TS Assembly Monsoon Sessions 2021: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

Indefinite adjournment of Telangana Assembly Monsoon Sessions 2021 | Telugu Online News
x

TS Assembly Monsoon Sessions 2021: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

Highlights

TS Assembly Monsoon Sessions 2021: *సెప్టెంబర్ 24 నుంచి ఈనెల 8వరకు సాగిన సభ *ఏడు రోజుల పాటు సమావేశాలు

TS Assembly Monsoon Sessions 2021: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. వర్షకాల అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగాయి. సెప్టెంబర్ 24న మొదలైన సమావేశాలు ఈనెల 8తో ముగిశాయి. మొత్తం 7 రోజుల పాటు సభ నడిచింది. 7 బిల్లులకు, ఒక తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఏడు రోజుల సమావేశాల్లో సభ 37 గంటల 5 నిమిషాలు జరిగింది. మొత్తం 27 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 41 మంది ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొన్నారు. 101 సభ్యులున్న టీఆర్‌ఎస్‌కు 9గంటల 2 నిమిషాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి 11గంటల 8 నిమిషాల సమయం ప్రసంగించారు. ఆరు అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. సభలో చర్చించిన ఆరు అంశాల్లో టీఆర్ఎస్ ఇచ్చినవి నాలుగు, మజ్లిస్, కాంగ్రెస్ ఒక్కొ అంశం ఉన్నాయి.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా చివరి రోజు బీసీ కులగణనపై తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేపట్టాలంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. 2021లోనే జనగణన చేయనున్నారని.. రాష్ట్రంలో అత్యధికంగా 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రయోజనం చేకూరాలంటే కులగణన చేపట్టాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో సమావేశాలు సజావుగా సాగాయన్నారు. వాకౌట్‌ లేకుండా సభ జరిగిందని మంత్రి తెలిపారు. ఐటీ, పురపాలక, మైనారిటీ సంక్షేమం, హరితహారం, పాతబస్తీ ప్రాంత అభివృద్ధి, దళితబంధు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై సభలో సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు.

అటు శాసనసభ మండలిలో రెండు బిల్లులను శాసనసభలో చర్చించి ఆమోదించారు. తెలంగాణ GST సవరణ బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రింటింగ్ ఆఫ్ షూటింగ్ అండ్ మాల్ ప్రాక్టీస్ టూల్స్ అండ్ ట్రావెల్స్ బిల్ 2021లకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అమెండ్‌మెంట్ బిల్లు, ది నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఇండియన్ స్టాంప్స్ బిల్లుకి ఆమోదం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories