ఆయన ఏదో చేద్దామనుకున్నాడు. కానీ మరేదో అయ్యింది. తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచినట్టుగా, ఆయన పరిస్థితి మారిపోయింది.
ఆయన ఏదో చేద్దామనుకున్నాడు. కానీ మరేదో అయ్యింది. తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచినట్టుగా, ఆయన పరిస్థితి మారిపోయింది. ఆర్టీసీ సమ్మె ఉధృతమవడంతో, మధ్యవర్తిత్వం వహించి, పరిష్కారం చేద్దామని, ఢిల్లీ నుంచి హుటాహుటిన ఫ్లైటెక్కి, హైదరాబాద్‌లో ల్యాండయిన కేకేకు, అసలు విషయం బోధపడి అసహనంతో రగిలిపోయారట. తన మాటకు కనీస విలువ ఇవ్వలేదంటూ, అసంతృప్తితో వున్నారట. కేకే రియాక్షన్‌తో, ఆయనపై కొత్త రూమర్లు చక్కర్లుకొట్టాయి. దీంతో వెంటనే కేసీఆర్, కేకేను పిలిపించుకుని మరీ సముదాయించాల్సి వచ్చింది ఇంతకీ కేకేపై వచ్చిన రూమర్లేంటి టీఆర్ఎస్‌లో కేకే క్రైసిస్ సద్దుమణిగినట్టేనా?
ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉదృతమవుతోంది. సమ్మె విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో మనస్తాపం చెందిన ఇద్దరు కార్మికులు, ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అంతేకాదు కార్మికులు రోజుకో తీరుతో తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు, సమ్మెపై చేస్తున్న కామెంట్స్ కార్మిక సంఘాలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీంతో పరిస్థితి చేజారిపోతోందని భావించిన టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు రంగంలోకి దిగారు. కార్మికులు సమ్మెకు స్వస్తి పలికి ప్రభుత్వంతో చర్చలకు సిద్దం కావాలని కార్మిక సంఘాలకు సూచన చేశారు. అయితే కేకే చేసిన సూచనకు కార్మిక సంఘాలు కూడా స్పందించాయి. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే ప్రభుత్వంతో చర్చలకు రెడీ అన్నాయి. కానీ జరిగింది వేరు.
సమ్మెతో రాష్ట్రంలో పరిస్థితులు చేజారుతున్నాయని చర్చలకు ఉపక్రమించాలని అటు ప్రభుత్వానికి, ఇటు కార్మికులకు సూచన చేశానని కేకే చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లిన కేకే అక్కడినుంచే సమ్మెపై ప్రకటన రిలీజ్ చేశారు. అంతేకాదు హుటాహుటిన హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. అయితే ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకే కేకే ప్రకటన చేసి ఉంటారని కేకే మధ్యవర్తిత్వంతో చర్చలకు కార్మిక సంఘాలను పిలుస్తారని అందరూ భావించారు. ఈ విషయంలో ప్రకటన చేసిన కేకే సైతం, ఇదే భావించినట్టున్నారు. అయినా సిఎం కెసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో, కేకే అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది. తన మాటకు కనీస విలువ ఇవ్వలేదని ఆయన అలిగినట్టు సమాచారం.
టిఆర్ఎస్ లో పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు పార్లమెంటరీ పార్టీ నేతగానూ కొనసాగుతున్నారు కేశవరావు. పార్టీలో కెసీఆర్ తర్వాత ప్రయారీటీ తనదే అన్న భావనలో ఆయన ఉన్నట్టున్నారు. ఈ భావనతోనే కేకే ప్రకటన చేసి ఉంటారని అందరూ మాట్లాడుకుంటున్నారు. తన ప్రకటన తర్వాత సిఎం కెసీఆర్ తనతో మాట్లాడతారని సమ్మె విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని కోరతారని ఆయన అనుకుని ఉండవచ్చనే చర్చ పార్టీలో జరుగుతోంది. కాని సీన్ రివర్స్ కావడంతో ఆయన అసహనానికి లోనయి ఉంటారని తెలుస్తోంది. అందుకునేమో చర్చలు జరపడానికి తానెవరినని, ఇది పార్టీ సమస్య కాదు ప్రభుత్వ సమస్య అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తాను ముఖ్యమంతితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కెసీఆర్ అందుబాటులోకి రాలేదన్నారు. తాను సోషలిస్టునని రాజ్యంవైపు ఉండను కార్మికుల పక్షాన్నే ఉంటానని మాట్లాడటం కెసీఆర్ పై ఉన్న అసహనానికి నిదర్శనమన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
టిఆర్ఎస్‌లో ఆర్టీసీ సమ్మెపై మంత్రులు ఇస్టారాజ్యంగా మాట్లాడటాన్ని కేకే తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో సీనియర్లుగా తమతో ఏ అంశంపై కూడా కేసీఆర్ మాట్లాడటం లేదనే అభిప్రాయంతో, పార్టీలో సీనియర్లు ఉన్నారు. పార్టీలో సీనియర్ నేత, కార్మిక సంఘాల నాయకుడిగా పేరున్న నాయిని నర్సింహారెడ్డి లాంటి వాళ్లు సైతం కెసీఆర్ వైఖరిపై లోలోపల రగిలిపోతున్నారన్న చర్చ సాగుతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో ఇంత రచ్చజరుగుతున్నా కనీసం తమతో చర్చించి తమ అభిప్రాయాలను తీసుకుంటే ఈ అంశం ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని, కేకేతో పాటు పలువురు సీనియర్ల వాదనగా తెలుస్తోంది.
తన మాటకు విలువనివ్వడం లేదని కేకే నొచ్చుకున్నందుకే, చర్చలు జరపడానికి తానెవర్ని అన్నారని అర్థమవుతోంది. ఒకదశలో, తనకు అవమానం జరిగిందన్నట్టుగా ఫీలవుతున్న కేకే, పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని కూడా, కొన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. దీంతో వెంటనే కేకేను కేసీఆర్ పిలిపించుకుని మాట్లాడారని తెలుస్తోంది. ప్రగతి భవన్‌కు కేకేను పిలిపించుకున్నది సముదాయించానికా, తొందరపడి ప్రకటన చేసినందుకు మందలించడానికా, లేదంటే సమ్మె విషయంలో ఏం చేద్దామని చర్చించడానికా అన్నది, ఆసక్తి కలిగిస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire