకీయాన్ని చూపించబోతున్నారా..? బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..?

గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మే 13న‌ జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 17స్థానాలకు గాను ఎనిమిది సీట్లను అధికార కాంగ్రెస్ ఎనిమిది సీట్లను బీజేపీ గెలుచుకోగా మరో స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. కొన్ని సీట్లలో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు.

ఈనేపధ్యంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనాల్లోకి రావటం లేదు. ఫాంహౌజ్‌కే కేసీఆర్ పరిమితమయ్యారు. ప్రధాన ప్రతిపక్షనేతగా ప్రజా సమస్యలపై మాట్లాడకపోవటంతో కేసీఆర్‌పై విమర్శలు వస్తున్నాయి. ప్రజలు అనేక విషయాల్లో ఇబ్బందులు పడుతున్నప్పటకీ కేసీఆర్ స్పందించడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల్లోకి రావాలని ప్రభుత్వనికి సలహాలు సూచనలు ఇవ్వాలని పదే పదే ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో పాటు రైతు రుణమాఫీపై నిరసనలు జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై రైతుల్లో ప్రజల్లో చర్చ జరుగుతోంది. హైడ్రా కూల్చివేతలు, మూసీ పునర్జీవానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వరదలొచ్చాయి. వరదలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడినా కేసీఆర్ కనీసం స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటన చేయకపోయినా కనీసం ప్రజలకు భరోసా ఇవ్వలేదని మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్7తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపధ్యంలో డిసెంబర్ వరకు రేవంత్ రెడ్డి సర్కార్‌కు సమయం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. డిసెంబర్‌లో కేసీఆర్ బయటకు రాకపోతే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అప్పటి వరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో కేసీఆర్ వాయిస్ ప్రజల్లోకి వెళ్తే అత్యధిక లోకల్ బాడీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందన్న చర్చ జరుగుతోంది.

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా‌ తన ఫాంహౌస్‌లో కేసీఆర్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారట. రైతులు, మహిళలు, నిరుద్యోగ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేసీఆర్ స్టడీ చేస్తున్నారట. ప్రజా సమస్య డిసెంబర్ తర్వాత గ్రౌండ్‌లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జరిగే అవకాశముంది. ఈలోగా ప్రజా సమస్యలపై గళం విప్పి.. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారట.‌

పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీల్లో రాష్ట్ర రాజకీయలపై చర్చిస్తున్నారట. ప్రజలు ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు.? ఉద్యోగ వర్గాలు ఏమనుకుంటున్నాయి..? నిరుద్యోగు యువత, విద్యారంగం సహా.. వివిధ అంశాలపై ఆరా తీస్తున్నారట. ఇదే సమయంలో బీఆర్ఎస్ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది.. పార్టీలో యాక్టీవ్‌గా పనిచేస్తున్న నేతల వివరాలను సైతం కేసీఆర్ తెలుసుకుంటున్నారట.

మరోవైపు రైతు రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ పునర్జీవంపై ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయంపై కేసీఆర్ స్టడీ చేస్తున్నారట. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కూడా పార్టీ నేతలతో కేసీఆర్​ చర్చిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఆరా తీస్తూనే నేతలకు తగిన సూచనలు ఇస్తున్నట్లు తెలిసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.‌ ప్రజల మూడ్‌ను బట్టి ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారట.

ఇదే సమయంలో పార్టీ బలోపేతంపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. నిజానికి 14ఏళ్ళు ఉద్యమ పార్టీ.. తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో అంతగా బలం లేదన్న చర్చ జరుగుతోంది. ఈనేపధ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ నిర్ణయించారట. ఈనేపధ్యంలో డీఎంకే లాంటి పార్టీల మాదిరి బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారట.

గ్రామస్థాయి మొదలుకొని మండల, నియోజకవర్గం, జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలు త్వరలోనే వేయనున్నట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేసిన తర్వాత క్యాడర్‌కు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారట. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ ప్రజల్లో ఉండేందుకు కేటీఆర్, హరీశ్‌లు పోటీ పడ్తున్నారని సొంత పార్టీలోనే చర్చ నడుస్తుంది.

బావ,బామర్దుల పోటీ వల్ల పార్టీ కనీసం ప్రజల్లో ఉంటోందన్న చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ సైతం బయటకు వస్తే బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహం వస్తుందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆలోచనలు ఎవరికి అంతు చిక్కవు... ఇలాంటి సమయంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి రానున్నారనేది ఆసక్తి రేపుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories