సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలు ప్రపంచ చరిత్రలో చెక్కుచెదరలేదు. అలాంటి ఉద్యమాలలో మరిచిపోలేని మహోత్తర పోరాట...
సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలు ప్రపంచ చరిత్రలో చెక్కుచెదరలేదు. అలాంటి ఉద్యమాలలో మరిచిపోలేని మహోత్తర పోరాట ఘట్టం తెలంగాణ సాయుధ పోరాటం. వెట్టిచాకిరికి, భూస్వామ్య పెత్తందార్లకు వ్యతిరేకంగా పౌర హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సామాన్యులను సాయుధ యోధులుగా మార్చి బరిలో నిలిపిన సాయుధ సమరం. నిజాం సంస్థానం నుంచి విముక్తిని పొందేందుకు జరిగిన పోరాటంలో అమరులైన పోరాట వీరులను స్మరించుకుంటూ నాటి పోరాటంలో ఖమ్మం జిల్లావాసుల పాత్రను గుర్తుచేసుకుందాం.
ఖమ్మం జిల్లా చైతన్యపు ఖిల్లా అని ఇప్పటికీ నానుడి. ఇంతటి చైతన్యం రావడానికి నాటి తెలంగాణా సాయుధ పోరాటమే కారణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలుస్తూనే ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించింది. ఆతర్వాత జరిగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదింది. ఇప్పటికీ ఆ సాయుధ పోరాట ఆనవాళ్లు ఆ జ్ఞాపకాలు ఖమ్మం జిల్లా ప్రజల మదిలో మెదలాడుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆంధ్రాకు సరిహద్దున ఉండడం, విశాలమైన అటవీ ప్రాంతం ఉండడంతో సాయుధ పోరాటానికి సానుకూలంగా మారింది. నాటి పోరాటానికి నేతృత్వం వహించిన చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వారు జిల్లాలో ప్రవేశించి ప్రజలను చైతన్యవంతం చేసేవారు. సాయుధులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా దాడులు ఇతరత్రా పోరాట మెలకువలను నేర్పేవారు.
భూస్వాములపైన, జాగీర్దార్లపైన, పోలీస్‌స్టేషన్లపైన పెద్దఎత్తున దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాలోని మధిర, ఖమ్మం తాలుకా పరిధిలో ప్రతి గ్రామం ఏదో ఒక సమయంలో సాయుధ సమరంలో పాల్గొన్నదే. అనేక మంది ఈ పోరాటంలో నేలకొరిగారు. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. దోపిడీకి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడిన వీరి చరిత్ర గురించి పలు గ్రామాల్లో కథలు, కథలుగా చెప్పుకుంటారు. మీనవోలు, అల్లీనగరం, బ్రహ్మణపల్లి, గోవిందాపురం, గోకినపల్లి, గువ్వలగూడెం, తనికెళ్ల, మడుపల్లి, రాపల్లి, ఎం.వెంకటాయ పాలెం, కాచిరాజుగూడెం, హేమచంద్రాపురం, పిండిప్రోలు, బయ్యారం, పొద్దుటూరు, వందనం, కుర్నవల్లి, గార్ల, గ్రామాలతో పాటు ఇల్లందు, బూర్గంపాడు తాలూకాల్లో పలు గ్రామాల్లో ఉద్యమ కేంద్రాలుగా ఉండేవి. నాటి ఉద్యమ నేతలు ఈ గ్రామాల్లోనే బస చేసేవారు. ఆందోళనకు రూపకల్పన ఈ గ్రామాల కూడళ్లలోనే జరిగేది.
పాల్వంచ, బూర్గంపాడు దండకారణ్యంలో జరిగిన ఉద్యమాలకు గిరిజనులు అండగా నిలిచారు. సోయం గంగులు, కుర్సం జోగయ్య, పర్సా రాములు, తదితర గిరిజన నేతలు దళ కమాండర్లుగా పనిచేశారు. అప్పటి మధిర తాలూకా ఇప్పటి బోనకల్ మండలంలోని గోవిందాపురంలో జరిగిన ఓ ఘటన ఎప్పటికీ ప్రజలు మరచిపోయేది కాదు. ఇక్కడ వేర్వేరు ప్రాంతాల నుంచి ఏడుగురిని పట్టుకొచ్చి కాల్చి చంపి ఒకే చితిపై వేసి నిప్పంటించారు. అమరవీరుల పేరుతో ఇప్పటికీ అక్కడ ప్రతి ఏటా స్మారక సభలు నిర్వహిస్తూ ఆ అమరవీరులను స్మరించుకుంటారు.
వండుకున్నది సైతం నిర్భయంగా తినే పరిస్థితి లేదు. ఈ దశలో సాయుధ పోరాట పిలుపు రావడంతో ప్రజలు పోరాటంలో పాలుపంచుకున్నారు. తాడు, ఒడిసేలు, కర్రి గొడ్డలి మొదలైన పనిముట్లు ప్రజలకు ఆయుధాలయ్యాయి. పలు కేంద్రాల్లో సాయుధ శిక్షణ మొదలైంది. సాంస్కృతీక, కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. ఆ సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎంతో మంది నాయకులు ఆస్తిపాస్తులను లెక్కచేయకుండా నిజాంనవాబును ఎదిరించారు. నల్లమల గిరిప్రసాద్, దేవూరి శేషగిరిరావు, విఠల్ రావు, సర్వదేవభట్ల రామనాథం, చిర్రావూరి లక్ష్మినరసయ్య, మంచికంటి రామకిషన్‌రావు, రజబ్ అలీ, రావెళ్ల జానకి రామయ్య, పారుపల్లి పుల్లయ్య వంటి నాయకులు సాయుధ పోరాటానికి నేతృత్వం వహించారు. నాటి సాయుధ పోరాట వారసత్వం నేటికీ ఖమ్మం జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ గ్రామాల్లో నాటి సాయుధ పోరాట అనుభవాలను చెబుతూ యువతను కార్యోన్ముఖులను చేస్తూ నాటి పెద్దలు పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire