Is Raja Singh jealous of Bandi Sanjay: బండితో రాజాసింగ్ లడాయికి బ్యాగ్రౌండ్ కథేంటి?
Is Raja Singh jealous of Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో అసలే ఆయన ఫైర్‌బ్రాండ్. ఫైర్ విల్ బి ఫైర్ అనే లీడర్. అధికారపక్షంపైనే కాదు, స్వపక్షంపైనా...
Is Raja Singh jealous of Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో అసలే ఆయన ఫైర్‌బ్రాండ్. ఫైర్ విల్ బి ఫైర్ అనే లీడర్. అధికారపక్షంపైనే కాదు, స్వపక్షంపైనా ఈటెల్లాంటి మాటలు విసిరి రచ్చరచ్చ చేస్తారు. కాంట్రావర్సీ కామెంట్లతో కల్లోలం రేపేస్తారాయన. ఇప్పుడు ఏకంగా కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టిన, నాయకుడిపైనా చెలరేగిపోయారు. ఎవరు మారినా పార్టీలో పద్దతులు మారవా గ్రూపు పాలిటిక్స్ మారవా అంటూ, నిప్పులు కురిపించారు. ఇంతకీ ఆయన ఫైర్‌కు నిప్పెక్కడ రాజుకుంది? ఆయనను పార్టీ ఎందుకు పక్కనపెడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయనెవరు?
ఆయనే తెలంగాణ బిజేపి ఫైర్ బ్రాండ్ రాజాసింగ్. ఎమ్మెల్యే రాజాసింగ్. సొంత పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారాయన. రాష్ట్ర కమిటిలో తన వారికి అన్యాయం జరిగిందటూ అధ్యక్షుడు బండి సంజయ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో ఎవ్వరు వచ్చినా పార్టీ తీరు మారడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పగ్గాలు మారినా, కాషాయపార్టీలో పద్దతులు మారడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం మంచివికావంటూ కామెంట్ చేశారు. రాష్ట్ర పార్టీ ప్రకటించిన కొత్త కమిటిలో మరోసారి తన నియోజికవర్గం నేతలకు ప్రాధాన్యం కల్పించకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు రాజాసింగ్. కొత్త కమిటి ప్రకటించగానే, కాషాయ పార్టీ రాష్ట్ర అధినేతకు తన మనసులోని మాటను, వాట్సాప్ మెసేజ్ రూపంలో పంపించిన రాజాసింగ్, మీ తీరు మార్చుకోవాలంటూ సూచించారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు, బీజేపీలో తీవ్ర చర్చనీయాంశమైందట.
గతంలో లక్ష్మణ్ కమిటీ ప్రకటించిన సమయంలోనూ, రాజాసింగ్ ఇలాగే ఫైర్ అయ్యారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని నేరుగా విమర్శించారు. దీంతో లక్ష్మణ్ సైతం రగిలిపోయారట. అప్పుడు జాతీయ నేతలు కల్పించుకొని వివాదాన్ని సర్దుబాటు చేశారు. అయితే, కొత్తగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌పై రాజాసింగ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తనలాగే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వున్న నేత కాబట్టి, తనకు, తన వర్గానికి పార్టీలో పెద్దపీట వేస్తారని ఊహించారు. కానీ రాజాసింగ్ అంచనా తలకిందులైంది. సొంత నియోజకవర్గం గోషామహల్‌లోని రాజాసింగ్ అనుచరులకు, బీజేపీ కమిటీలో, ఏ ఒక్కరికీ ప్లేస్ కల్పించలేదట. దీంతో ఒంటికాలిపై లేచారాయన. బీజేపీ జెండాపై తనను రెండుసార్లు గెలిపించిన గోషామహల్‌లో, తన కార్యకర్తల్లో ఒక్కరికీ చాన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. సంజయ్ రాష్ట్ర పగ్గాలు తీసుకున్నా, ఎలాంటి మార్పూ రాలేదంటూ అసహనం వ్యక్తం చేశారట. అయితే, రాజాసింగ్ వర్గానికి కమిటీలో చోటు కల్పించకపోవడం వెనక చాలా కథ వుంది.
మొన్నటి వరకు పాతబస్తీలో తనకు ఎదురులే లేకుండా చెలరేగిపోయారు రాజాసింగ్. ఎవరు అడ్డొచ్చినా తొక్కేసుకుంటూ పైకి ఎదిగారన్న మాటలు వినపడతాయి. సొంత పార్టీలోనూ, ఆరెస్సెస్‌లోనూ గోషామహల్‌లో ఎవ్వరు వాయిస్ రైజ్ చేసినా, వెంటనే వారిని సైడ్ చేసేవారట రాజాసింగ్. అలా తనకు తిరుగులేకుండా చేసుకున్నారట. కానీ సమయం, అవకాశం కోసం చాలామంది బీజేపీ నేతలు వెయిట్ చేశారట. ఇప్పుడు ఆ టైం వచ్చేసిందంటున్నారు ఆ నేతలు. అందుకు రాష్ట్ర కమిటీలో ఆయన వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ చోటు కల్పించకపోవడం ఒక నిదర్శనమైతే, ఆయన వ్యతిరేక వర్గానికి పెద్దపీట వెయ్యడం, రాజాసింగ్ కాళ్లకింద నేల కదులుతోందనడానికి మరో నిదర్శనం. స్టేట్ బీజేపీలోనే కాదు, హైదరాబాద్ బీజేపీలోనూ రాజాసింగ్‌కు ఎవ్వరితోనూ సత్సంబంధాల్లేవు. ఎవర్ని లెక్కచేయని రాజాసింగ్‌ను సైతం, అగ్ర నేతలు చూసిచూడనట్టు వదిలేశారట. అయితే, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలెట్టారట. పార్టీలో వున్న కొందరు సీనియర్లు, సంఘ్ పరివార్ కీలక నేతలు చక్రం తిప్పుతున్నారట.
పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అతి కీలకంగా ఉన్న నేతతో పాటు, ఆర్ఎస్‌ఎస్‌లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న, శ్యాంజీ, రాజాసింగ్‌కు వ్యతిరేకంగా పాచికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరెస్సెస్ మాజీ నేత ఆలే నరేంద్ర కుటుంబం, పాతబస్తీలో బలపడుతోంది. ఇఫ్పుడు దక్షిణ భారతదేశం ఆరెస్సెస్‌లో ఆయన సోదరుడు ఆలే శ్యాంజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన కుమారుడు ఆలే జితేందర్ సైతం పాతబస్తీలో పట్టు బిగిస్తున్నారు. మొన్నటి వరకు వీరిని ఎదగనియ్యకుండా రాజాసింగ్ చక్రంతిప్పారట. ఇప్పుడు వీరి టైమొచ్చింది. అందుకే తన జాతీయస్థాయి పరిచయాలతో రాజాసింగ్‌కు చుక్కలు చూపెట్టడం మొదలుపెట్టారట ఆలే సోదరులు. గోషామహల్ పార్టీలో రాజాసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తే, ఆలే కుటుంబం రాజకీయ ఎదుగడం మరింత కష్టం. అందుకే ఆలే శ్యాంజీ, రాజాసింగ్‌కు పార్టీలో చెక్ పెట్టడం మొదలెట్టారట. పార్టీలో ఆయన అనుచర గణానికి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం పార్టీలో ఉంది.
దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంలో, ప్రస్తుతం కీలకంగా ఉన్న మరో సీనియర్ నేత సైతం, రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ నుంచే పావులు కదుపుతున్నారట. అందుకే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కాకుండా, పార్టీలో గ్రూపు పాలిటిక్స్‌ను పెంచిపోషిస్తూ, తన వర్గాన్ని తొక్కిపెడుతున్నారంటూ కేవలం కొందరే టార్గెట్‌గా సీరియస్‌గా స్పందించారు రాజాసింగ్. మొత్తానికి క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో, గ్రూపు పాలిటిక్స్‌కు మరో నిదర్శనంగా కనిపిస్తోంది రాజాసింగ్ కామెంట్ల వ్యవహారం. గోషామహల్‌తో పాటు పాతబస్తీలో తన ఎదుగుదలను తొక్కేసేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట రాజాసింగ్. తనకు ప్రత్నామ్నాయంగా ఆలే సోదరులను బలపరుస్తున్నారంటూ టెన్షన్ పడుతున్నారట. ఇదీ రాజాసింగ్ కామెంట్ల కలకలం వెనక, ఆయన వర్గానికి కమిటీలో చెక్ పెట్టడం వెనక అసలు కథ. ఈ కోల్డ్‌వార్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire