Lover Shoots Girlfriend's Father: లవర్‌ని కలవకుండా చేశాడని అమ్మాయి తండ్రిని తుపాకీ తీసుకుని..

Lover Shoots Girlfriends Father: లవర్‌ని కలవకుండా చేశాడని అమ్మాయి తండ్రిని తుపాకీ తీసుకుని..
x
Highlights

Man Shoots his Girlfriend's Father in Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బల్విందర్ సింగ్ అనే 25 ఏళ్ల యువకుడు రేవంత్ ఆనంద్...

Man Shoots his Girlfriend's Father in Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బల్విందర్ సింగ్ అనే 25 ఏళ్ల యువకుడు రేవంత్ ఆనంద్ అనే వ్యక్తిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సరూర్ నగర్‌లోని వెంకటేశ్వర్ కాలనీలో రేవంత్ ఆనంద్ నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా వ్యాపారం చేసుకుంటున్న రేవంత్ ఆనంద్‌కు మాన్విత అనే 23 ఏళ్ల కూతురు ఉన్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్నేళ్లుగా బల్విందర్ సింగ్, మాన్విత ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ల ప్రేమ వ్యవహారం ఏ మాత్రం నచ్చని ఆమె తండ్రి రేవంత్, మరోసారి మీరిద్దరూ కలుసుకోకూడదని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఇద్దరూ కలుసుకుంటున్నారని, ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారని ఆయనకు తెలిసింది. దాంతో తన కూతురు మాన్వితను బల్విందర్ సింగ్‌కు దూరం పెట్టాలనే ఆలోచనతో ఆమెను అమెరికా పంపించారు.

ఆ తరువాత గత కొద్దిరోజులుగా బల్విందర్ సింగ్‌కు, మాన్వితకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆ యువతిని ఆమె తండ్రి రేవంత్ అమెరికా పంపించారని తెలుసుకున్న బల్విందర్ సింగ్ అదే కోపంలో ఆమె ఇంటికి చేరుకున్నారు. యువతి తండ్రిని ఇంట్లోంచి బయటికి పిలిచి ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాన్వితను అమెరికా ఎందుకు పంపించారంటూ ఆమె తండ్రితో గొడవపడినట్లు తెలుస్తోంది. తన కూతురు తన ఇష్టం. ఆమెను ఎక్కడికైనా పంపించే హక్కు తనకు ఉందని ఆమె తండ్రి సమాధానం చెప్పారు. ఆ క్రమంలోనే గొడవ పెద్దదయింది. ఆవేశంలో బల్విందర్ సింగ్ తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్ బయటికి తీసి ఒక రౌండ్ కాల్పులు జరిపారు.

బల్విందర్ సింగ్ జరిపిన ఈ కాల్పుల్లో రేవంత్ కంటికి బుల్లెట్ తగిలి గాయమైంది. కాల్పుల ఘటన గురించి సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. బల్విందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేవంత్ పై కాల్పులు జరిపిన ఘటనలో బల్విందర్ సింగ్ పై హత్యాయత్నం కేసుతో పాటు మారణాయుధాలు కలిగి ఉన్నారన్న సెక్షన్ల కింద, అలాగే యువతి కుటుంబాన్ని వేధిస్తున్నందుకు ఈవ్ టీజింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories