ప్రేమ పుస్తకంలో అవే రక్తపు మరకలు

ప్రేమ పుస్తకంలో అవే రక్తపు మరకలు
x
Highlights

ఏమిటి ఈ హత్యలు, ఎవరి కోసం, ఏం సాధించడం కోసం పసి మొగ్గలని చిదిమేస్తున్నారు. పరువు కోసం పాకులాడి పేగు బంధాన్ని బలితీసుకుంటున్నారు. ప్రేమించడమే వారు...

ఏమిటి ఈ హత్యలు, ఎవరి కోసం, ఏం సాధించడం కోసం పసి మొగ్గలని చిదిమేస్తున్నారు. పరువు కోసం పాకులాడి పేగు బంధాన్ని బలితీసుకుంటున్నారు. ప్రేమించడమే వారు చేసిన నేరమా తక్కువ కులం వారిని పెళ్లి చేసుకోవడం.. చంపడం కంటే హీనమా.. ఒప్పుకోని పెద్దలకు దూరంగా బతకడమే వారు చేసిన పాపమా.. కులం, మతం, పరువు, ప్రతిష్టలు ఎవర్ని ఉద్ధరించడానికి? జైలుకెళ్లిన వాళ్ల పరువు నిలబడుతుందా? నవ జంటలను విడగొట్టి, విషాధాన్ని నింపుతున్న తల్లిదండ్రుల్లో మార్పు వచ్చేదెప్పుడు?

అనాదిగా అదే రక్త చరిత్ర. ప్రేమ పుస్తకంలో అవే రక్తపు మరకలు. అబ్బాయీ, అమ్మాయీ ప్రేమించుకోవడం, పెద్దలకు నచ్చకపోవడం, పిల్లలు దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించడం. కన్నవాళ్లు కక్ష పెంచుకొని హత్య చేయడం.. ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు. పరువు కోసం పాకులాడి, ప్రాణాలు తీసి, జీవితం జైలుపాలు చేసుకొని సాధించేదేంటి?

మమ్మల్నే తిరస్కరిస్తారా అనే మొండిపట్టు తప్పా వయసొచ్చిన పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయని గ్రహించడం లేదు. మామాటే వినాలి, మేం చెప్పినట్లే నడుచుకోవాలనే ధోరణి పంతాలకు దారితీసి, ప్రాణాలను హరిస్తోంది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని నవ దంపతుల్ని హత్య చేయడం అత్యంత దారుణం. పరువు, ప్రతిష్ట అన్న మాయలో పడి కన్నబిడ్డల్నే చంపేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా గొంతు నులిమేస్తున్నారు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని పరువు పోయిందని, కుల పెద్దలు గద్దల్ల పీక్కతింటారేమో అనే భ్రమలో హత్యలకు ఒడిగడుతున్నారు. మనుషులను చంపితే ఈ సమాజం సన్మానిస్తుందా.. ప్రాణాలను తీస్తే.. ఆ కులం అవార్డులు ఇస్తుందా.

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన తప్పు తాను తెలుసుకున్న అమృత తండ్రి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐనా తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు ఆగడం లేదు. మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లాలో అనురాధని ఆమె తల్లిదండ్రులు అత్యంత కిరాతకంగా చంపేశారు. పెట్రోలు పోసి తగలబెట్టి, బూడిదను చెరువులో కలిపేశారు. ఒకటి రెండు కాదు. దేశంలో ప్రతినిత్యం ఏదో ఒక చోట పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నైతే ప్రపంచానికి తెలియట్లేదు కూడా. పరువు హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టాలు అంటూ లేవు. ఇదొక సామాజిక జాఢ్యం. దీనికి సంబంధించి పబ్లిక్‌గా మాట్లాడేందుకు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, ప్రజా హక్కుల సంఘాల నేతలు ఇష్టపడరు. వీటితో ఓటు బ్యాంకు రాజకీయాలు ముడిపడి ఉండటమే ఇందుకు కారణం. ‌2006లో ఒక పరువు హత్య కేసు ఘటనలో సుప్రీం కోర్టు మంచి తీర్పును ఇచ్చింది. 'ఈ తరహా హత్యల నిరోధానికి కఠిన చట్టాలు అవసరమని పార్లమెంటుకు గుర్తు చేసింది. కానీ ఇంతవరకు అలాంటి చట్టాల ఊసే లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories