తెలంగాణా విమోచన కోసం కదం తొక్కినా నల్లగొండ వీరులు !

తెలంగాణా విమోచన కోసం కదం తొక్కినా నల్లగొండ వీరులు !
x
Highlights

భూమి కోసం భుక్తి కోసం బానిస సంకెళ్ల కోసం విముక్తి కోసం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గ్రామ‌గ్రామాన సాగింది. రజాకార్ల అరాచకాలతో...

భూమి కోసం భుక్తి కోసం బానిస సంకెళ్ల కోసం విముక్తి కోసం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గ్రామ‌గ్రామాన సాగింది. రజాకార్ల అరాచకాలతో చితికిపోయిన తెలంగాణా ఎందరో వీరుల పోరాటాలతో ఆ బానిస సంకెళ్లు తెంచుకుని ముందడుగు వేసింది. సెప్టెంబరు17 సందర్భంగా అలనాటి నల్లగొండ జిల్లా అమరవీరుల త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి పదహారు బండ్లు కట్టి ఓ బండ్లో వస్తవ్ కొడుకో నైజాం సర్కారోడా అంటూ నిజాం నవాబులను తరిమి కొట్టిన పోరాట యోదులను కన్న పురిటిగడ్డ నల్గొండ జిల్లా. బాంచన్ నీ కాళ్లు మొక్కుతా నీ గులాములం అనే మాటలకు కాలంచెల్లి బద్మాష్ నీ జులుమేందిరా అంటూ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఉద్యమాల గడ్డ నల్గొండ. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్జింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, చింతలపూడి రాంచంద్రారెడ్డి, వేమరవరపు మనోహర్ ఇలా ఎందరో మహానీయులంతా నిజాం నిరంకుశ పీడిత, తాడిత వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగించి చివరకు రజాకారుల తూటాలకు బలై తెలంగాణా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచపోయారు.

ఆనాటి రజాకారుల ఆకృత్యాలు, అరాచకాలను చూసి తట్టుకోలేక నల్గొండ జిల్లా అట్టుడికింది. బెదిరించి వసూళ్లు చేయడం, దోపిడీలకు పాల్పడడం, మహిళలపై అత్యాచారాల వంటి కిరాతకాలకు పాల్పడ్డారు అప్పటి రజాకార్లు. ఆ సమయంలోనే మొదటిసారిగా తెలంగాణా ఉద్యమకారుడు దొడ్డి కొమురయ్య రజాకార్ల ఆగడాలపై తిరగబడ్డాడు. దీంతో దొడ్డి కొమురయ్యను రజాకార్లు కాల్చి చంపేశారు. దీంతో తెలంగాణా సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా దొడ్డి కొమురయ్య చరిత్రకెక్కాడు. దొడ్డి కొమురయ్య మరణించాక భూస్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడేందుకు రావినారాయణరెడ్డి నేతృత్వంలో తెలంగాణ సాయుధ పోరాటానికి బీజం‌పడింది. కడవెండి నుంచి మొదలైన ఉద్యమం రాజాపేట, కొలనుపాక, పోచంపల్లి, బొల్లేపల్లి, సుద్దాల, తుంగతుర్తి, రామన్నపేట, సంస్థాన్ నారాయణ పురం, పుట్టపాక, బేతవోలు, వెల్దండ, మల్లారెడ్డి గూడెం ఇలా గ్రామాలకు గ్రామాలే ఉద్యమ బావుటాను ఎగురవేసాయి.

తెలంగాణా సాయుధ పోరాటమనగానే ముందుగా చిట్యాల మండంలం గుండ్రాంపల్లి గ్రామం గురించే చెప్పుకోవాలి. రజాకార్లను తరిమికొట్టిన గ్రామంగా గుండ్రాంపల్లికి ఎంతో ఘనచరిత్ర ఉంది. అప్పట్లో రజాకారుల నేత మక్బూల్ ఈ కోటలోనే తిష్టవేశాడు. గ్రామస్తులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. పన్నులు కట్టని వారి ఇళ్లపై తన సైన్యంతో దౌర్జన్యాలకు దిగేవాడు. ఎదిరించిన ఉద్యమకారులను తన సైన్యంతో వెంటాడి,వేటాడి మరీ చంపించాడు మక్బూల్. అయినా ఇక్కడి ఉద్యమకారులు అదరలేదు,బెదరలేదు. ఎదురు దాడికి దిగారు.

ఎలాగైనా రజాకార్ల నేత సయ్యద్ మక్బూల్ మట్టుబెట్టేందుకు వ్యూహం పన్నారు. అప్పటికే కమ్యూనిస్టు దళాలు రంగంలోకి దిగాయి. మొదటగా మక్బూల్ ఇంటిపై కమ్యూనిస్టు దళాలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో మక్బూల్ భార్య మరణించింది. దీంతో ప్రతీకారంగా మక్బూల్ తన సైన్యంతో పరిసర ప్రాంతాల్లోని వేలాదిమంది తెలంగాణా ప్రజలను పొట్టనపెట్టుకున్నాడు. ఆ శవాలను గుండ్రాంపల్లిలోని ఈ కోటలోని బావిలో పూడ్చివేశారని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. కొందరినైతే సజీవసమాధి చేశారని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. తమపై చేసిన రజాకారుల అరాచకాలను చెప్పుకుంటూ ఇప్పటికీ కొందరు కన్నీటి పర్యంతమవుతున్నారు.

తెలంగాణా సాయుధ పోరాటంలో నిజాం నవాబుల దుశ్చర్య,దురాగాతాలకు ఎదురొడ్డి పోరాడి వీర మరణం పొందిన ఎందరో మహానీయులు నల్గొండ జిల్లాకు చెందిన వారే. ఉవ్వెత్తున సాగుతున్న నాటి ఉద్యమానికి ఉద్యమకారులే కాదు కళాకారులు ప్రత్యేక పాత్ర పోషించారు. సుద్దాల హనుమంతు లాంటి వాళ్లు తమ పాటలు, బుర్రకథలతో ప్రజల్ని చైతన్య వంతులను చేయడంతో పాటు ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. గజ్జె కట్టి డప్పు,దరువులతో పల్లె పల్లెనా పాటతో పలకరించారు. నిజాం పాలనను ప్రశ్నిస్తూ కళాకారులు పాడిన పాటలు ఎంతో మందిని ఉద్యమ బాటపట్టించాయి. భూమి‌కోసం‌‌ భుక్తి కోసం బానిస సంకేళ్ల విముక్తి కోసం నాడు చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాటం యావత్ ప్రపంచ దృష్టి ని ఆకర్షించి చరిత్రలో నిలిచింది. సాయుధ పోరాటంలో ప్రాణాలు ఆర్పించిత వారి జ్ణాపకాలు పదిలంగానే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories