పాపం పాల్.. చివరకు 1000 ఓట్లు కూడా సాధించలేక..

KA Paul Reacts on Munugode Bypoll Results
x

పాపం పాల్.. చివరకు 1000 ఓట్లు కూడా సాధించలేక..

Highlights

KA Paul: మునుగోడు ఉప యుద్ధంలో ప్రపంచ శాంతి దూత కిలారి ఆనంద్ పాల్ ఉరఫ్ కేఏ పాల్ అందరినీ ఆకట్టుకున్నారు.

KA Paul: మునుగోడు ఉప యుద్ధంలో ప్రపంచ శాంతి దూత కిలారి ఆనంద్ పాల్ ఉరఫ్ కేఏ పాల్ అందరినీ ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ ఎన్నికలో నామినేషన్ల పర్వం నుంచే పాల్ తనదైన శైలిలో ప్రచారం చేశారు. ప్రజాశాంతి పార్టీ తరపున తన నామినేషన్ చెల్లలేదు. అయినా తగ్గేదే లే అంటూ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. రైతు వేషం వేశారు. గొర్రెల కాపరిగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పిల్లలతో ఆడిపాడారు. ఇలా రోజుకో వేషం కట్టారు పాల్. పనిలోపనిగా తెలంగాణకు కాబోయే సీఎం తానేనంటూ ప్రచారం చేశారు.

మునుగోడులో తనను గెలిపించేందుకు యువత నడుం బిగించిందంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. తనను గెలిపిస్తే మునుగోడును అమెరికాలా మారుస్తాననీ ప్రామీస్ చేశారు. ప్రధాన పార్టీల అవినీతి సొమ్మునంతా కక్కిస్తానన్నారు. పోలింగ్ రోజున కూడా 10 వేళ్లకు ఉంగరాలు ధరించి ఓటర్లను ఆకట్టుకున్నారు. పోలింగ్ కేంద్రంలో అటూ.. ఇటూ పరిగెత్తుతూ చూపరులు కడుపుబ్బ నవ్వుకునేలా చేశారు. బైపోల్ వార్‌లో 50వేలకు పైగా మెజారిటీతో తానే గెలుస్తానన్న ధీమా ప్రదర్శించారు. ఏకంగా విజయోత్సవ ర్యాలీ కోసం కూడా ఆయన ఈసీని కలిసినట్టు చెబుతున్నారు. కౌంటింగ్ షురూ అయ్యాక కూడా తన వ్యవహారశైలికి ఏ మాత్రం తగ్గకుండా కితకితలు పెట్టించారు.

చివరకు తనకు 1000 ఓట్లు కూడా రాకపోవడంతో పాల్ అసహనం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపుపై అనుమానం వెలిబుచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ పాల్ గగ్గోలు పెట్టారు. లక్షా 17 వేల మంది ఓటర్లు తన ఉంగరం గుర్తుకు ఓటు వేశారని చెప్పుకొచ్చారు. అసలు ఈవీఎంలతోపాటు మరో 200 ఖాళీ ఈవీఎంలను కలిపి భద్రపరచడంలో మతలబేంటి? అంటూ ఆయన ఎన్నికల అధికారులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికను రద్దు చేయాల్సిందేనని పాల్ డిమాండ్ చేస్తున్నారు. త్రిముఖ పోటీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో తానూ తక్కువేం కాదంటూ మూడు జోకులు.. ఆరు నవ్వులుగా పాల్ ప్రచారం సాగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories