Telangana: విద్యుత్ ఒప్పందాల విచారణ కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా... ఇది కేసీఆర్ తొలి విజయమా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయడంతో పాటు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కేంద్రాల నిర్మాణాల్లో అవకతవలు జరిగాయనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఛైర్మెన్ పదవికి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి జూలై 16న రాజీనామా చేశారు.
కొత్త చైర్మన్‌ను జూలై 22 లోగా నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలు సహజంగానే బీఆర్ఎస్ నాయకులకు ఊరట కలిగించాయి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ సాధించిన తొలి విజయమని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కేసీఆర్ మీద కాంగ్రెస్ దుష్ప్రచారానికి పూనుకుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని సుప్రీంకోర్టు తాజా తీర్పుతో స్పష్టమైందని చెప్పారు.
జస్టిస్ నరసింహారెడ్డి ఎందుకు తప్పుకున్నారు?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయడంతో పాటు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పరిడివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి దర్యాప్తు విషయమై మీడియాతో మాట్లాడడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.
మీడియా సమావేశంలో విచారణ కమిటీ చైర్మన్ కమిటీ ఏం చేస్తోందో చెప్పి ఊరుకుంటే సమస్య ఏమీ లేదని, కానీ, కేసులోని మెరిట్స్ గురించి మాట్లాడారని సుప్రీం కోర్టు అభ్యంతరం తెలిపింది. న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తి ఇలా చేయడమేమిటని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, కమిషన్‌కు వేరే చైర్మన్‌ను నియమించాలని కూడా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యల నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను సమర్పించిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.
అయితే, సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై జస్టిస్ నరసింహారెడ్డి ఒక న్యూస్ చానల్‌తో మాట్లాడారు. తమ కమిషన్ చేస్తున్నది ఓపెన్ ఎంక్వైరీ అని, ఏం జరుగుతోందో చెప్పకపోతే మీడియాలో ఊహాత్మక కథనాలు వస్తున్నాయని, అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అన్నారు.
అయితే, న్యాయవ్యవస్థ పట్ల గౌరవంతో తాను కమిషన్ చైర్మన్ పదవిలో కొనసాగదలచు కోలేదని నరసింహారెడ్డి అన్నారు.
విద్యుత్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు?
కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలతో పాటు, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ విషయమై అసెంబ్లీలో చర్చ సందర్భంగా జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేసి వాస్తవాలు బయటకు తెస్తామని సీఎం చెప్పారు. ఆ తరువాత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి చైర్మన్‌గా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
అసలు వివాదం ఏంటి?
జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి విద్యుత్ కమిషన్ ఎదుట విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు, టీజేఎస్ చీఫ్ కోదండరామ్ సహా పలువురు హాజరై తమ అభిప్రాయాలను చెప్పారు. ఈ విషయాలపై క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పిస్తామని విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని కమిషన్.. కేసీఆర్ కు జూన్ 19న లేఖ పంపింది. దాని మీద సమాధానం ఇవ్వడానికి వారం రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువు జూన్ 25తో ముగిసింది. దాంతో, కమిషన్ మరోసారి కేసీఆర్‌కు నోటీసు పంపించింది. అయితే, కేసీఆర్‌కు లేఖ పంపడానికి ముందే జూన్ 11న జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడారు.
చాలా రాష్ట్రాల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుతుంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందని, ఛత్తీస్ గడ్ ప్రభుత్వంతో ఒప్పందం మూలంగా నష్టం వస్తోందని అధికారులు చెప్పారనే అంశాలను జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో ప్రస్తావించారు.
కేసీఆర్ వాదన ఇదీ...
కమిషన్ చైర్మన్ మీడియా సమావేశంపై స్పందించిన కేసీఆర్, తాను విచారణకు రాకముందే ఆయన అలా మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ కమిషన్ చైర్మన్ తీరును తప్పుబట్టారు. విచారణ కమిషన్ ముందు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు.
విద్యుత్ కమిషన్ ఛైర్మెన్ గా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డికి కొనసాగే అర్హత లేదని కూడా కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు జూన్ 15న నరసింహారెడ్డికి ఆయన లేఖ రాశారు.
విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా, ఒప్పందాలు, వివాదాలు అన్నీ విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోకే వస్తాయన్న కేసీఆర్, అసలు జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఆ లేఖలో తెలిపారు.
తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ,.. సుప్రీం కోర్టులో గెలుపు
జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ రెండుసార్లు సమన్లు పంపినా కూడా కేసీఆర్ హాజరు కాలేదు. మరో వైపు ఈ కమిషన్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు జూలై 1న తీర్పు ప్రకటించింది. విద్యుత్ కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని చెబుతూ కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పే ఇందుకు నిదర్శనమని ఇప్పుడు ఆ పార్టీ అంటోంది. అయితే, సుప్రీం కోర్టు విచారణ కమిషన్ ఏర్పాటు గురించి ఏమీ వ్యాఖ్యానించలేదు. కమిషన్ చైర్మన్ తీరును మాత్రమే తప్పు పట్టింది. అంటే, కమిషన్ త్వరలో కొత్త చైర్మన్ నాయకత్వంలో విచారణ కొనసాగిస్తుంది. ఆ స్థానంలోకి రాబోయే వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire