GHMC Into 4 Parts: నాలుగు ముక్కలుగా జీహెచ్ఎంసీ: కాంగ్రెస్ పట్టుకోసమేనా?
GHMC లో 1.5 కోట్ల జనాభా ఉంది. వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీని నాలుగు జోన్లుగా విభజించి ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనియాంశమయ్యాయి.
GHMC Into 4 Parts: జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజిస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీకి నలుగురు మేయర్లు, కమిషనర్లు ఉంటారని ఆయన చెప్పారు. మంత్రి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీశాయి. రాజకీయంగా జీహెచ్ఎంసీపై పట్టు సాధించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదన తెచ్చిందా అనే చర్చ కూడా ఉంది. అయితే ఈ చర్చలో వాస్తవం లేదని అధికార పక్షం కొట్టిపారేస్తోంది.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏం చెప్పారంటే?
అసోచామ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024 హైద్రాబాద్‌లో అక్టోబర్ 4న జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో 1.5 కోట్ల జనాభా ఉంది. వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీని నాలుగు జోన్లుగా విభజించి ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. హైద్రాబాద్ అభివృద్దికి తమ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా ఎందుకు విభజన
జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లలో 1.50 కోట్ల జనాభా ఉంది. శివారులోని ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో 60 లక్షల జనాభా ఉంటుందని అంచనా. వీటిని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే జనాభా రెండు కోట్లు దాటుతుంది.
ఓఆర్ఆర్ వెలుపల ఉన్న మరో 10 పంచాయితీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఔటర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరిస్తే హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌లో కొన్ని ప్రాంతాలు హెచ్ఎండీఏ కింద ఉన్నాయి. దీంతో హెచ్ఎండీఏ జోన్ల సంఖ్య కూడా రెండింతలు పెరుగుతాయి.
వీటన్నింటిని కలిపి గ్రేటర్ సిటీ కార్పోరేషన్‌గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. జీహెచ్ఎంసీని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం పేరుతో నాలుగు కార్పోరేషన్లుగా చేయాలా లేదా రెండు కార్పోరేషన్లు చేయాలనే చర్చ కూడా సాగింది. అయితే నాలుగు కార్పోరేషన్లుగా విభజించాలనే ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారని సమాచారం.
జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజించి సమంగా నిధులను కేటాయించాలని భావిస్తున్నారు. నగర శివార్లలోని రోడ్లు, డ్రైనేజీల కోసం భారీగా నిధులను ఖర్చు చేయనున్నారు.
విలీనమయ్యే స్థానిక సంస్థలు ఇవే
హైద్రాబాద్ శివారులోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్ పేట్, మీర్‌పేట్ కార్పోరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, పోచంపల్లి, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, పెద్ద అంబర్‌పేట, మేడ్చల్, సంగారెడ్డి, చేర్యాల, తూప్రాన్, నర్సాపూర్, శంకర్‌పల్లి, తుక్కుగూడ, గుండ్ల పోచంపల్లి, కొత్తూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. వీటిని విలీనం చేసిన తర్వాత అన్ని కార్పోరేషన్లలోని ఒకే సంఖ్యలో జనాభా ఉండేలా డివిజన్లను పునర్విభజిస్తారు.
ముంబై, దిల్లీలో ఎలా ఉంది?
దేశంలోని ప్రధాన నగరాల్లో ముంబై, దిల్లీలో నగరాల్లో ఒకే కార్పోరేషన్లు ఉన్నాయి. ప్రజల సౌకర్యం కోసం జోన్ల పరిధిలోనే అధికారులు అనుమతులు జారీ చేస్తారు. ముఖ్యమైన అనుమతులను మున్సిపల్ కమిషనర్ ఇస్తారు. ప్రతీ చిన్న విషయానికి కమిషనర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు ఉండదు. ఇదే తరహాలోనే పరిపాలన సౌలభ్యం కోసం జోనల్ కమిషనర్లకు అధికారాలను అప్పగించాలని స్వచ్చంధ సంస్థలు కోరుతున్నాయి. ఈ దిశగా ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ అధ్యక్షులు ఎం. పద్మనాభరెడ్డి చెప్పారు.
హైద్రాబాద్‌పై పట్టు కోసమా?
జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజించడంలో రాజకీయంగా పట్టు సాధించడం కోసం ప్రతిపాదించారా అనే చర్చ కూడా ఉంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజించి పట్టు సాధించాలనేది కాంగ్రెస్ సర్కార్ వ్యూహమేనని విపక్షాలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. హైద్రాబాద్‌లో ఫోర్త్ సిటీని అభివృద్ది చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. హైద్రాబాద్ డెవలప్‌మెంట్ కోసం రూ. 10 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. భవిష్యత్తు అవసరాల కోసం జీహెచ్ఎంసీని నాలుగు భాగాలు చేయాలని ప్రతిపాదిస్తున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
హైద్రాబాద్ మున్సిపల్ చరిత్ర ఏంటి?
1869లో అప్పటి నిజాం ప్రభుత్వం మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకు వచ్చింది. హైద్రాబాద్, ఛాదర్ ఘాట్ రెండు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. హైద్రాబాద్‌లో 4, చాదర్ ఘాట్‌లో ఐదు డివిజన్లు ఉండేవి. 1886లో ఛాదర్ ఘాట్ మున్సిపాలిటీ కార్పోరేషన్‌గా మారింది. అప్పట్లో 3.5 లక్ష జనాభా ఉంది. దీని విస్తీర్ణం 55 చదరపు కిలోమీటర్లు.
1921 నాటికి ఇదే హైద్రాబాద్ 84 చదరపు కి.మీ విస్తరించింది. 1933లో చాదర్ ఘాట్ కార్పోరేషన్‌ను హైద్రాబాద్‌లో కలిపి హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ని ఏర్పాటు చేశారు. 1945 లో సికింద్రాబాద్ మున్సిపాలిటీకి 1950లో సికింద్రాబాద్‌కు కార్పోరేషన్ హోదా కల్పించారు. 1951 నుంచి 1954 వరకు హైదరాబాద్ కార్పోరేషన్‌కు మాడపాటి హనుమంత రావు తొలి మేయర్‌గా పనిచేశారు. 1955లో హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చట్టం ద్వారా హైద్రాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపి మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైద్రాబాద్‌గా మార్చారు. 1956లో ఎంసీహెచ్ పరిధిలో నాలుగు జోన్లు, 7 సర్కిళ్లు ఉండేవి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2004లో బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో శివార్లలోని మున్సిపాలిటీలను ఎంసీహెచ్‌లలో విలీనం చేసి గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అంటే జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలోని ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, ఉప్పల్, మల్కాజిగిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు మున్సిపాలిటీలను ఎంసీహెచ్‌లో విలీనం చేశారు. వీటితో పాటు శంషాబాద్, సాతమరాయ్, జల్‌పల్లి, మామిడిపల్లి, మంఖల్, అల్మాస్‌గూడ, శారదానగర్, రావిరాల గ్రామ పంచాయితీలు కూడా ఎంసీహెచ్‌లో భాగమయ్యాయి. 2005 లో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే అప్పట్లో న్యాయపరమైన ఇబ్బందులు వచ్చాయి. ఈ సమస్యలను పరిష్కరించింది వైఎస్ఆర్ సర్కార్. లీగల్ సమస్యలు పరిష్కరించిన తర్వాత 2007 ఏప్రిల్ 16న జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ అయింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2026లో జరుగుతాయి. అయితే ఆ లోపుగా కార్పోరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలి. జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజించేందుకు డ్రాఫ్ట్ తయారు చేయాలి. అసెంబ్లీలో ఆమోదం పొందాలి. ఇదంతా జరగడానికి సమయం పడుతుంది. ఎన్నికలలోపుగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే దీనికి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండాలి. అలా జరిగినప్పుడే నిర్ణీత సమయంలోపుగా ప్రక్రియ సజావుగా పూర్తి అవుతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire