కోదండరాంపై గులాబీ సీరియస్ ప్లాన్?

కోదండరాంపై గులాబీ సీరియస్ ప్లాన్?
x
Highlights

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీఆర్ఎస్ పోటీ చేస్తుందా ఎందుకు ఆసక్తి చూపడం లేదు అది మొన్నటి చర్చ. పోటీ చేస్తుంది, యుద్ధభేరి...

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీఆర్ఎస్ పోటీ చేస్తుందా ఎందుకు ఆసక్తి చూపడం లేదు అది మొన్నటి చర్చ. పోటీ చేస్తుంది, యుద్ధభేరి మోగిస్తుంది. ఇది నేటి మాట. పట్టభద్రుల పోరుపై గులాబీదళం వ్యూహం మార్చిందా మార్చాల్సి వచ్చిందా..? కేటీఆర్ మొదలు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలంతా, ఈ గ్రాడ్యుయేట్‌ వార్‌పై, ఎందుకంత కాన్‌సన్‌ట్రేషన్ చేస్తున్నారు? ఎన్నో ఎన్నికలు సునాయాసంగా గెలుస్తూ వస్తున్న గులాబీదళానికి, ఈ ఎలక్షన్స్ ఎందుకంత ప్రతిష్టాత్మకంగా మారాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరి.

తెలంగాణలో మరో ఎన్నికల యుద్ధానికి రంగం సిద్దమవుతోంది. ఈసారి పెద్దల సభ సమరం జరగబోతోంది. మండలి ఎన్నిక ఎందుకింత రసవత్తరంగా మారిందంటే, ఈసారి పట్టభద్రుల తరపున ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగుతారన్న ప్రచారమే అందుకు కారణం. వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా కోదండరాంను ప్రతిపక్షాలన్నీ బలపరిచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మొన్నటి వరకు అసలు పట్టభద్రుల నియోజకవర్గంలో అసలు టీఆర్ఎస్ పోటీ చేస్తుందా అన్న చర్చకు తెరదించుతూ, గులాబీ దళం వార్‌కు సై అంటోంది. కోదండరాం బరిలోకి దిగుతున్నారు కాబట్టి, కచ్చితంగా కంటెస్ట్ చెయ్యాలని వ్యూహం మార్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్లను రంగంలోకి దింపింది అధిష్టానం. స్వయంగా మినిస్టర్ కేటీఆర్, ఎన్నికల వ్యూహంపై ఎప్పటికప్పుడు నేతలతో చర్చిస్తూ, దిశానిర్దేశం చేస్తున్నారు. మరోసారి ఎన్నికల్లో సత్తా చాటి, టీఆర్ఎస్‌కు తిరుగులేదని నిరూపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. దీంతో ఎమ్మెల్సీ యుద్ధం రసవత్తరంగా మారింది.

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ పట్టభద్ర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పదవీ కాలం 2021 మార్చితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఓటర్ల నమోదు షెడ్యూలును ప్రకటించనుంది. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేతృత్వంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ శాసనసభాపక్ష, ఎంపీల, మంత్రిమండలి సమావేశాల్లోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్టు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీనికి అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్ట్రాటజీకి పదునుపెడుతున్నారట. మొత్తం ఉమ్మడి ఆరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇటీవల సమావేశాలు నిర్వహించారు. రెండు నియోజకవర్గాలలో పెద్దఎత్తున పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని నిర్ణయించారు. మండలాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించాలని కేటీఆర్‌ సూచించారు. దీనికి అనుగుణంగా ఆరు జిల్లాల్లో మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండలస్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మొన్నటి వరకు ఆసక్తి చూపని గులాబీ పార్టీ, సడెన్‌గా సీరియస్‌ యాక్షన్‌కు దిగడానికి, కారణం బరిలో ప్రొఫెసర్ కోదండరాం దిగుతారన్న ప్రచారమేనని చర్చ జరుగుతోంది. ప్రొఫెసర్‌గా కోదండరాంకు గ్రాడ్యుయేట్లలో మంచి పేరుండటం, అన్నింటికి మించి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం, ఆయనకు కలిసొచ్చే అంశాలంటున్నారు. అంతేకాదు, మొన్నటి ఎన్నికల్లో కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి, అన్ని స్థానాల్లో ఓడిపోయిందన్న సానుభూతి వుంది. ఉద్యోగాలు భర్తీ చెయ్యడం లేదని, నిరుద్యోగులు తీవ్ర అసహనంతో వున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ప్రతిఫలిస్తుందన్న మాటలూ వినపడ్తున్నాయి. దీంతో కోదండరాం గట్టి పోటీ ఇచ్చే చాన్సుంది. ఒకవేళ కోదండరాం గెలిస్తే, ఏకు మేకవుతారని, చట్టసభల్లో కొరకురాని కొయ్యగా మారతారని, గులాబీదళం లెక్కలేస్తోంది. అందుకే ప్రతిపక్షాలు బలహీనంగా వున్న ప్రస్తుత తరుణంలోనే, మరింత గట్టిగా వాటిని అణచివెయ్యాలని, చట్టసభల్లోకి కోదండరాంను ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టనివ్వరాదని కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏకంగా కేటీఆర్ నేతృత్వంలో వ్యూహప్రతివ్యూహాలు పదునెక్కుతున్నాయి.

మొత్తానికి తెలంగాణలో తన పట్టును నిరూపించుకునే మరో అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోంది టిఆర్ఎస్. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికలు కావడంతో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని, తద్వారా అటు కోదండరామ్ కు, బిజెపికి ఏక కాలంలో చెక్ పెట్టవచ్చని టిఆర్ఎస్ వ్యూహంగా అర్థమవుతోంది. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎన్నడూలేనంత ఉత్కంఠను కలిగిస్తున్నాయి. చూడాలి, ఏమవుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories